ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 19, 2020 , 23:57:18

పరిశ్రమల్లో కరోనా భయం!

 పరిశ్రమల్లో కరోనా భయం!

పటాన్‌చెరు : పాశమైలారంలోని ఒక పరిశ్రమ ఉద్యోగి నిత్యం పరిశ్రమకు వస్తున్నాడు. డ్యూటీ చేస్తున్నాడు. అతడికి మూడు రోజులుగా ఓ మోస్తరు జ్వరం ఉంది. ఎందుకైనా మంచిదని కొవిడ్‌-19 టెస్టు చేయించుకున్నాడు. డ్యూటీలో ఉండగా అతడికి సమాచారం వచ్చింది. మీకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని. ఆ కార్మికుడు తక్షణం తన పరిశ్రమ హెచ్‌ఆర్‌ విభాగానికి ఫోన్‌లో ఈ సమాచారం అందించాడు. డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లిపోమని ఫోన్‌లోనే వారు సలహా ఇచ్చారు. ఆ కార్మికుడు సెలవు పత్రం రాయించుకుని బయటకు వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది చెక్‌చేసి అతడిని వదిలారు. అతడు ఆటోలో ఇస్నాపూర్‌ వరకు వెళ్లాడు. అక్కడి నుంచి మియాపూర్‌లో మూడు ఆటోలు, ఇంకో ప్రైవేట్‌ వాహనం ఎక్కి ఇంటికి చేరాడు. అతడి కారణంగా ఆఫీసులోనే మరో ముగ్గురు ప్రభావితం అయ్యారనేది స్పష్టం, ఆటోలో ఉన్న ప్యాసింజర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్‌ వాహనంలో పక్కన కూర్చున్న వారు ఇలా ఆ కార్మికుడి కారణంగా కొవిడ్‌ బారిన పడ్డారు. పరిశ్రమల్లో కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సిబ్బంది కరోనా బారినపడితే వారిని ఇంటి వరకు వదిలేసే జాగ్రత్తలు కూడా తీసుకోవడంలేదు. ఈ కారణంగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఫార్మా పరిశ్రమల్లో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. భారీగా ఆర్డర్లు వస్తుండడంతో యాజమాన్యాలు జ్వరం ఉంటే కార్మికులకు గేట్‌పాస్‌ ఇచ్చి బయటకు పంపడం మాత్రమే చేస్తున్నాయి. ఇంటి అద్దెలు, పెరుగుతున్న ఖర్చులకు జడిసి కార్మికులు జ్వరం ఉన్నా పారసిటమాల్‌ వేసుకుని డ్యూటీలకు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది శరీర ఉష్ణోగ్రత చెక్‌చేసి లోపలికి పంపిస్తున్నారు. ఆ తర్వాత వారు తోటి కార్మికులతో కలిసి పనిచేయడంతో పాటు కలిసి భోజనాలు చేస్తున్నారు. ఆయుధ ఉత్పత్తి కర్మాగారాలతో పాటు భారీ షెడ్లను నిర్మించే పరిశ్రమల్లోనూ, రుద్రారంలో ట్రాన్స్‌ఫార్మర్లు తయారుచేసే అంతర్జాతీయ పరిశ్రమల్లోనూ కొవిడ్‌-19 కేసులు భయాందోళన కలిగించే స్థాయిలో నమోదయ్యాయి. 

కార్మికశాఖ చర్యలు తీసుకోవాలి.. 

కార్మికశాఖ అధికారులు కార్మికుల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ద్వారా భద్రతలో భాగంగా పరిశ్రమల్లో కొవిడ్‌-19 టెస్టులు చేయించాలని పలు పరిశ్రమల కార్మికులు కోరుతున్నారు. పాజిటివ్‌గా తేలిన కార్మికుల ఆరోగ్య భద్రతపై పరిశ్రమలు శ్రద్ధ చూపాల్సి ఉంది. కేవలం ఈఎస్‌ఐకి వెళ్లి చూపించుకోవాలనే సలహాలు మాత్రమే పరిశ్రమలు ఇస్తున్నాయి. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన కార్మికుడితో కలిసి ఉన్న తోటి కార్మికులకు టెస్టులు చేయించేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. వైద్యం అనేది ఈఎస్‌ఐ, కాంట్రాక్టర్ల సమస్యగానే చూస్తున్నారు. పైగా పాజిటివ్‌ వచ్చిన కార్మికులు పని చేసిన ప్రాంతంలో శానిటైజేషన్‌ కూడా చేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. అపరిశుభ్ర టాయిలెట్స్‌, క్యాంటీన్ల ద్వారా కరోనా కార్మికుల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నదని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. కార్మికులను తీసుకుని వస్తున్న బస్సుల్లో సైతం కొవిడ్‌-19 నిబంధనలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా పరిశ్రమల్లో వైద్య సేవలను యాజమాన్యాలు అందుబాటులో ఉంచడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల భద్రతా అధికారులు, కార్మికశాఖ, వైద్యాధికారులు సంయుక్తంగా కార్యాచరణ చేపడితే పరిశ్రమల్లో కొవిడ్‌-19కు అడ్డుకట్ట వేయవచ్చు. ఉత్పత్తితో పాటు కార్మికుల ఆరోగ్యాలకు భరోసా కల్పించవచ్చు.


logo