బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 22, 2020 , 22:33:00

అన్నదాత సేవలో..

అన్నదాత సేవలో..

ఎరువుల కోసం రైతులు ఇబ్బందిపడే పరిస్థితులు ఇక ఉండవు. మార్కెట్లో కంటే తక్కువ ధరలకే రైతులకు ఎరువులు అందించడానికి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల ద్వారా మండల కేంద్రాలతో పాటు మేజర్‌ పంచాయతీల్లో ‘రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తారు. వీటితో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన్నుల సామర్థ్యంతో  ఎరువుల విక్రయ కేంద్రాలనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 100 వరకు ‘రైతు సేవా కేంద్రాల’ ఏర్పాటు లక్ష్యంగా డీసీఎంఎస్‌ చర్యలు చేపట్టింది. కాగా, జహీరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం(నేడు) ప్రారంభించనున్నారు. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎరువుల కోసం రైతులు ఇబ్బందిపడే పరిస్థితులు ఇక ఉండవు. రైతులకు అందుబాటులో మార్కెట్లో కంటే తక్కువ ధరలకే ఎరువులు అందించడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల ద్వారా మండల కేంద్రాలతో పాటు మేజర్‌ పంచాయతీల్లో ‘రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు కానున్నాయి. ఈ కేంద్రాల నుంచి అన్నదాతలు తమకు అవసరమైన ఎరువులు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన్నుల సామర్థ్యంతో కూడిన ఎరువుల విక్రయ కేంద్రాలనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 100 వరకు ‘రైతు సేవా కేంద్రాల’ ఏర్పాటు లక్ష్యంగా డీసీఎంఎస్‌ చర్యలు చేపట్టింది. కాగా, జహీరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం(నేడు) ప్రారంభించనున్నారు. 

మార్కెట్లో కంటే తక్కువ ధరకు...

జిల్లా మార్కెటింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రైతుసేవా కేంద్రాల ద్వారా బహిరంగ మార్కెట్లో కంటే తక్కువ ధరలకు ఎరువులు లభించనున్నాయి. యూరియా మినహా మిగతా డీఏపీ, కాంప్లెక్స్‌, ఇతర ఎరువులు రూ.50 నుంచి రూ.100 తక్కువకు ఈ కేంద్రాల్లో లభిస్తాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 105 ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) ఉన్నాయి. ఈ వానకాలంలో సహకార సంఘాల ద్వారా కూడా రైతులకు ఎరువులు అందించారు. పలువురు రైతులు డీసీఎంఎస్‌కు డీడీ చెల్లిస్తే నేరుగా గ్రామాలకు ఎరువులు సరఫరా చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే, రైతులకు అందుబాటులో ఉంటాయని గుర్తించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు సూచనలతో డీసీఎంస్‌ చైర్మన్‌ శివకుమార్‌ మండల కేంద్రాల్లో రైతుసేవా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ కేంద్రాలు ఏర్పాటైతే రైతులకు డబ్బులు ఆదా కావడంతో పాటు సమయం కలిసి వస్తుంది.  

నియోజకవర్గ కేంద్రాల్లో వెయ్యి టన్నుల సామర్థ్యంతో...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో  దాదాపు వెయ్యి టన్నుల సామర్థ్యంతో ఎరువుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం జహీరాబాద్‌ కేంద్రంలో ప్రారంభోత్సవానికి కేంద్రం సిద్ధంగా ఉన్నది. వెయ్యి టన్నుల సామర్థ్యంతో అంటే 20వేల ఎరువుల బస్తాలు నిల్వ చేసే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలోనే ఇది ఉన్నప్పటికీ, వినియోగంలో లేకపోవడంతో కొంత వరకు ధ్వంసమైంది. దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి అన్ని మరమ్మతులు చేయించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రాన్ని బాగు చేయించారు. మెదక్‌, గజ్వేల్‌ పట్టణాల్లో కూడా డీసీఎంఎస్‌కు సంబంధించిన గోదాములు ఉన్నాయి. వీటిని మరమ్మతులు చేయించి, త్వరలోనే ఈ రెండు సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు శివకుమార్‌ చెప్పారు. నియోజకవర్గ కేంద్రం, లేదంటే మండల కేంద్రం ఏది దగ్గరగా ఉంటే అక్కడకు రైతులు వెళ్లి ఎరువులు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రాలు లేకపోయినప్పటికీ, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది వానకాలం, యాసంగికి లక్ష టన్నుల ఎరువులు అవసరం. ఈ వానకాలం 20వేల టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఇప్పటికే 14వేల టన్నులు తీసుకున్నారు. మరో 6,500 టన్నులు అందుబాటులో ఉన్నాయి. 

నిరుద్యోగులకు అవకాశం...

రైతుసేవా కేంద్రాల ఏర్పాటుకు నిరుద్యోగులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత కేంద్రాలను మంజూరు చేయనున్నారు. కేంద్రం మంజూరైన వారికి కొంత మొత్తానికి సంబంధించిన ఎరువులు సరఫరా చేయనున్నారు. వాటిని అమ్మగా వచ్చిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆదాయంగా ఇవ్వనున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో కొంతమంది యువతకు ఉపాధి లభించనున్నది. ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలుచోట్ల మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఎరువులు విక్రయించారు. పూర్తిస్థాయిలో రైతు సేవా కేంద్రాలు అందుబాటులోకి వస్తే, చాలా వరకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.


logo