ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 17, 2020 , 23:12:51

కరోనా సాయంలో తెలంగాణ ముందంజ

కరోనా సాయంలో  తెలంగాణ ముందంజ

  • వీధి వ్యాపారులకు రుణాలు
  • రేషన్‌ డీలర్లకు కమీషన్‌ చెక్కు అందజేత 
  • పట్టణ మహిళా సంఘాల సభ్యులకు రూ.7.64 కోట్లు
  • స్వయం సహాయక సంఘాలకు రూ.1.12 కోట్లు

సంగారెడ్డి టౌన్‌ : కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజూరైన 30 చెత్త సేకరణ ఆటోలను సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పట్టణ పేదరికి నిర్మూళన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో పట్టణ వీధి విక్రయ వ్యాపారస్తులకు రుణమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12కిలోలు, వలస కార్మికులకు కూడా ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించిందన్నారు. అదే విధంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు మరో మూడు నెలలు కూడా ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు తెలిపారు. మూడు నెలల పాటు ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేసిన డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్‌ రూ.1,53,56,673 చెక్కును మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో 5978 మంది వీధి వ్యాపారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రుణం అందించినట్లు చెప్పారు. తీసుకున్న రుణాలకు విధిగా చెల్లిస్తే తిరిగి బ్యాంకర్లు రూ.20వేల రుణాన్ని అందిస్తారని సూచించారు. వీధి వర్తకులు కొనుగోలు, అమ్మకాలు చేసే సందర్భంగా డిజిటల్‌ లావాదేవీలు జరుపాలన్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి రూ.కోటి 12లక్షల 63వేల చెక్కును అందజేశారు. ఈ సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి త్వరలో కమీషన్‌ అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పట్టణ మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్‌ లింకేజీ కింద రావాల్సిన రూ.7 కోట్ల 64లక్షల చెక్కును అందజేశారు. మహిళలు  రుణాల ద్వారా స్వయం ఉపాధి పొందాలని సూచించారు. బ్యాంకర్లు సహకరిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జడ్పీ సీఈవో రవి, సంగారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, అమీన్‌పూర్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, బొల్లారం చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజారాణి, అందోల్‌-జోగిపేట చైర్మన్‌ మల్లయ్య, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo