సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jul 14, 2020 , 03:39:55

రెవెన్యూ డివిజన్‌గా అందోల్‌-జోగిపేట

రెవెన్యూ డివిజన్‌గా అందోల్‌-జోగిపేట

n ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు 

n 16 గ్రామాలతో కొత్త మండలంగా చౌటకూర్‌

n అందోలు, పుల్కల్‌, వట్‌పల్లి, చౌటకూర్‌ మండలాలతో కొత్త డివిజన్‌

n ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ హామీ..

n మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కలెక్టర్‌కు  కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

n సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు

అందోల్‌ నియోజకవర్గ ప్రజల రెవెన్యూ డివిజన్‌ కల నెరవేరింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తా’నని సీఎం కేసీఆర్‌ హామీ మేరకు అందోల్‌-జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. పుల్కల్‌ మండలంలోని 16 గ్రామాలతో కొత్తగా చౌటకూర్‌ మండలాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, అందోలు, పుల్కల్‌, వట్‌పల్లి, చౌటకూర్‌ మండలాలతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసింది. సర్కారు నిర్ణయంతో ఆయా మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన చౌటకూర్‌లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ మేరకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, కలెక్టర్‌కు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.- వట్‌పల్లి

వట్‌పల్లి: నియోజకవర్గ ప్రజల చిరకాలస్వప్నం నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం అందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ సోమవారం జీవో జారీ చేసింది. అందోలు, పుల్కల్‌, వట్‌పల్లితో పాటు పుల్కల్‌ మండలంలోని చౌటకూర్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నది. గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, అధికారులతో కలిసి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకుంటున్నారు.  

కొత్త మండలంగా చౌటకూర్‌..

పుల్కల్‌ మండల పరిధిలోని చౌటకూర్‌ను 16 గ్రామాలతో కొత్త మండలంగా ఏర్పాటు కానున్నది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో 8 మండలాలు ఉండగా, కొత్తగా మరో మండలం ఏర్పాటైంది. జాతీయ రహదారిపై ఉన్న చౌటకూర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేసి, జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చౌటకూర్‌, సరాఫ్‌పల్లి, సుల్తాన్‌పూర్‌, కొర్పోల్‌, వొన్నపురం, శివ్వంపేట, చక్రియాల్‌, తాడ్‌దాన్‌పల్లి, గంగోజీపేట్‌, వెంకటకిష్టాపూర్‌, పోసానిపల్లి, వెండికోల్‌, లింగంపల్లి, ఉప్పరిగూడెం, బద్రిగూడెం, బొమ్మరెడ్డిగూడెం గ్రామాలను కలుపుకొని చౌటకూర్‌ను మండలంగా ఏర్పాటు చేయనున్నారు.

నాలుగు మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్‌

అందోలు, పుల్కల్‌, వట్‌పల్లి మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న చౌటకూర్‌ను కలుపుకొని అందోల్‌-జోగిపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానున్నది. నియోజకవర్గంలోని మునిపల్లి మండలం సంగారెడ్డి డివిజన్‌, రాయికోడ్‌ మండలం జహీరాబాద్‌ డివిజన్‌, టేక్మాల్‌, అల్లాదుర్గం, రేగోడు మండలాలు మెదక్‌ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. మిగతా మండలాలైన అందోలు, పుల్కల్‌, వట్‌పల్లి మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న చౌటకూర్‌ మండలాన్ని కలుపుతూ అందోల్‌-జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానున్నది. అందోలు నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తర్వాత రెండు జిల్లాలు, మూడు డివిజన్ల పరిధిలోకి వెళ్లింది. కొత్తగా ఏర్పాటు చేసే అందోల్‌-జోగిపేటను కలుపుకొని నాలుగు రెవెన్యూ డివిజన్‌ల్లో నియోజకవర్గం ఉండనున్నది.

డివిజన్‌ ఏర్పాటు చేసిన  సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

అందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌తో పాటు కలెక్టర్‌ హనుమంతరావు ఎంతో సహకరించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, చౌటకూర్‌ మండలంగా ఏర్పాటు కావడంతో రాహదారిపై ఉన్న గ్రామాలకు ప్రభుత్వ పాలన మరింత చేరువకానున్నది.  - చంటి క్రాంతి కిరణ్‌, ఎమ్మెల్యే 

మండల కేంద్రంలో భవనాల గుర్తింపు

పుల్కల్‌: చౌటకూర్‌ మండలంలో కార్యాలయాల ఏర్పాటుకు గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలను గుర్తించారు. రెండు పాత గ్రామపంచాయతీలు, అటవీశాఖ భవనంతో పాటు కొన్ని ప్రైవేట్‌ భవనాలను అధికారులు గుర్తించారు. ఈ భవనాల్లోనే రెవెన్యూ, పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయశాఖ కోసం మరో రెండు నెలల్లో పూర్తి కానున్న రైతు వేదిక భవనాన్ని వినియోగించనున్నారు. కాగా, మండల కేంద్రం ఏర్పాటుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


logo