గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jul 18, 2020 , 23:11:20

స్వచ్ఛంద లాక్‌డౌన్

స్వచ్ఛంద లాక్‌డౌన్

కరోనా కోరలు చాస్తుండడంతో కట్టడికి వ్యాపారులు ముందుకు వస్తున్నారు.  తమవంతుగా స్వచ్ఛందంగా తీర్మానం చేసుకొని లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రజలు గుంపులుగా దుకాణాలకు వస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. ఈ క్రమంలోనే పట్టణాల్లో ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. ఇది గమనించిన వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే దుబ్బాక, జహీరాబాద్‌, సదాశివపేట పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, ఆదివారం నుంచి అందోలులో లాక్‌డౌన్‌ విధించనున్నారు. సంగారెడ్డి, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల పట్టణాల్లో సాయంత్రం 4 గంటలకే దుకాణాలు మూసి వేస్తున్నారు. కంగ్టిలో మధ్యాహ్నం 2 గంటలకు, నారాయణఖేడ్‌ పట్టణంలో 4 గంటలకు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని సుభాష్‌రోడ్డులో నేటి నుంచి లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. ఇదే బాటలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరికొన్ని చోట్ల లాక్‌డౌన్‌ పాటించేందుకు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.  

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు.. అని కాకుండా ఎవరికి వారు కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలి.. కరోనా గొలుసు తెగొట్టడానికి  ప్రభుత్వానికి తోడుగా వ్యాపారులు స్వచ్ఛందంగా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల ప్రాణాలను కాపాడటానికి వ్యాపారస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానం చేసుకుంటున్నారు.  ఇప్పటికే పలు పట్టణాల్లో లాక్‌డౌన్‌ పాటిస్తుండటంతో వారి బాటలో నడువడానికి మిగతా పట్టణాలు, గ్రామాలు రెడీ అవుతున్నాయి.    

 సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ప్రజలు గుంపులుగా దుకాణాలకు వస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. ఈ క్రమంలోనే పట్టణాల్లోనే కేసులు పెరుగుతున్నాయి. గమనించిన వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే దుబ్బాక, జహీరాబాద్‌, సదాశివపేట పట్టణాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, ఆదివారం నుంచి అందోల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌ పాటించనున్నారు. సంగారెడ్డి, గజ్వేల్‌, హుస్నాబాద్‌, చేర్యాల పట్టణాల్లో సాయంత్రం 4 గంటలకే దుకాణాలు మూసి వేస్తున్నారు. కంగ్టిలో మధ్యాహ్నం 2 గంటలకు, నారాయణేడ్‌ పట్టణంలో 4 గంటలకు వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని సుభాష్‌రోడ్డులో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. ఇదే బాటలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరికొన్ని చోట్ల లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులు చర్చించుకుంటున్నారు.  

పెరుగుతున్న కేసుల సంఖ్య..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్నది. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో ఒకటి, రెండు కేసులతో మొదలైన సంఖ్య పదులకు చేరింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. వారం రోజులుగా మెదక్‌, సిద్దిపేటల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్నచోటనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురంలో అధిక కేసులు నమోదవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, మెదక్‌ జిల్లాలో మెదక్‌, తూప్రాన్‌ పట్టణాల్లో కేసులు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు గ్రామాల్లో వెలుగు చూస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలకు వస్తున్న వారితో పల్లెటూర్లలో కేసులు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థల వద్ద జనం గుంపులుగా వెళ్లడం కేసులు పెరుగడానికి కారణం అవుతున్నది.

కేసుల కట్టడి కోసమే.. 

గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న ప్రజలు ప్రధానంగా కిరాణా, బట్టల దుకాణాల వద్దకు ఎక్కువగా వెళ్తున్నారు. గుంపులు, గుంపులుగా దుకాణాల ఎదుట తిరుగుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో దుకాణాల మూసివేత నిర్ణయం తీసుకుంటున్నారు. వ్యాపారులంతా సమావేశాలు ఏర్పాటు చేసుకొని లాక్‌డౌన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దుకాణాల మూసివేతతో కొంత నష్టం జరిగినా, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ అమలే సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా ప్రధానంగా కిరాణా, బట్టల దుకాణాల వ్యాపారులు ఎక్కువగా లాక్‌డౌన్‌ తీర్మానాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజులైనా దుకాణాలు మూసి వేయడం ద్వారా, కొంత వరకైనా కేసులు పెరుగకుండా ఉంటాయని వ్యాపారులు భావిస్తున్నారు.

నేటి నుంచి అందోల్‌లో.. 

 జహీరాబాద్‌, దుబ్బాక నియోజకవర్గ కేంద్రాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. జహీరాబాద్‌, సదాశివపేటలో పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి.  దీంతో వ్యాపారులంతా ఏకమై లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ మొదలు కాగా, ఈనెల 26 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నది. దుబ్బాకలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. అందోలు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సదాశివపేట పట్టణంలో కిరాణా, బట్టల దుకాణాలు పూర్తిగా మూసి ఉంటున్నాయి. మిగతా వ్యాపార సంస్థలు 4 గంటలకు మూసి వేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 20 నుంచి దుకాణాలు పూర్తిగా మూసివేయాలని కిరాణా వర్తక సంఘం తీర్మానం చేసుకున్నది. పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్‌లో కేసులు అమాంతం పెరిగిపోతుండడంతో, కాలనీల వారీగా ఎక్కడికక్కడ దుకాణాలు మూసి వేస్తున్నారు. కేసులు పెరుగడంతో తూప్రాన్‌ పట్టణంలోని పలు కాలనీల్లో లాక్‌డౌన్‌ పాటించారు. ప్రస్తుతం గజ్వేల్‌, సంగారెడ్డి, హుస్నాబాద్‌, చేర్యాల పట్టణాల్లో సాయంత్రం 4 గంటలకు వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. కంగ్టిలో మధ్యాహ్నం 2 గంటల వరకు, నారాయణఖేడ్‌లో 4 గంటలకే దుకాణాలు బంద్‌ చేస్తున్నారు. మెదక్‌ పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి దుకాణాలు బంద్‌ చేస్తున్నారు. కాగా, మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. logo