శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Jul 16, 2020 , 23:15:21

మల్కాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

  మల్కాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

తూప్రాన్‌ రూరల్‌: కోఆపరేటివ్‌, నాబార్డు సహకారంతో తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇదే తరహాలో మరికొన్ని గ్రామాలు ముందుకు వస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు.  

  మల్కాపూర్‌లో రైతు ఉత్పత్తిదారుల కేం ద్రాన్ని  పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, నర్సాపూర్‌ డివిజన్‌ ఆత్మ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాబుల్‌రెడ్డి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, సంఘ సభ్యులతో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   రైతాంగానికి కావాల్సిన వరి, కూరగాయలు, ఉద్యానవన పంటలకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు.  మల్కాపూర్‌ రైతులే కాకుండా పరిసర గ్రామాల వారు సైతం ఈ కేంద్రానికి వచ్చి కొనుగోలు చేసేందుకు వీలుంటుందన్నారు. గ్రామస్తులే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు వ్యయ, ప్రయాసలు తగ్గుతాయన్నారు. ప్రతి రెండు, మూడు గ్రామాలకు ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని  ఆమె   సూచించారు. 

  కార్యక్రమంలో  నర్సాపూర్‌ డివిజన్‌ ఏడీఏ సురేఖ, తూప్రాన్‌ ఏవో నుస్రత్‌, ఏఈవోలు అశోక్‌రెడ్డి, సింధు, సంతోష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్వర్‌శర్మ, ఆంజనేయులుగౌడ్‌, జిన్నరాజు, శేఖర్‌, మన్నె నాగరాజు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

 రైతాంగానికి  సీఎం  పెద్దపీట.. 

    రైతాంగానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా పథకాలతో వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారని మెదక్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు.  రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తున్న ఘనత ఒక్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు రాజేశ్వర్‌శర్మ, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, మహాదేవి, ఎంపీటీసీలు సంతోష్‌రెడ్డి, వెంకటమ్మలతో కలిసి   యావాపూర్‌, మల్కాపూర్‌లలో అనారోగ్యంతో మరణించిన ఇద్దరు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రొసీడింగ్‌ పత్రాలు జడ్పీ చైర్‌పర్సన్‌ అందజేశారు.

    రైతు రాజుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే వ్యవసాయ రైతాంగానికి సీఎం కేసీఆర్‌ బాసటగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో యావాపూర్‌ ఉపసర్పంచ్‌ యాంజాల లక్ష్మీస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు  పిట్ల సింహం, కుమ్మరి నర్సింహులు  పాల్గొన్నారు.