సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jul 16, 2020 , 02:40:45

బల్దియాల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోలాహలం

బల్దియాల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోలాహలం

  • దరఖాస్తులకు రేపటి వరకు గడువు
  • ప్రతి మున్సిపాలిటీకి నలుగురు..  
  • ఎన్నికకు జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • ఆశావహుల ప్రయత్నం 

మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దరఖాస్తులకు ఈనెల 17 చివరి తేదీ కావడంతో వారంతా పత్రాలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 27న ఎన్నికలు జరిగి పాలక మండళ్లు ఏర్పాటైన మున్సిపాలిటీల్లో, 60 రోజుల్లోపు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కరోనా-లాక్‌డౌన్‌తో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.    - చేర్యాల

చేర్యాల : మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్‌ సభ్యులు ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో ఆశావహులు పోటాపోటీగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దరఖాస్తులకు ఈనెల 17 చివరి తేదీ కావడంతో ఆశావహులు పత్రాలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపల్‌ కో-ఆప్షన్‌ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది.కో-ఆప్షన్‌ ఎన్నిక చేపట్టాలని కోరుతూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ రెండు జీవోలను ఇటీవల జారీచేశారు.దీంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ ఏడాది జనవరి 27న మున్సిపాలిటీల పాలకమండళ్లు ప్రమాణ స్వీకారం చేయగా, 60 రోజుల లోపు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.కరోనా వైరస్‌ నివారణ కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో కోఆప్షన్ల ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.కోఆప్షన్‌ పదవి దక్కించుకోవాలని మొదటి నుంచి ఆశపడుతున్న పలువురు నాయకులకు, ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వారి ప్రయత్నాలు ప్రారంభించారు.

అర్హతలు ఇవే..

నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం ఇక ప్రతి మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్‌ సభ్యులు ఎన్నిక కానున్నారు. జీవో నెంబర్‌ 57లో మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరు(ఒక మహిళ), జీవో నెంబర్‌ 58ను అనుసరించి మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం,అనుభవం ఉన్న మరో ఇద్దరు(ఒకరు మహిళ) కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. జీవో నెంబర్‌ 57 ప్రకారం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం కలిగి ఐదేండ్ల పాటు చైర్మన్‌, కౌన్సిలర్‌, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, లేదా జడ్పీటీసీ ఇతరత్రా ప్రజాప్రతినిదిగా ఐదేండ్ల పాటు పనిచేసి ఉండాల్సి ఉం టుంది.లేదా మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌లో మూడేండ్ల పాటు పనిచేసిన న్యాయవాది, మున్సిపల్‌ పరిపాలనపై పూర్తి అవగాహన ఉండి, కేం ద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గెజిటెడ్‌ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డు అయిన వారు కోఆప్షన్‌కు అర్హులు. జీవో నెంబర్‌ 58 ద్వారా ఆయా మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాల్సి ఉంటుంది. 21 ఏండ్ల వయస్సుకు తక్కువ కాకుండా ఉండాలి. కో-ఆప్షన్‌ సంబంధిత మున్సిపల్‌ కార్యాలయాల్లో ఈనెల 17 వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు...

మెదక్‌ జిల్లాలో మెదక్‌, తూప్రాన్‌, రామాయంపేట్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, తెల్లాపూర్‌ బల్దియాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటతో పాటు చేర్యాల, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట బల్దియా పాత పాలకవర్గం గడువు ఇంకో ఆరు నెలలు ఉండడంతో అక్కడ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగదు. కొత్త పాలకవర్గం ఎన్నికైన తర్వాత అక్కడ నిర్వహిస్తారు. జహీరాబాద్‌లో కోర్టు ఆదేశాల కారణంగా బల్దియా ఎన్నికలు జరగలేదు. ఇక్కడ కూడా కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగదు. ఒక్కో మున్సిపాలిటీలో నాలుగు చొప్పున కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. తమకు అవకాశం ఇవ్వాలని ఆయా మున్సిపాలిటీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలకు జనవరిలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురువేసి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కో-ఆప్షన్ల సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో జమకానున్నాయి.logo