గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 30, 2020 , 23:12:19

సంక్షేమానికే సీఎం కేసీఆర్‌ పెద్దపీట

సంక్షేమానికే సీఎం కేసీఆర్‌ పెద్దపీట

  • l  పేదింటి ఆడపడుచుకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండ
  • l   లాక్‌డౌన్‌లోనూ సంక్షేమ పథకాల అమలు
  • l   కరోనాపై అప్రమత్తంగా ఉండి   జాగ్రత్తలు పాటించాలి
  • l  జిల్లాలో 200 బెడ్లతో    రెండు కొవిడ్‌ దవాఖానాలు
  • l  ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • l  గజ్వేల్‌లో 305మందికి కల్యాణలక్ష్మి,  షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

గజ్వేల్‌ అర్బన్‌: పేదింటి ఆడబిడ్డలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ మహతి ఆడిటోరియంలో గురువారం డివిజన్‌లోని 305మందికి రూ.3కోట్ల 46లక్షలకు పైగా విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నిర్వహిస్తూ ఆడపడులకు అండగా నిలిచారన్నారు. కరోనాతో దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయని, రాష్ర్టానికి కూడా పూర్తిగా ఆదాయం తగ్గిపోయిందన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతులకు రైతుబంధు పథకాలను కొనసాగిస్తూ డబ్బులు పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు గజ్వేల్‌ డివిజన్‌లో దాదాపు 5వేల మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు వెల్లడించారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు సైతం అందరికీ అందిస్తూ ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారన్నారు. అలాగే రేషన్‌ దుకాణాల ద్వారా 10కిలోల బియ్యం, కందిపప్పు నెలనెలా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇంత సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా సీఎం కేసీఆర్‌ ప్రజల కోసమే కొనసాగిస్తున్నారన్నారు. 

  జిల్లాలో 200 బెడ్లతో  రెండు కొవిడ్‌ దవాఖానలు

కరోనాను ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు సీఎం కేసీఆర్‌ చేశారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జిల్లా ప్రజల కోసం సిద్దిపేటలో 100 పడకల దవాఖాన, వంటిమామిడి ఆర్వీఎం దవాఖానలో 100పడకలతో కూడిన కరోనా వైద్య సేవలకు దవాఖానలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జలుబు, జ్వరం వంటివి వస్తే సొంత వైద్యం చేసుకోవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. వ్యాధి లక్షణాలుంటే ముందస్తుగా పరీక్షలు చేసుకోవడంతో వల్ల ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని సూచించారు. ప్రజలంతా వేడినీళ్లు, కషాయం, సంత్రాలు, బత్తాయిలు తీసుకొని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. కరోనా మందు ఎప్పుడైనా అందుబాటులోకి రావచ్చని అప్పటివరకు ప్రజలంతా మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణశ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయుద్దీన్‌, గజ్వేల్‌, మర్కూక్‌ ఎంపీపీలు అమరావతి, పాండు, జడ్పీటీసీ  మల్లేశం, వైస్‌ ఎంపీపీ కృష్ణగౌడ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ చిన్నమల్లయ్య, గుండా రంగారెడ్డి, తహసీల్దార్లు అన్వర్‌, ఆరిఫా, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.logo