శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jul 30, 2020 , 23:12:37

ఉద్యాన సాగుకు ఊతం

ఉద్యాన సాగుకు  ఊతం

  • n పంటలు సాగుచేసే రైతులకు భారీగా సబ్సిడీలు
  • n రెండు నుంచి నాలుగేండ్ల పాటు   నిర్వహణ ఖర్చులు
  • n కూరగాయల పందిరి సాగుకు ప్రోత్సాహం
  • n పండ్ల తోటలు మరింత సాగుచేసేలా సబ్సిడీలు..
  • n ఉపాధి హామీలో జాబుకార్డు ఉన్న  రైతులకు అవకాశం
  • n ఉద్యాన, గ్రామీణాభివృద్ధి శాఖల   పర్యవేక్షణలో పథకం అమలు 
  • n సంగారెడ్డి జిల్లాలో మరింతగా  అమలుకు సర్కారు యత్నం

సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి, ఉద్యాన,వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగును మరింతగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ రంగం సిద్ధం చేస్తున్నది. ప్రధానంగా కూరగాయలతో పాటు పండ్ల తోటల సాగును పెంచాలని నిర్ణయించింది.   ఈ నేపథ్యంలో ఈ పంటల సాగుకు రైతులను మరింతగా ప్రోత్సహించనుంది. పందిళ్ల సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈ  నేపథ్యంలో దీనిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పందిళ్ల సాగుతో రైతులు సీజన్‌ను బట్టి కూరగాయలు సాగుచేస్తున్నారు. ఇది రైతులకు లాభదాయకంగా మారింది.

జహీరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటలు సాగుచేసే అన్నదాతలను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై నిధులు మంజూరు చేస్తున్నది. ఉద్యాన పంటలు సాగుచేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున సబ్సిడీలు ప్రకటించింది. పంటల నిర్వహణ ఖర్చులు సైతం చెల్లిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేస్తున్నది. ఈజీఎస్‌ జాబ్‌కార్డు ఉన్న వారికి అవకాశం ఉంది. పందిరి కూరగాయల సాగుతో పాటు ఆయిల్‌ పామ్‌ తోటల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఉపాధి హామీలో జాబ్‌కార్డులు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. సామాజిక అడవుల విస్తరణలో శ్రీగంధం, మలబారు, వేప, సరుగుడు, టేక్‌ , వెదురు మొక్కలు నాటేందుకు అవకాశం కలిపించింది. ఒక్కో రైతు పది గుంటల నుంచి ఐదు ఎకరాల్లో వీటిని పెంచుకోవచ్చు. దీనికి గాను సబ్సిడీ పొందవచ్చు. సామాజిక అడవుల పథకంలో మొక్కలు నాటుకోవడంతో రైతులు ఆర్థికంగా మేలు జరిగే అవకాశం ఉంది. శ్రీగంధం వేసుకొనే రైతులు 10 నుంచి 15 ఏండ్లలో ఒక్కో చెట్టుకు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు లాభాలు పొందవచ్చు. శ్రీగంధం మొక్కలు ఒకటే పెరగలేవు. పరాన్న జీవులపై ఆధారపడి ఉంటాయి. శ్రీగంధంతో పాటు వెదురు, జామ, సరుగుడు, మామిడి, బత్తాయి వేసుకోవాలి. ఇవి వేసుకోవడంతో పండ్ల చెట్ల నుంచి రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. వెదురు వేసుకొనే రైతులు మూడేండ్ల నుంచి దిగుబడి పొందవచ్చు. చెట్ల మధ్య అంతరు పంటలు సాగుచేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకంలో రైతులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుకోవాలి. మొక్కల సంరక్షణ కోసం మూడేండ్ల వరకు సంరక్షణ ఖర్చులు చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న రైతు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. 

పంటల వారీగా సబ్సిడీల వివరాలు...

ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నది. 

n శ్రీగంధం సాగుచేసే రైతులకు ఎకరానికి 160   మొక్కలు, మెటీరియల్‌ ఖర్చులు రూ. 27,604, కూలీల ఖర్చులు రూ. 75,604 వేలు, ఎకరానికి  రైతుకు రూ. 1,03,245 లక్షలు ప్రభుత్వం  చెల్లిస్తున్నది. 

n మలబారు ఎకరానికి 444 మొక్కలు,  మెటీరియల్‌ ఖర్చు రూ.16,277, కూలీల  ఖర్చు రూ. 50,855, మొత్తం 67,132 వేలు  ప్రభుత్వం చెల్లిస్తున్నది. 

n వెదురు ఎకరాకు 160 మొక్కలు, మెటీరియల్‌  ఖర్చు రూ. 17,189, కూలీల ఖర్చు  రూ. 18,478 వేలు, మొత్తం  రూ. 35,667 చెల్లిస్తారు. మూడేండ్ల వరకు రైతులకు మొక్కల సంరక్షణ  కోసం డబ్బులు చెల్లిస్తారు. 

పండ్లు తోటల పెంపకం కోసం

సామాజిక అడవుల పెంపకం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్తగా మొక్కలు నాటే రైతులకు పండ్ల తోటలు సాగు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. మామిడి, జామ, దానిమ్మ, సపోటా, సీతాఫలం, నేరేడు, బత్తాయి వంటివి సాగుచేసేందుకు సబ్సిడీ అందిస్తారు. కూరగాయలు సాగుచేసే రైతులు రాయి కడీలు పందరి వేసుకొనే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన పంటలు సాగుచేసుకోవాలి. 

జాబు కార్డు ఉన్న రైతులకు ప్రోత్సాహం...

ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును పెంచేందుకు భారీగా సబ్సిడీలు ప్రకటించింది. కూరగాయల పందిళ్ల నిర్మాణం, శ్రీగంధం, వెదురు మొక్కల పెంపకం చేపట్టవచ్చు. రైతులు ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉన్నట్లతే దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్సిడీలు వర్తింపజేస్తాం. పంటల నిర్వహణ ఖర్చులు సైతం మరో రెండు, మూడేండ్లు అందజేస్తాం. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులు కరెంట్‌, నీటి సౌకర్యం కలిగి ఉంటే ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. జహీరాబాద్‌ ప్రాంత రైతులు 7997725432కు ఫోన్‌ చేసి సంప్రదించాలి. 

-అనూషారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి  జహీరాబాద్‌