ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 30, 2020 , 00:03:30

‘చెత్త’కాదిది సంపద

‘చెత్త’కాదిది సంపద

  • n ఎరువుగా మార్చే క్రషింగ్‌ మిషన్‌
  • n ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొదటిసారిగా   ఎద్దుమైలారంలో ఏర్పాటు
  • n రూ.4.20 లక్షలతో డంపింగ్‌యార్డులో ప్రారంభం
  • n కేజీకి రూ.6 చొప్పున విక్రయం
  • n కొబ్బరిబోండాన్ని క్రష్‌ చేయగల 5 హెచ్‌పీ మోటరు
  • n 100 కేజీల తడిచెత్తతో 80కేజీల ఎరువు తయారీ
  • n 80 కేజీల ఎరువు  తీయడానికి రూ.250-300 వరకు ఖర్చు
  • n గ్రామంలో  పలువురికి ఉపాధి

ప్రభుత్వం ముందుచూపుతో పల్లెప్రగతిలో నిర్మించిన డంపింగ్‌యార్డులతో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రోజూ వాడిపడేసే ‘చెత్త’ కాసులు కురిపిస్తున్నది. సంపదనూ సృష్టిస్తున్నది. అంతేకాకుండా స్థానికంగా కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం సర్పంచ్‌ కాసాల మల్లారెడ్డి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారీచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ఎద్దుమైలారం గ్రామాన్ని సందర్శించి ఎరువు తయారీ విధానాన్ని చూసి సర్పంచ్‌ను అభినందిస్తున్నారు. దీని ద్వారా గ్రామంలో పలువురికి ఉపాధి దొరుకుతున్నది. 

కంది : మార్కెట్లో ప్రస్తుతం ఎన్నోరకాల కొత్త తరహా మిషన్లు చెత్తను ఎరువుగా మారుస్తున్నాయి. అందులో షెడ్డింగ్‌ మిషన్‌ (క్రషింగ్‌ యంత్రం) రూ.4.20 లక్షల  పంచాయతీ నిధులతో నిర్మించిన డంపింగ్‌యార్డులో సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దుమైలారం సర్పంచ్‌ కాసాల మల్లారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా రోజుకకు వందల కేజీల ఎరువును సులువుగా కేవలం గంటల వ్యవధిలో తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన ఎరువును విక్రయించి పంచాయతీకి ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన క్రషింగ్‌ మిషన్‌ ద్వారా తడిచెత్తతో తయారు చేసిన ఎరువును కేజీకి రూ.4-6  చొప్పున విక్రయిస్తున్నారు. కేవలం 2 గంటల్లోనే వంద కేజీల ఎరువు తయారవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామం అందరి దృష్టిని ఆకర్షించింది. 

త్వరలోనే మరో ఇన్సిలేటర్‌ మిషన్‌.. 

బయో వేస్టును బూడిదగా మార్చి రైతులకు, ఇటుకల తయారీకి ఉపయోగపడే ఇన్సిలేటర్‌ యంత్రాన్ని కూడా త్వరలోనే ఎద్దుమైలారంలో ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌లో దీని ధర రూ.6.40 లక్షలు ఉంది.  ఇప్పటికే దీనిని చెన్నైలో సర్పంచ్‌ మల్లారెడ్డి ఆర్డర్‌ చేశారు. మరికొద్ది రోజుల్లోనే సదరు యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక పరికరమైన ఇన్సిలేటర్‌లో అన్నిరకాల బయోవేస్టు వేస్తే గంటల వ్యవధిలో బూడిదగా మారిపోతుంది. ఇది రైతులు తమ పొల్లాలో ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా బూడిద ద్వారా సిమెంట్‌ ఇటుకలు తయారు చేయవచ్చు. వీటితో తయారైన ఇటుకలు ఎంతో గట్టిగా కూడా ఉంటాయి. వీటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నది.రూ.4.20 లక్షలతో ఏర్పాటు.. 

కొత్తగా నిర్మించిన డంపింగ్‌ యార్డు ఆవరణలో సర్పంచ్‌ మల్లారెడ్డి  పంచాయతీ నిధుల ద్వారా రూ.4.20 లక్షలతో షెడ్డింగ్‌ మిషన్‌ (క్రషింగ్‌ యంత్రాన్ని) ఏర్పాటు చేయించారు. కొత్త రకం యంత్రమైన దీనికి 5హెచ్‌పీ మోటరు కలిగి ఉండడంతో కొబ్బరిబోండాన్ని సైతం అవలీలగా క్రష్‌ చేయగలదు. 100 కేజీల తడిచెత్తతో 80 కేజీల ఎరువు తయారు అవుతున్నది. అదికూడా కేవలం రెండు గంటల వ్యవధిలోనే. వందల కేజీల తడిచెత్తలో మోతాదుకు తగ్గట్టు కోకాపౌడర్‌ వాడి క్రషింగ్‌ మిషన్‌ ద్వారా 80 కేజీల ఎరువు తయారై బయటికి వస్తున్నది. ఇందుకు సుమారు రూ.250 నుంచి 300 వరకు ఖర్చు అవుతున్నది. డిమాండ్‌ను బట్టి ఎంత కావాలంటే అంత ఎరువును గంటల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎరువు తయారీలో మొత్తం ఐదుగురు గ్రామస్తులు రోజూవారీగా పనిచేస్తున్నారు. వారికి గ్రామంలోనే ఉపాధి లభించడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఎరువుకు పెరిగిన డిమాండ్‌..

ఎరువు తయారీ చేయాలంటూ పలువురి నుంచి డిమాండ్‌ పెరగడంతో అందుకు అయ్యే పెద్ద మొత్తం తడిచెత్త సేకరణలో సర్పంచ్‌ నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున తడిచెత్త సేకరణ కోసం పక్కనే ఉన్న ఓడీఎఫ్‌ కూరగాయల మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లను సంప్రదించనున్నారు. 

ఉమ్మడి జిల్లాలో మొదటిది..  

గ్రామంలో సేకరిస్తున్న తడిచెత్త ద్వారా ఎరువును తయారు చేయాలనే ఆలోచన కలిగింది. ఇందుకోసం పలువురిని సంప్రదించి ఎరువు తయారీ యంత్రాన్ని రూ.4.20 లక్షల జీపీ నిధులతో కొనుగోలు చేశాం. రోజుకు వందల కేజీల ఎరువు తయారు చేస్తున్నాం. కొద్ది రోజుల్లోనే ఎరువుకు డిమాండ్‌ బాగా పెరిగింది. పలువురు ప్రజాప్రతనిధులు కూడా మా గ్రామాన్ని సందర్శించి యంత్రం పనితీరును అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో ఎరువు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రధానంగా ఎరువు తయారీకి అవసరమైన తడిచెత్త సేకరణకు పలు మార్కెట్లను సంప్రదించాం. అందరి సహకారంతోనే ఇది సాధ్యపడింది.

- కాసాల మల్లారెడ్డి, ఎద్దుమైలారం సర్పంచ్‌, సంగారెడ్డి జిల్లా


logo