మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jul 16, 2020 , 02:40:43

ఆర్థికాభ్యున్నతి దిశగా మహిళా సంఘాల పయనం

ఆర్థికాభ్యున్నతి దిశగా మహిళా సంఘాల పయనం

  • రూర్బన్‌ పథకం కింద మండలానికి 5 యూనిట్లు మంజూరు
  • ఇప్పటికి దాదాపు 3 యూనిట్లు పూర్తి
  • పూర్తి సబ్సిడీతో  ఏర్పాటు 
  • అర్కెలలో పేపర్‌ గ్లాస్‌ల తయారీ 
  • ఎల్లాపూర్‌లో పేపర్‌ ప్లేట్లు.. 

పాపన్నపేట : మహిళలు తమ కాళ్ల మీద తామె నిలబడి పది మందికి సాయం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. దీంతో ఇంటిల్లిపాదికి పూట గడవడమే కాకుండా పలువురికి ఉపాధి కూడా లభిస్తుంది. గతంలో మండలంలో కులవృత్తులు పెద్ద ఎత్తున కొనసాగేవి పద్మశాలీలు నేత వృత్తినే ఆధారంగా చేసుకుని ఇంటిల్లిపాది దర్జాగా జీవనం సాగించేవారు. అందులో మహిళల పాత్ర ఎంతగానో ఉండేది, ఇదే కాకుండా రాట్నం వడుకుతూ (చరఖా తిప్పుతూ) పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధి పొందడమే కాకుండా తమ కుటుంబాలను పోషించేవారు. ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక విప్లవం పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన నేపథ్యంలో మండలంలో నేత కార్మికులతో పాటు చరఖా సంఘం మూతపడడంతో, వందలాది మంది కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళలకు మళ్లీ ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం వివిధ రకాల యూనిట్లు మంజూరు చేయడంతో మండల పరిధిలోని వివిధ గ్రామాల మహిళల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో రూర్బన్‌ పథకం కింద ప్రభుత్వం మహిళల కోసం రకరకాల యూనిట్లు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడంతో మండల పరిధిలోని పలు గ్రామాల మహిళలకు త్వరలో ఉపాధి దొరకనున్నది. దీంతో మహిళలు తాము ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వం రూర్బన్‌ పథకంలో భాగంగా మండల పరిధిలోని అర్కెల, ఎల్లాపూర్‌, గాంధారిపల్లి గ్రామాలను ఎంపికచేసి వివిధ యూనిట్లను మంజూరు చేసింది. 

ప్రారంభానికి సిద్ధంగా..

మండల పరిధిలోని అర్కెలలో రూ.10లక్షల వ్యయంతో పేపర్‌ గ్లాస్‌ల తయారీ యూనిట్‌ మంజూరు చేయగా, ఎల్లాపూర్‌లో రూ.4లక్షల వ్యయంతో పేపర్‌ ప్లేట్ల తయారీ యూనిట్‌ను మంజూరు చేశారు. ఇక మండల పరిధిలోని గాంధారిపల్లిలో జ్యూట్‌ బ్యాగులతో పాటు కాటన్‌ బ్యాగులు తయారీ కేంద్రానికి రూ.8లక్షల చొప్పున మంజూరు చేయగా దాదాపు పూర్తి కావచ్చాయి. వీటిని గ్రామ మహిళా సంఘానికి చెందిన 5మంది సభ్యులను ఎంపిక చేసి వారికి మంజూరు చేశారు. ఇవి దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయని ఏపీవో సాయిలు వెల్లడించారు. యూనిట్ల సభ్యుల వద్ద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా దాదాపు పూర్తి సబ్సిడీతో ఏర్పాటు చేసింది. అయితే యూనిట్లను సక్రమంగా నడపకపోతే మండల మహిళా సమైక్య తమ ఆధీనంలోకి తీసుకుంటుందని ఏపీవో వివరించారు. వీటిని ఇటీవల డీఆర్డీవో శ్రీనివాస్‌ పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి యూనిట్‌ను ఐదుగురు సభ్యులతో ఎంపిక చేసి మంజూరు చేశారు. ఈ 3 గ్రామాల్లో ఇప్పటికే యూనిట్లు పూర్తి కావస్తుండగా.. వీటితో పాటు మండల పరిధిలోని పాపన్నపేటలో పల్లి పట్టిల యూనిట్‌ కోసం రూ.24లక్షలు మంజూరయ్యాయి. ఇందులో 10మంది సభ్యులు ఉండగా, మల్లంపేటకు సైతం రూ.10లక్షల వ్యయంతో పేపర్‌ బ్యాగుల యూనిట్‌ మంజూరు అయినప్పటికీ, ఈ రెండు యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంతో వారి కాళ్లపై వారు నిలబడేలా అవకాశాలు ఏర్పడుతున్నాయి.logo