మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jul 17, 2020 , 23:12:50

ఇక రయ్‌..రయ్‌..

 ఇక రయ్‌..రయ్‌..

  •  చురుగ్గా జాతీయ రహదారి    విస్తరణ పనులు
  •  మెదక్‌ శివారులోని పసుపులేరు   వాగుపై  పూర్తయిన బ్రిడ్జి నిర్మాణం
  •  నేడు మంత్రి హరీశ్‌రావు   చేతుల మీదుగా ప్రారంభం

మెదక్‌ : జాతీయ రహదారి-765Dగా గుర్తింపు పొందిన దుండిగల్‌-మెదక్‌ ప్రధా న రహదారి విస్తరణ పనులు 2018లో ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్‌ ఓఆర్‌ఆర్‌ నుంచి మెదక్‌ జిల్లాలోని మంభోజిపల్లి పసుపులేరు వాగు బ్రిడ్జి వరకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 63 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. రూ.322.20 కోట్లతో పనులు చేపడుతున్నారు. 2018 ఏప్రిల్‌లో ప్రారంభమైన రహదారి విస్తరణ పను లు, 2020 డిసెంబర్‌ వరకు పూర్తికానున్నాయి. గుమ్మడిదల నుంచి నర్సాపూర్‌, కౌడిపల్లి, కొల్చారం, మెదక్‌ వరకు రహదారి విస్తరణ పనులు పూర్తయ్యాయి. 

మెదక్‌ జిల్లాలో పనులు పూర్తి 

రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద నుంచి ప్రారంభమైన రహదారి విస్తరణ పనులు, మెదక్‌ జిల్లా ప్రారంభంలోని గుమ్మడిదల నుంచి మెదక్‌ పట్టణ శివారులోని పసుపులేరు బ్రిడ్జి వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. రహదారి మధ్యలో నుంచి ఇరువైపులా 50 అడుగుల మేర విస్తరించారు. మలుపులు, టోల్‌ప్లాజా వద్ద మాత్రం మరింతగా విస్తరించారు. గుమ్మడిదల, నర్సాపూర్‌ పట్టణం, వెంకట్రావ్‌పేట్‌, కౌడిపల్లి, కొల్చారం, అప్పాజిపల్లి, పోతంశెట్‌పల్లి, మంభోజిపల్లి ప్రాంతాల్లో జాతీయ రహదారి మధ్యలో డివైడర్లు నిర్మించారు. 

నేడు బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి 

జిల్లాకేంద్రం మెదక్‌ పట్టణ శివారులోని పసుపులేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జిని శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే పట్టణ శివారులోని పసుపులేరు వాగు మీదుగా రాకపోకలకు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడేవారు. బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్య నుంచి విముక్తి లభించనుంది.


logo