ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 28, 2020 , 02:29:05

సంగారెడ్డి జిల్లాలో వేగంగా వైకుంఠధామాల నిర్మాణం

సంగారెడ్డి జిల్లాలో వేగంగా వైకుంఠధామాల నిర్మాణం

  • రాత్రింబవళ్లు కొనసాగుతున్న పనులు
  • జంబ్గీ(కే)లో గాడిదలపై సిమెంట్‌ తరలింపు
  • వర్షాలతో ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితిలో గాడిదలతో పనులు
  • నెలాఖరు నాటికి పూర్తిచేయడం లక్ష్యం..
  • రోజువారీగా కలెక్టర్‌ పర్యవేక్షణ
  • టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు

గాడిదలపై సిమెంట్‌ తరలిస్తున్నారు. వర్షాలతో వచ్చిన బురదలో ట్రాక్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గాడిదలను వాడుతున్నారు. సమయం తక్కువగా ఉండడం, ఆలోగా లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదలతో అధికారులు రాత్రింబవళ్లు వెంటపడి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలోని మారుమూల గ్రామం జంబ్గీ(కే)లో వైకుంఠధామం నిర్మాణం వద్ద కనిపించిన దృశ్యం ఇది. జిల్లా పంచాయతీ అధికారి, మండల అధికారులు, పంచాయతీ సిబ్బంది దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే డంపింగ్‌ యార్డులు పూర్తయిన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన సంగారెడ్డి జిల్లాను, వైకుంఠధామాల నిర్మాణంలో ముందు నిలిపేలా అధికారులు పనిచేస్తున్నారు. నిత్యం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు.

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, సోమవారం సాయంత్రం వరకు 450 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యింది. మరో 150 గ్రామాల్లో కేవలం మూడు, నాలుగు రోజుల్లో పూర్తికానున్నాయి. ఇక మిగిలిన 47 గ్రామాల్లో పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం ప్రధాన దృష్టిసారించింది. 

450 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి...

ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాలో అన్ని పంచాయతీల్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. కాగా, సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 450 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగులతో సహా నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 150 వరకు గ్రామాల్లో ప్లాస్టరింగ్‌, రంగుల దశలో పనులు ఉన్నాయి. ఆ పనులు వేగంగా చేయిస్తున్నారు. అధికారులు, సిబ్బంది దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో వీటి పనులు పక్కాగా పూర్తికానున్నాయి. ఇక మిగిలిన 47 గ్రామ పంచాయతీల్లో పనులు కొంత వెనుకబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యేకాధికారులకు  కలెక్టర్‌ హనుమంతరావు బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో నిర్మాణాలు కొంత వెనుకబడ్డాయి. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షీషా, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ఆ గ్రామాల్లో దగ్గరుండి పనులు పూర్తి చేయిస్తున్నారు.

నెలాఖరులోగా పూర్తి చేయించేలా..

నెలాఖరులోగా జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయించే లక్ష్యంతో కలెక్టర్‌ హనుమంతరావు పనిచేస్తున్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షీషా, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు రోజువారీగా గ్రామాలు పర్యటిస్తూ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 647 పంచాయతీలు ఉంటే, అన్ని చోట్ల డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయింది. చాలా గ్రామాల్లో చెత్తతో ఎరువుల తయారీ కూడా మొదలైంది. అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయిన జిల్లాగా సంగారెడ్డికి మంచి పేరొచ్చింది. మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్‌ హనుమంతరావుతో పాటు ఇతర అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైకుంఠధామాల నిర్మాణంలో కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. వర్షాలతో పలుచోట్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఈ క్రమంలో ఆలాంటి చోట్ల వచ్చే నెల 7 వరకు అవకాశం ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

గాడిదలపై సిమెంట్‌ తరలింపు..

వర్షాలతో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు వెళ్లలేని చోట్లకు గాడిదల ద్వారా సిమెంట్‌ తరలించి వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. జిల్లాలోని కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ పనులు ఆగకూడదని భావించిన అధికారులు, బురద మార్గం నుంచి గాడిదల ద్వారా సిమెంట్‌ తరలిస్తున్నారు. కంగ్టి మండలం జంబ్గీ(కే) గ్రామంలో గాడిదలు వైకుంఠధామ నిర్మాణానికి సిమెంట్‌ తరలిస్తున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఈ పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. నెలాఖరు వరకు నిర్మాణాలు పూర్తయితాయని, ఎక్కడో ఓ చోట మిగిలితే, వాటిని ఆగస్టు 7 వరకు పూర్తి చేయిస్తామని డీపీవో ‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు.logo