శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Jul 21, 2020 , 00:15:27

పల్లెలే ప్రగతికి చిహ్నాలు

పల్లెలే ప్రగతికి చిహ్నాలు

  • పంచాయతీల అభివృద్ధికి సమృద్ధిగా నిధులు
  • ప్రతి పల్లెలో పార్కు ఏర్పాటుకు చర్యలు
  • పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా
  • పటాన్‌చెరు మండలం కర్ధనూర్‌లో పల్లె ప్రకృతి వనం ప్రారంభం
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు హాజరు

పటాన్‌చెరు : కర్ధనూర్‌లో ఆహ్లాదరకరంగా పల్లె ప్రకృతివనం ఉందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. సోమవారం పటాన్‌చెరు మండలం కర్ధనూర్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాన్ని ఆయన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగువేల మొక్కలను నాటారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్‌ పార్కు, వాకింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు. నాలుగు ఎకరాల ఈ ప్రకృతివనంతో గ్రామీణ ప్రజలకు ఆరోగ్యకరమైన పర్యావరణం అందుబాటులోకి రానున్నదని  తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రతి పల్లె ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 10 వేలకు పైగా పంచాయతీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తండాలను కూడా గ్రామపంచాయతీలుగా గుర్తింపునివ్వడంతో అభివృద్ధి వేగవంతమైందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, అధికారులు, కర్ధనూర్‌ పంచాయతీ పాలకవర్గం చేసిన కృషిని ఆయన అభినందించారు. ఎమ్మెల్యే  గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ  హరితహారంలో భాగంగా ఒకే రోజూ 4 వేల మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు కొత్త శోభను తీసుకువస్తాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఆర్డీవో నగేశ్‌, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో అధికారులు, డీఆర్‌డీఏ అధికారులు, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ గోల్కొండ నాగజ్యోతి, ఉప సర్పంచ్‌ వడ్డె కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దశరథరెడ్డి,  వెంకట్‌రెడ్డి, గోల్కొండ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.
logo