ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 16, 2020 , 02:40:41

అర్హులకు పథకాలు అందాలి

అర్హులకు పథకాలు అందాలి

  •  గ్రామాలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చిదిద్దాలి l  మెదక్‌ను ఓడీఎఫ్‌+ జిల్లాగా  ప్రకటించేలా చర్యలు చేపట్టాలి
  •  పురోగతి పనులను వందశాతం పూర్తి చేయాలి l  మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులందరికీ అందేలా చూడాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మెదక్‌ జిల్లాను ఓడీఎఫ్‌+గా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పురోగతి పనులు వందశాతం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఓడీఎఫ్‌ను ప్రధానాంశంగా తీసుకొని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేరు చేయడం వంటి అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ కింద సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు సెగ్రిగేషన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కమ్యూనిటీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లలో మూత్రశాలల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన సెగ్రిగేషన్‌, వైకుంఠధామాలు, రైతు కల్లాలు, రైతు వేదికల నిర్మాణాలను గడువులోగా పూర్తి కావాలన్నారు.  చెత్తను బయట వేసే పద్ధతిని మాన్పించాలని, దుకాణాదారులకు మూత ఉన్న రెండు పెద్ద చెత్తబుట్టలు అందించాలన్నారు. మార్కెట్‌, ప్రజలు సంచరించే ప్రదేశాల్లో చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలన్నారు. సర్పంచులు, కార్యదర్శులు బాధ్యతతో పని చేయాలని, ప్రతి రోజు గ్రామాల్లో ఇంటింటికెళ్లి, వాహనాల ద్వారా చెత్తను సేకరించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, ఏపీడీ భీమ య్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు ఘన సన్మానం

పారిశుధ్య విషయంలో రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డికే దక్కుతుందని, ఆయన నిరంతరం శ్రమించడంతోనే ఇది సాధ్యమైందని డీపీవో హనోక్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌ అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ధర్మారెడ్డిని అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ధర్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడం అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ఇది కేవలం తన విజయం కాదని, జిల్లా ప్రజలందరికీ దక్కుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.logo