మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jul 16, 2020 , 23:15:41

అధైర్యం వద్దు.. మేమున్నాం

అధైర్యం వద్దు.. మేమున్నాం

  • కొవిడ్‌-19 బాధితులకు మెరుగైన సేవలు
  • ఆందోళన అక్కరలేదు n అందుబాటులో బెడ్లు, మందులు
  • సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌, సదాశివపేట, నారాయణఖేడ్‌లో కొవిడ్‌-19 టెస్టులు 
  • సంగారెడ్డి జిల్లా, ఎమ్మెన్నార్‌ దవాఖానల్లో  అందుబాటులో 172 బెడ్లు
  • 80శాతం పాజిటివ్‌ కేసుల్లో నార్మల్‌ లక్షణాలే
  • అలాంటి వారు ఇంటి వద్దే చికిత్స తీసుకోవచ్చు
  • సిబ్బంది ఇంటికి వెళ్లి సేవలందిస్తున్నారు.. 
  • ‘నమస్తే తెలంగాణ’తో సంగారెడ్డి  జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌

కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు అధైర్యపడవద్దని, దవాఖానల్లో మందులు, సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ అన్నారు. కరోనా బాధితులకు అందిస్తున్న సేవల గురించి గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ దవాఖానల్లో రోజువారీగా 300 వరకు టెస్టులు చేస్తున్నామని, పాజిటివ్‌ వచ్చిన 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదన్నారు. అలాంటి వారికి ఇంటి వద్దే వైద్య సేవలందిస్తున్నామని, తీవ్ర లక్షణాలు ఉన్న వారికి జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు ఎమ్మెన్నార్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, అలాగని నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. సేవలు అందించడానికి మం దులు, దవాఖానల్లో సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, పటాన్‌చెరు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ దవాఖానల్లో టెస్టులు నిర్వహిస్తున్నాం. రోజువారీగా 300 వరకు టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన 80శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. అలాంటి వారికి ఇంటి వద్దే వైద్య సేవలందిస్తున్నాం. తీవ్ర లక్షణాలు ఉన్న వారికి జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు ఎమ్మెన్నార్‌లో చికిత్స అందిస్తు న్నాం. రెండు దవాఖానల్లో 200 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 28 మంది చికిత్స పొందుతుండగా, 172 బెడ్ల వరకు అందుబాటులో ఉన్నాయి. కరోనాపై ఎవ రూ ఆందోళన చెందవద్దు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దు. బాధితులకు 24గంటల పాటు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు. తప్పుడు సమాచారం ప్రచా రం చేయడంతో కొవిడ్‌-19 బాధితులు ఆందోళనకు గురవుతారని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ అన్నారు. కరోనా బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే...

 ఐదు దవాఖానల్లో కొవిడ్‌-19 టెస్టులు 

కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను పెంచాం. గతంలో సంగారెడ్డి జిల్లా దవాఖానలోనే టెస్టులు చేశాం. ఇప్పుడు సంగారెడ్డితో పాటు పటాన్‌చెరు, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ దవాఖానల్లో టెస్టులు నిర్వహిస్తున్నాం. త్వరలో అందోలు-జోగిపేట దవాఖానలో కూడా టెస్టులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రకాల టెస్టులు ఉంటాయి. రోజు వారీగా దాదాపు 300 మందికి టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్‌ ఫలితాలు వస్తున్న 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. అలాంటి వారు ఇంట్లోనే వేరుగా ఉండి చికిత్స తీసుకోవచ్చు. కేవలం 5శాతం మందికే సీరియస్‌ లక్షణాలు ఉంటున్నాయి. అలాంటి వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి, మిగతా 15శాతం కొవిడ్‌ కేసులకు జిల్లా దవాఖానలో చికిత్స అందిస్తున్నాం.

ఇంటి వద్దకు మందులు, సేవలు 

ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్‌-19 బాధితులకు తమ ఇండ్ల వద్దనే చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉంచి సేవలు అందిస్తున్నారు. రోజువారీగా వైద్య సిబ్బంది ఫోన్ల ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. అవసరమైతే ఇంటికి వెళ్లి చూసి వస్తున్నారు. మందులు ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చి వస్తున్నాం. ఇండ్ల వద్ద వైద్యం పొందుతున్న చాలామంది వేగంగా కోలుకుంటున్నారు. పాజిటివ్‌ అనగానే ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి వైద్యులు సూచించిన మందులు వాడుకుంటే సరిపోతుంది. అనవసర తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. సోషల్‌ మీడియాలో చాలా వరకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డాక్టర్లకే పాజిటివ్‌ వచ్చిందంటూ ప్రచారం చేస్తూ వైద్యుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సేవలు అందించడం గొప్పవిషయం. వైద్య సిబ్బందిని గౌరవించాలి. ప్ర జలకు మెరుగైన వైద్య సేవ లు అందించడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేస్తున్నారని మరచిపోవద్దు.

భౌతికదూరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి..

కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చిన సందర్భంలో భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌ లేనిదే బయటకు రావద్దు. గుంపులుగా ఉన్నచోటకు వెళ్లకూడదు. అవసరమైతేనే బయటకు వెళ్లాలి. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులను బయటకు తీసుకురావద్దు. చిన్నపాటి జలుబు, జ్వరం రాగానే ఆందోళన చెందవద్దు. అన్నీ కొవిడ్‌-19కు సంబంధించినవి కావు. జలుబు, జ్వరం తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. కొవి డ్‌-19 విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు. అదే తరుణంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తున్నది.

కొవిడ్‌-19 చికిత్సకు అందుబాటులో 200 బెడ్లు

సంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందించడానికి సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ దవాఖాన, ఎమ్మెన్నార్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నాం. ఒక్కో దవాఖానలో 100 బెడ్లను కొవిడ్‌-19 చికిత్సకు వాడుతున్నాం. ప్రస్తుతం జిల్లా దవాఖానలో 25 మంది, ఎమ్మెన్నార్‌లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మిగతా 172 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా దవాఖానలో 10, ఎమ్మెన్నార్‌లో 5 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. పీపీఈ కిట్లు, ఇతర అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరిపడా ఉన్నారు. రాత్రింబవళ్లు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. రోజువారీగా డిశ్చార్జి అవుతున్న వారు ఆరోగ్యంగా తమ ఇండ్లకు వెళ్తున్నారు.


logo