శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sangareddy - Jul 22, 2020 , 22:47:25

‘భువన్‌'యాప్‌ అమలు పన్ను చెల్లింపులో అక్రమాలు సాగవిక..!

‘భువన్‌'యాప్‌ అమలు పన్ను చెల్లింపులో అక్రమాలు సాగవిక..!

మున్సిపాలిటీ పరిధిలో అది ఓ రెసిడెన్సియల్‌ హౌస్‌. కానీ, కమర్షియల్‌ బిల్డింగ్‌గా మార్చారు. మున్సిపాలిటీకి మాత్రం రెసిడెన్షియల్‌ సంబంధించిన పన్ను చెల్లిస్తూ సర్కారును మోసం చేస్తున్నారు. మరోచోట భవనం మూడంతస్తులు ఉంది. పన్ను మాత్రం ఒకే అంతస్తుకు చెల్లిస్తున్నారు. మూడంతస్తుల వివరాలు మున్సిపాలిటీ లెక్కల్లోనే కనిపించడం లేదు. ఇలా చాలా రకాలుగా పన్నుల చెల్లింపుల రూపంలో మున్సిపల్‌ శాఖను మోసం చేస్తున్నారు. దీంతో బల్దియాల ఆదాయానికి గండిపడుతున్నది. దీనికి చెక్‌పెట్టేందుకు మున్సిపల్‌ శాఖ  ‘భువన్‌' యాప్‌ తీసుకువచ్చింది. దీనిద్వారా మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తుల వివరాలను కొలతలు, ఫొటోలతో సహా అందులో పొందుపరుస్తారు. దీంతో బల్దియాను తప్పుదోవ పట్టించి పన్నుల మోసానికి పాల్పడడం ఇకపై కుదరదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ‘భువన్‌ యాప్‌' ప్రక్రియ త్వరలో అమలులోకి రానున్నది.  మున్సిపాలిటీ పరిధిలో అది ఓ రెసిడెన్సియల్‌ హౌస్‌. కానీ, కమర్షియల్‌ బిల్డింగ్‌గా మార్చారు. మున్సిపాలిటీకి మాత్రం రెసిడెన్షియల్‌ సంబంధించిన పన్ను చెల్లిస్తూ సర్కారును మోసం చేస్తున్నారు. మరోచోట భవనం మూడంతస్తులు ఉంది. పన్ను మాత్రం ఒకే అంతస్తుకు చెల్లిస్తున్నారు. మూడంతస్తుల వివరాలు మున్సిపాలిటీ లెక్కల్లోనే కనిపించడం లేదు. ఇలా చాలా రకాలుగా పన్నుల చెల్లింపుల రూపంలో మున్సిపల్‌శాఖను మోసం చేస్తున్నారు. దీంతో ఏటా సర్కారుకు నష్టం వాటిల్లుతున్నది. బల్దియాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇదందా ఇక గతం. ఇక మీదట ఎన్ని అంతస్తుల భవనానికి అంత పన్ను చెల్లించాల్సిందే. కమర్షియల్‌ భవనాన్ని గృహ సముదాయంగా చూపి మోసం చేయలేరు. ఆన్‌లైన్‌లో ఇంటి నెంబర్‌ నొక్కితో ఆ ఇల్లు ఎంత స్థలంలో నిర్మించారు. ఎన్ని అంతస్తులు ఉంది..? పక్కా సమాచారం ఫొటోలతో సహా కళ్లముందు కనిపిస్తుంది. అంటే ఇక తప్పుడు సమాచారం చెప్పి పన్ను చెల్లింపులో మోసం చేయడం కుదరదన్నమాట. మున్సిపల్‌ శాఖ ‘భువన్‌' యాప్‌ తీసుకువచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని కొలతలతో ఆస్తుల వివరాలను ఫొటోలతో సహా అందులో పొందుపరుచనున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆగస్టు 10వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ‘భువన్‌ యాప్‌'తో సర్కారుకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్నింటిలో ఈ ప్రక్రియ అమలు కానున్నది. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ‘భువన్‌ యాప్‌' ప్రక్రియ అమలులోకి రానున్నది. మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఈ యాప్‌లోకి ఆస్తుల వివరాలు చేర్చే ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారం మున్సిపాలిటీలు ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌ మున్సిపాలిటీలు, మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో భువన్‌ యాప్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 10 వరకు యాప్‌లోకి అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. మున్సిపాలిటీల్లోని సిబ్బందికి ఇందుకు సంబంధించిన శిక్షణ పూర్తిచేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. ఇదే క్రమంలో అక్రమాలకు తావులేకుండా పక్కాగా పన్ను వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే భువన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌ ద్వారా చాలావరకు అక్రమాలకు చెక్‌పడనున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అన్ని వివరాలు ‘భువన్‌ యాప్‌'లోకి...

మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తుల వివరాలను ‘భువన్‌ యాప్‌'లోకి అప్‌లోడ్‌ చేస్తారు. ఓ ఇల్లు ఎంత విస్తీర్ణంలో నిర్మించారు..? ఎన్ని అంతస్తులు ఉన్నాయి..? నల్లా కనెక్షన్‌, విద్యుత్‌ కనెక్షన్‌ అన్ని వివరాలను ఫొటోలతో మున్సిపల్‌ సిబ్బంది తీసుకుంటారు. ఆ వివరాలను యాప్‌లో పొందుపరుస్తారు. ఇంటితో పాటు వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి భవనాల వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. సర్వేనెంబర్‌, ఇంటినెంబర్‌, ఎంత విస్తీర్ణం.. ఇలా అన్ని వివరాలు యాప్‌లో ఉంటాయి. ఇంటి నెంబర్‌ నొక్కితే పూర్తి వివరాలు ఫొటోలతో సహా అందుబాటులో ఉంటాయి. వీటి ఆధారంగానే పన్ను వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో తప్పుడు సమాచారం ఇచ్చి పన్నులు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక అంతస్తు నిర్మిస్తే దానికే పన్ను చెల్లిస్తుంటారు. తర్వాత రెండు, మూడు అంతస్తులు నిర్మించినప్పటికీ, ఆ వివరాలు మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు కావడం లేదు. దీంతో ఒక అంతస్తుకే పన్ను చెల్లిస్తూ సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. ఇకపై భవన్‌ యాప్‌తో మున్సిపాలిటీల్లో పక్కాగా పన్ను చెల్లింపులు జరుగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రెండు రోజుల్లో ప్రారంభిస్తాం..

‘భువన్‌' యాప్‌లోకి వివరాలు పొందుపరిచే ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో మొదలు పెడతాం. ఆస్తుల వివరాలు, భవనాలను మొబైల్‌ ఫోన్ల ద్వారా చిత్రీకరించి వెబ్‌సైట్‌లోకి పెడతాం. ఆగస్టు 10 వరకు మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని యాప్‌లో పొందుపర్చాలని మున్సిపల్‌శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశాం,  - శ్రీహరి, మున్సిపల్‌ కమిషనర్‌, మెదక్‌

కొలతలతో సహా పక్కా సమాచారం..

మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు సంబంధించిన పక్కా సమాచారం తీసుకుంటాం. ఎంత విస్తీర్ణంలో భవనం నిర్మించారు..? ఎన్ని అంతస్తులు ఉన్నాయా..? కమర్షియల్‌ బిల్డింగ్‌ లేదా నివాస గృహమా..? ఇలా అన్ని వివరాలు యాప్‌లో పొందుపరుస్తాం. సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. కొలతలు, ఫొటోలతో సహా కంప్యూటర్‌ మీటనొక్కితే మున్సిపాలిటీలో ఆస్తుల వివరాలు కళ్ల ముందుంటాయి.  
- విక్రమ సింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, జహీరాబాద్‌


logo