బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 22, 2020 , 23:01:54

నాటి తెలంగాణపురమే.. నేడు తెల్లాపూర్‌

నాటి తెలంగాణపురమే.. నేడు తెల్లాపూర్‌

రామచంద్రాపురం: 600 ఏండ్ల క్రితమే ‘తెలంగాణ’ పదం ప్రావీణ్యంలో ఉంది. తొలిసారి తెలంగాణ పదం ప్రస్తావనకు వచ్చిన చారిత్రక సంపద మన ముంగిటే కన్పిస్తుంది. హైదరాబాద్‌ నగరానికి చేరువలో తెల్లాపూర్‌లో ఉన్న శిలా శాసనమే అందుకు నిదర్శనం. బహుమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షా హయాంలో అంటే క్రీ.శ 1418లో ప్రస్తుత తెల్లాపూర్‌ నాటి తెలంగాణపురంలో ఈ శిలా శాసనాన్ని ఏర్పాటు చేశారు. శిలా శాసనంలో మొత్తం 24 పంక్తులు ఉంటే అందులో 13వ పంక్తిలో ‘తెలంగాణపురం’ అనే పదం ఉంది. సువిశాలమైన తెలంగాణపురమే కాలక్రమేణా తెల్లాపూర్‌గా వాడుకలోకి వచ్చింది. బహుమనీ సుల్తాన్‌ తర్వాత వంద సంవత్సరాలకు అంటే క్రీ.శ 1510లో కాకతీయ రాజు ప్రతాపరుద్ర గజపతికి సంబంధించిన వెలిచర్ల శాసనంలో కూడా ‘తెలంగాణ’ పదాన్ని ప్రస్తావించినట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. 

ఆరు వందల ఏండ్లనాటి చరిత్ర..

ఆరు వందల ఏండ్ల క్రితం తెలంగాణపురంలోని దిగుడు బావి వద్ద ఈ శాసనాన్ని ఏర్పాటు చేశారు. దిమ్మపై రెండు స్తంభాలను అమర్చి వాటి మధ్యలో శిలాఫలకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో పాటు అక్కడ వీరభద్రుడి విగ్రహాన్ని కూడా చెక్కించారు. ఈ శాసనాన్ని ఓజు రుద్రోజు శిల్పి చెక్కించాడు. కాగా, విశ్వకర్మ కులంలో పుట్టిన మైలోజు కొడుకు పోచోజు విస్తృత కీర్తి ఘటించిన శిల్పి. నాగోజు కొడుకు కొండమీది మల్లోజు అతడి కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు, పోచోజు మోటబావిని తవ్వించి వనం చెరువు ఉత్తరాన మామిడి వనం, పూల తోటను ఏర్పాటు చేయించారు. అయితే పోచోజు మనవడు అయిన అయ్యలోజు వద్ద బహుమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌షా భార్య నూర్‌సుల్తాన్‌కు బంగారు ఆభరణాలు, గాజులు, పూసలు చేయించారు. బహుమనీ సుల్తాన్‌ గోల్కొండ నుంచి బీదర్‌కు వెళ్లే క్రమంలో తెలంగాణపురంలోని మోటబావి, మామిడి వనం వద్ద సేదతీరి, ఏనుగులు, గుర్రాలను ఆ బావి వద్ద కట్టేసి నీళ్లు, మేత వేసేవాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు. క్రీ.శ 1418లో ఫిరోజ్‌షా విజయనగర రెండో దేవరాయల ఆధీనంలో ఉన్న నల్లగొండ జిల్లాలోని పానుగల్లు కోటమీదకు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆయన తెలంగాణపురం ‘తెల్లాపూర్‌' మీదుగా ప్రయాణించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణపురంలోని విశ్వకర్మలు ఫిరోజ్‌షా భార్య నూర్‌ సుల్తాన్‌కు ఆభరణాలు చేయించడంతో ఆ గుర్తుగా ఆయన ఈ శాసనాన్ని చెక్కించిన్నట్లు శాసనంలో తెలుస్తుంది. కాలక్రమేణా బావి, మామిడి వనాలు కనుమరుగైనప్పటికీ, గత చరిత్రను సూచిస్తూ ఈ శాసనం నిక్షిప్తంగా ఉంది. ఈ శాసనం ప్రాముఖ్యత 1986లో బయటపడింది. అప్పటినుంచి గ్రామస్తులు ఈ శిలా శాసనాన్ని కాపాడుతున్నారు. సమైక్యరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా తెలంగాణ అనే పదాన్ని ఈ శాసనమే వెల్లడిస్తుంది. ఈ శాసనం సాయంతో 600 ఏండ్ల నాటి నుంచే ‘తెలంగాణ’ పేరు ప్రావీణ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. బహుమనీ సుల్తాన్‌ల హయాంలోనే తెలంగాణపురం ఉండడం విశేషం. క్రీ.శ 1510లో కాకతీయ రాజు ప్రతాపరుద్ర గజపతికి సంబంధించిన ‘వెలిచర్ల’ శాసనంలో కూడా తెలంగాణ పదాన్ని ప్రస్తావించిన్నట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. నిపుణత గల శిల్పులు భాష, మత, ప్రాంతీయ భావాలకు అతీతంగా వ్యవహరించేవారని కూడా ఈ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు.  శాసనం విషయానికి వస్తే ‘తెలంగాణపురం’ శిల్పులు బంగారు గాజుపూసలతో ఆభరణాలు తయారుచేసేవారని తెలుస్తుంది. ఆరు వందల ఏండ్లనాటి చరిత్ర కలిగిన ఈ శాసనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. logo