శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Jul 19, 2020 , 23:30:25

సాగులో ‘యంత్ర’ సాయం

సాగులో ‘యంత్ర’ సాయం

రైతన్నలు ఆధునిక సాగుతో అధిక లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యంత్ర పరికరాల ఉపయోగం ఎక్కువగా ఉన్నది. దున్నకం నుంచి పంట చేతికందే వరకు ప్రతి పని యంత్రాలతోనే చేస్తున్నారు. కాగా, కూలీల కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో రైతన్నలు యంత్రాలతో సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 

ఝరాసంగం: కూలీల కొరతతో వ్యవసాయ సాగులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పత్తి సాగులో భాగంగా చీడపీడల నివారణకు మందుల పిచికారీ వంటి పనులు చేసేందుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాగా, ప్రస్తుతం కూలీల కొరత, వారికి ఇచ్చేందుకు నగదు ఖర్చు ఎక్కువ అవుతున్నది. దీంతో మండల పరిధిలోని సిద్దాపూర్‌కు చెందిన రైతు సంజీవరెడ్డి వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించారు. సొంత ఆలోచనతో తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరం తయారు చేశారు. 

తక్కువ ఖర్చుతో తయారు..

కేవలం రూ.385తో మాత్రమే యంత్రం తయారు చేశాడు. రెండు అంగుళాల పైపు మూడు ఫీట్లు, రెడ్‌సార్‌, అంగుళం ఎంటీఏ, ఒక్క అంగుళం పైపు రెండు ఇంచుల పైపు ముక్క, ఒక్క అంగుళంపై అర అంగుళం బూసు, అర అంగుళం పైపు, ఒక్క ఫీట్‌, క్యాప్‌, సైకిల్‌ మోటర్‌ ట్యూప్‌ రెండు ఫీట్లు ఒక్క క్లాప్‌, రెండు ఇంచుల ఒక్క స్క్రూను ఉపయోగించి యంత్రం తయారు చేశాడు. మండల పరిధిలోని సిద్దాపూర్‌కు చెందిన రైతు సంజీవరెడ్డి ప్రస్తుతం (ఝరాసంగం సొసైటీ వైస్‌చైర్మన్‌) కొత్త పరికరంతో ఎంతో ఆకట్టుకుంటున్నాడు. పత్తి మందు వేసుకునేందుకు ఇతర గ్రామాల రైతులు సంజీవరెడ్డి దగ్గరకు వెళ్లి యంత్రాన్ని తీసుకువెళ్తున్నారు.  

ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ..

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పెంచుకోవచ్చు, పైగా కూలీల కొరత లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ పరికరంతో ఒకే కూలీ అవసరముంటుంది. అందుకు రైతులు ఈ యంత్రాన్ని తయారు చేసుకుని లాభం పొందవచ్చు.  - సంజీవరెడ్డి రైతు, సిద్దాపూర్‌