బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Jul 26, 2020 , 00:07:38

ఒత్తిడికి గురవుతున్న మనిషి

ఒత్తిడికి గురవుతున్న మనిషి

 • చిన్న సమస్యకు విపరీతమైన ఆందోళన
 • క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు 
 • ఆసరా కోల్పోతున్న కుటుంబాలు
 • కంప్యూటర్‌ యుగంలోనూ తప్పని సమస్య
 • సానుకూల వైఖరితో ఒత్తిడిపై జయం

నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి విపరీతమైన ఒత్తిడి, కుంగుబాటుకు గురవుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నాడు.  సానుకూలంగా ఆలోచించలేక నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నాడు. ఊరికనేమనస్తాపానికి గురువుతున్నారు. దీనికి తోడు మానవ సంబంధాలు తగ్గిపోవడం.. ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం పెరగడం.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో మంచీచెడ్డల గురించి చెప్పేవారు, పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడడం వంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నాడు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్నివర్గాల వారు ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు పల్లె, పట్నం అని తేడా లేకుండా అంతటా చోటుచోసుకోవడం బాధించే విషయం. 

గజ్వేల్‌ టౌన్‌:  నేటి ఉరుకులు, పరుగుల జీవితం, కంప్యూటరు యుగంలో జనం విపరీతమైన ఒత్తిడి, కుంగుబాటుకు లోనవుతున్నారు. నేటి సమాజంలో నానాటికి మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం పెరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడంతో పిల్లలు, యుక్త వయసులో వారు వేసే తప్పటడుగులను సరిచేసి, సర్దిచెప్పి సరైన దారిచూపే మార్గదర్శి ఎవరూ ఉండడం లేదు. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లూ పెరుగుతున్నాయి. ఫలితంగా మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, గృహిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల వారికి కుంగుబాటు వంటి రుగ్మతలు పెరుగుతున్నాయి.

ప్రేమలు, కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, అనుమానం, బయటి వ్యక్తులతో మాటామాటా పెరిగి ఘర్షణలు చోటుచేసుకోవడం ఓ వైపు.. ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మరోవైపు. కారణం ఏదైనా ప్రాణాలు తీసుకునేంత శిక్ష పడుతోంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తి తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో స్వీయ పరిశీలన చేసుకోకపోవడంతోనే ఈ అనర్ధాలు జరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఆత్మహత్యలు చూస్తుంటే ‘మన పయనం ఎటు..?’ అన్న సందేహం వ్యక్తమవుతోంది. 

మానసిక రుగ్మత లక్షణాలు...

సాధారణ చికిత్సకు లొంగని దీర్ఘకాలిక ఒళ్లునొప్పులు, తలనొప్పి, గుండెదడ, భయం, త్వరగా అలసిపోవడం, ఆకలి మందగించడం, కారణం లేకపోయినా కోపం రావడం, బరువు తగ్గడం లేదా పెరగడం, నిద్రలేమి, అలసట, నీరసంగా ఉండడం, ఏదో తప్పు చేశానన్న భావన, ఆందోళన, నిర్లిప్తంగా ఉండటం, ఏకాగ్రత లోపించడం, చావు, ఆత్మహత్య గురించి పదేపదే ఆలోచనలు రావడం వంటివన్నీ మానసిక రుగ్మత లక్షణాలే.

విద్యార్థుల్లో..

విద్యార్థి దశలో మానసిక ఒత్తిడికి ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. పది, ఇంటర్‌ చదివే వరకు పరీక్షల భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. డిగ్రీ, ఆపై చదువుల సమయంలో ప్రేమ వైఫల్యం తెరపైకి వస్తోంది. వీటి కారణంగా మద్యపానం, ధూమపానం, గుట్కా, గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారు. ఇది తీవ్ర మానసిక సమస్యగా ఏర్పడి ఆత్మహత్యలకు దారితీస్తోంది. గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ బారినపడి రూ.లక్షలు అప్పు చేసి, తీర్చలేక ప్రాణాలు తీసుకున్న ఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయి.

 • l గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఓ యువకుడు   తనకు చూస్తున్న పెళ్లి సంబంధాలు  నచ్చడం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ  వచ్చాడు. ఈ క్రమంలో  కుటుంబసభ్యులతో మనస్పర్ధలు  ఏర్పడ్డాయి. దీంతో మనస్తాపం చెందిన ఆ  యువకుడు ఈనెల 2న ఇంట్లోనే ఫ్యాన్‌కు  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 • l ఇంటర్‌ వరకు చదివన ఓ యువకుడు  కొన్ని రోజులుగా ఖాళీగా  తిరుగుతుండడంతో తల్లిదండ్రులు  అతడిని మందలించారు. దీంతో  మనస్తాపానికి గురైన ఆ యువకుడు,  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. ఈ ఘటన ఈనెల 1న మెదక్‌  మండలంలోని ఓ గ్రామంలో  చోటుచేసుకుంది.
 • l కౌడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి  చెందిన వ్యక్తి మెదక్‌ జిల్లాల్లోని ఓ  గ్రామానికి చెందిన మహిళను 11 ఏండ్ల  క్రితం వివాహం చేసుకున్నాడు.  కొన్నిరోజుల నుంచి భార్యాభర్తలు గొడవ  పడుతున్నారు. దీంతో భార్య పుట్టింటికి  వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం  లేదని మనస్తాపం చెందిన ఆ వ్యక్తి, ఈనెల 
 • 1న చెట్టుకి ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 • l దుబ్బాక మండలంలో ఓ రైతు వ్యవసాయ  పెట్టుబడి కోసం పలుచోట్ల అప్పులు  చేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు  ఎక్కువయ్యాయి. అప్పుల వారి బాధ  తాళలేక గత నెల 27న ఆత్మహత్యకు  యత్నించాడు. దవాఖానలో చికిత్స  పొందుతూ నాలుగు రోజుల తర్వాత  మృతిచెందాడు. 
 • l ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన  ఓ యువకుడు, ఉరి వేసుకుని  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గతనెల  30న పటాన్‌చెరు మండలంలోని ఓ  గ్రామంలో చోటుచేసుకుంది. ఇలా ఓ  యువకుడు, విద్యార్థి, భర్త, రైతు,  ప్రేమికుడు క్షణికావేశంలో  బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి  కడుపు శోకాన్ని మిగిల్చారు.

ఇవి హెచ్చరికలే..

l చిన్న చిన్న విషయాలకే ఎక్కువ 

అసహనాన్ని వ్యక్తపర్చడం, 

ఎక్కువగా ఆలోచిస్తూ గడపడం, 

చదువులో, ఉద్యోగంలో 

వెనుకబడడం, ఒంటరితనాన్ని 

కోరుకోవడం.

l ఎందుకు బతకాలన్న భావాలు 

తమ మాటల్లో వ్యక్తమవడం.

l పరధ్యానంగా ఉండడం, 

చేసే ప్రతి పనిలో విపరీతమైన 

ఒత్తిడికి గురికావడం, 

చుట్టుపక్కల వారిపై వ్యతిరేకత 

పెంచుకోవడం.

l తాము మృతిచెందితే మంచి 

జరుగుతుందని, పరిస్థితి 

మారుతుందన్న వాదనను 

వినిపించడం.

l గంటల కొద్దీ ఒకేవిధంగా 

పడుకోవడం, ఒకేచోట 

కూర్చోవడం, భోజనం 

తదితరాలపై అనాసక్తి 

ప్రదర్శించడం, స్నేహితులతో 

కలువకుండా 

ఒంటరిగా తిరగడం.

ఇవి పాటిస్తే మేలు..

l కష్టాలకు పరిష్కారం ఏమిటో గ్రహించాలి. 

ఆ పరిష్కారం దిశగా అడుగులు వేసి 

విజయం సాధించాలి.

l రైతులు కుటుంబానికి తామే ప్రధాన 

ఆధారమన్న విషయాన్ని గుర్తించాలి. 

తాము లేకపోతే కుటుంబం మరింత 

ఇబ్బందుల్లో పడుతుందని గుర్తించాలి.

l ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు కుటుంబ 

సభ్యులు స్నేహపూర్వకంగా మెలగాలి.

l భార్యాపిల్లలతో తరుచూ 

విహారయాత్రలకు వెళ్లాలి. బంధువుల 

ఇండ్లకు వెళ్లడం ఉత్తమమే.

l ఓటమి తర్వాత అత్యంత ఆప్తులు, 

నిపుణులతో బాధను పంచుకోవాలి.

l కాసేపు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచించాలి. 

గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదవాలి. 

l ఈ ప్రపంచంలో మన కన్నా డబ్బులేని వారు, 

కష్టాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారనే 

విషయాన్ని గుర్తించుకోవాలి. అప్పుడు మన 

సమస్య పెద్దదిగా అనిపించదు.

l ప్రేమలో విఫలమైతే చావు పరిష్కారం కాదు.. 

ప్రేమ నిజమైతే కన్నవాళ్లను ఒప్పించాలి. 

లేదంటే మంచి స్నేహితులుగా ఉండేలా 

ప్రయత్నించాలి.

మారుతున్న జీవనశైలి...

సాధారణంగా 15 నుంచి 80 ఏండ్ల వయస్సు వరకు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే బలహీన క్షణాలు ఎదుర్కొంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడికి లోనవుతున్న మహిళలకు కూడా ఆ ఆలోచనలో ఎక్కువగా ఉంటున్నట్లు అంటున్నారు. ఒత్తిడికి గురవుతున్న వారిలో తరుచూ చనిపోవాలనే కోరిక వ్యక్తమవుతోంది. మారిన జీవనశైలి, మానవ సంబంధాలు, వేగవంతమైన జీవనం కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ప్రతి 60మందిలో ఒకరికి మానసిక రుగ్మత తలెత్తుతోంది. ఇందులోనూ 80శాతం మంది మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. వైద్య పరిభాషలో దీనినే తీవ్రమైన మానసిక జబ్బుగా పరిగణిస్తారు. ఒత్తిడి, కుంగుబాటు ఒకేరకంగా ఉంటాయి. ఎక్కువగా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఈ కారణంగా ఎక్కువ ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. 

అర్థం చేసుకుంటేనే..

ఆవేశంతో ఆ క్షణంలో చేసే పనులతో ఎంతో నష్టం వాటిళ్లవచ్చు. ఆ తర్వాత ఎంత బాధపడినా, జరిగిన నష్టాన్ని పూడ్చలేము. చిన్నచిన్న కారణాలే పెద్ద గొడవలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు పడే ఘర్షణలతో పిల్లలు, పిల్లలు పడే ఘర్షణలతో తల్లిదండ్రులు.. ఇలా అందరూ ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. ఇంట్లో, బయట ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. సర్దుకుపోతూ ముందుకు సాగితే ఎలాంటి సమస్య ఉండదు. అపార్థం చేసుకునే దానిలో పదో వంతు అర్థం చేసుకుంటే.. ఎన్నో సమస్యలు తొలగుతాయి.

పాఠశాల స్థాయి నుంచే  మార్పు రావాలి..

మానసిక రుగ్మతలు, ఒత్తిడి వంటి అంశాల్లో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన పెంచాలి. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అనేక వర్గాల వారు ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మత్తుకు బానిసలవుతున్నారు. వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. కార్పొరేట్‌ విద్య విద్యార్థులను మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. ఇష్టంలేని చదువులు చదివించడంతో 14 నుంచి 19 ఏండ్లలోపు వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

సానుకూల దృక్పథం అవసరం.. 

ఉరుకుల పరుగుల జీవితంలో విద్యార్థి నుంచి ఉద్యోగుల వరకు అందరిలో ఒత్తిడి ఎక్కువవుతోంది. దీంతో ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకూడదు. సానుకూలంగా ఆలోచించడం ద్వారా ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా అనిపిస్తుంది. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడేవారికి కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, మానసిక నిపుణుల సహకారం ఎంతో అవసరం. తరుచూ బతకలేనని, చనిపోవాలని ఉందని, ఫలానా విధంగా చనిపోతాననే సంకేతాలు అందిస్తారు. ఇలాంటి వారి సమస్యలను వినగలిగి ప్రత్యామ్నాయాలను చెప్పగలగాలి. పుస్తకాలు చదవడం, నలుగురిలో కలిసిపోవడం అలవాటు చేసుకోవాలి. 

- కె.శ్రీనివాసచారి, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, తూప్రాన్‌  logo