మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Jul 25, 2020 , 01:28:23

వాగుల్లో జల సవ్వడి

వాగుల్లో జల సవ్వడి

నంగునూరు/ తొగుట/ మెదక్‌ రూరల్‌: ఇటీవల కురిసిన వర్షాలకు వాగుల్లో జల సవ్వడి నెలకొన్నది. చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దూకుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరికినట్లయింది. ఉత్సాహంగా చేపలు పడుతున్నారు. నంగునూరు మండల పరిధిలోని ఖాతా, ఘణపూర్‌, అక్కెనపల్లి గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు మత్తుడి దూకుతుండగా, పెద్దవాగుపై ఉన్న ఏడు చెక్‌డ్యామ్‌లు నిండి పొంగిపొర్లుతున్నాయి. అక్కెనపల్లిలో వరదకు ఎదురెక్కుతున్న చేపలు పడతూ, కొందరు యువకులు ఉత్సాహంగా ఈతలు కొడుతూ కనబడ్డారు. తొగుట మండల పరిధిలోని చందాపూర్‌ వద్ద చెక్‌డ్యామ్‌ నిండి కూడవెళ్లి వాగు ప్రవహిస్తుండడంతో, ఫీడర్‌ చానల్‌ ద్వారా జప్తిలింగారెడ్డిపల్లి తుంగ చెరువులోకి నీరు చేరుతున్నది.  వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో జల వనరులన్నీ నిండు కుండలా మారుతుండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ మండలం ర్యాలమడుగు శివారులో హల్దీ వారుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను శుక్రవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చెక్‌డ్యామ్‌కు పూజలు చేశారు.


logo