శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Jul 14, 2020 , 03:40:15

నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..

  నిర్లక్ష్యం చేస్తే  ఇంటికే..

  • l 15రోజుల్లో డంపింగ్‌ యార్డులు     వినియోగంలోకి రావాలి
  •  l ప్రతి ఎంపీడీవో 10రోజుల్లో 50    కల్లాల నిర్మాణం పూర్తి చేయించాలి
  •   l సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 
  •   l ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో     కలిసి సుదీర్ఘ సమీక్ష
  •  l  హుస్నాబాద్‌ ఎంపీవో    సత్యనారాయణ సస్పెన్షన్‌

హుస్నాబాద్‌ : పల్లె, పట్టణ ప్రగతి అనేది కేవలం ఒక సాధారణ కార్యక్రమం కాదని, దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తే పల్లెలు, పట్టణాలు సుభిక్షంగా మారడంతో పాటు ప్రజల జీవనవిధానం కూడా పూర్తిగా మారిపోతుందని కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి అన్నారు. ‘పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన అధికారులు ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితోనే ‘పల్లెప్రగతి’ విజయవంతమవుతుందన్నారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ఎంబీఖాన్‌తో కలిసి పల్లెప్రగతి, హరితహారంపై సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు పూర్తయిన డంపింగ్‌ యార్డులను 15 రోజుల్లో వినియోగంలోకి తేవాలని, ప్రతి ఎంపీడీవో 10 రోజుల్లో 50 కల్లాల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని హెచ్చరించారు. ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శులు విధిగా రోజుకు 8గంటలు పనిచేయాలని,  కనీసం ఐదు గ్రామాలను పర్యటించాలని సూచించారు. హుస్నాబాద్‌ పట్టణాన్ని  హరితవనంగా మార్చాలని కలెక్టర్‌ సూచించారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. 

 ఎంపీవో సత్యనారాయణ సస్పెన్షన్‌ 

హుస్నాబాద్‌ మండల పంచాయతీ అధికారి సత్యనారాయణను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సమీక్షలో ఉత్తర్వులు జారీ చేశారు.  కలెక్టర్‌ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక పోవడం, ఈజీఎస్‌పై అవగాహన లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం, స్థానికంగా ఉండకపోవడం వల్ల ఎంపీవోను సస్పెండ్‌ చేశారు. జిల్లాలోని అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో  జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, డీపీవో సురేశ్‌ బాబు, డీఆర్డీవో గోపాల్‌రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్‌ సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, కమిషనర్‌ రాజమల్లయ్య, మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఎంపీపీలు మాన స, లక్ష్మి, కీర్తి, జడ్పీటీసీ మంగ, ఎన్‌ఎల్‌సీఎఫ్‌ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనీతారెడ్డి పాల్గొన్నారు.