మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jul 26, 2020 , 02:02:59

ఆదాయ వనరులపై దృష్టి సారించండి

ఆదాయ వనరులపై దృష్టి సారించండి

  • కమిషనర్లతో సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి
  • పాపన్నపేట, టేక్మాల్‌ మండలాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

మెదక్‌ : మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. వాటర్‌ ఆడిట్‌లో మున్సిపాలిటీల్లో ప్రజలకు ఎంత నీరు అవసరం, ఎంత నీరు సరఫరా అవుతుంది... వాటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా... అన్న అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. తెల్లరేషన్‌ కార్డు  ఉన్న వారికి ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌, మిగతా వారికి రూ.వందకు నల్లా కనెక్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నల్లా కనెక్షన్లను తొలిగించాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులపై దృష్టి సారించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు కరెంటు బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు. విద్యుత్‌ పొదుపు పాటించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ లైట్లు పెట్టించాలన్నారు. పని చేయని బోర్ల కనెక్షన్లను తొలిగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తులు చేసుకోండి

జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమానికి ఆసక్తి గల ఆవిష్కర్తలు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్ని జిల్లాల్లో ఆన్‌లైన్‌లో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటిలో, వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని, సమస్యలకు పరిష్కారాలను ఈ ఆవిష్కర్తలు ద్వారా తెలియజేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ, విద్యార్ధి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించవచ్చని తెలిపారు.     ఆసక్తి గల వారి వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఈ నెల 31వతేదీ లోగా పంపించాలని కలెక్టర్‌ వివరించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి సెల్‌ఫోన్‌ 8328599157లో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో డీఈవో రమేశ్‌కుమార్‌, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, డీఏవో పరశురాంనాయక్‌, డీపీవో హనోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయండి

పాపన్నపేట : రైతు వేదికల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. శనివారం ఆయన టేక్మాల్‌కు వెళ్తూ పొడ్చన్‌పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా డంపింగ్‌ యార్డులకు తీసుకురావాలన్నారు. రోడ్డు పక్కల మొక్కలు నాటి, ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట పాపన్నపేట ఎంపీపీ చందనప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, పొడ్చన్‌పల్లి సర్పంచ్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్‌ బలరాం, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి పల్లెలో ప్రకృతి వనం...

టేక్మాల్‌ : ప్రతి పల్లెలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. శనివారంమండల కేంద్రం టేక్మాల్‌లో రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించిన అనంతరం సాలోజిపల్లిల్లో పల్లెప్రకృతి వనంలో మొక్కలను నాటారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో నాలుగువేల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట డీపీవో హనోక్‌, జిల్లా వ్యవసాయ అధికారి రాంప్రసాద్‌, జడ్పీటీసీ సరోజ, తహసీల్దార్‌ గ్రేసీబాయి, ఎంపీడీవో హిరణ్మయి ఉన్నారు.


logo