శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jul 26, 2020 , 22:37:18

పచ్చందాల పల్లె ప్రకృతి వనం

 పచ్చందాల  పల్లె ప్రకృతి వనం

కొండాపూర్‌ :  సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో అలీయాబాద్‌ గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు దత్తత తీసుకున్నారు. గ్రామానికి అనుకుని ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఎకరా స్థలంలో మొత్తం వివిధ రకాల పూల మొక్కలను ఇందులో కలెక్టర్‌ నాటించారు. మొక్కలను నాటడంతో పాటు మధ్యలో రోడ్డును ఏర్పాటు చేశారు. పల్లె ప్రగతి అమలుతో అలీయాబాద్‌ గ్రామా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడింది. పరిసరాల పరిశుభ్రతకు గ్రామస్తులు ప్రాధాన్యతనిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అలీయాబాద్‌ గ్రామం పేరు వినిపిస్తున్నది. ఈ గ్రామంలో యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసిన తరహాలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇది జిల్లాలో మిగతా గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచింది. దీని ఏర్పాటుకు అధికారులు ఎంతగానో శ్రమించారు. కేవలం 18 రోజుల్లో పల్లె ప్రకృతి వనాన్ని సిద్ధం చేశారు. 

యాదాద్రి తరహాలో...

యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసినట్లుగా పల్లె ప్రకృతి వనాన్ని అలీయాబాద్‌ గ్రామంలో ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనంలో చిన్నారులు ఆడుకునేందుకు ఆటవస్తువులు, బల్లాలు ఏర్పాటు చేశారు. ఉదయం గ్రామస్తులు వాకింగ్‌ చేసుకోవడానికి వనం మధ్యలో రోడ్డును ఏర్పాటు చేశారు. ఎకరా స్థలంలో 4,050 మొక్కలు నాటారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్న ప్రదేశానికి ఆనుకుని ఈ పార్కు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరి సహకారంతోనే..

పల్ల్లె ప్రకృతి వనం ఏర్పాటులో అందరి సహకారం ఉంది. స్థానిక సర్పంచ్‌ ఫయీం, అధికారులు ఎంతగానే సహకరించారు. కలెక్టర్‌ హనుమంతరావు, జిల్లా అధికారుల సలహాలు, సూచనలతో అలీయాబాద్‌లో పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాం. కొంతమంది దాతలతో పార్కు స్థలంలో వివిధ రకాల ఆటవస్తులు ఏర్పాటు చేస్తున్నాం. ఉప సర్పంచ్‌ సత్యం, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తులు ఎంతగానో సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. - ఆర్‌.స్వప్న, ఎంపీడీవో కొండాపూర్‌ (సంగారెడ్డి జిల్లా)


logo