మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jul 12, 2020 , 23:49:06

కరోనా హైరానా

కరోనా హైరానా

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో ఆదివారం 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి 11, సదాశివపేట 3, దోమడుగు 3, భానూర్‌ 1, అమీన్‌పూర్‌ 2, సదాశివపేట మండలం వెంకటాపూర్‌లో 2, ఆర్‌సీపురం 3, పటాన్‌చెరు 1, ఇస్నాపూర్‌ 1, ముత్తంగి 1, కంది 1, జిన్నారం మండలం చెట్లపోతారంలో 1 మొత్తం జిల్లాలో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో వెల్లడించారు.

గుమ్మడిదల మండలంలో నాలుగు కరోనా  

గుమ్మడిదల:మండలంలోని దోమడుగులో ఈ నెల 3వ తేదీన ఓ మహిళ కరోనా పాజిటివ్‌తో మృతి చెందగా, మహిళ అంత్యక్రియలో పాల్గొన్న వ్యక్తులకు కరోనా సోకింది. నాలుగు రోజుల కింద ఇద్దరి వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా, తాజాగా ఆదివారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. ఇందులో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారు. బొంతపల్లిలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. వీరిని గాంధీ దవాఖానకు తరలించారు.  

హుస్నాబాద్‌లో రెండుకు చేరిన పాజిటివ్‌ కేసులు  

హుస్నాబాద్‌: పట్టణంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి దగ్గు, జ్వరంతో బాధపడుతూ కరీంనగర్‌ సమీపంలోని బొమ్మకల్‌ చల్మెడ దవాఖానలో పరీక్ష  చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది.  ఆదివారం స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ సౌమ్య, తన సిబ్బందితో వచ్చి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని 108లో సిద్దిపేటలోని జిల్లా దవాఖాన ఐసోలేషన్‌కు తరలించారు. కరోనా వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు 16మందిని ప్రైమరీ కాంటాక్ట్‌, ముగ్గురిని సెకండరీ కాంటాక్ట్‌గా గుర్తించి వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

నర్సాపూర్‌లో ఇద్దరికి.. 

నర్సాపూర్‌: పట్టణంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలి పారు. తాజాగా, మరో ఇద్దరు పట్టణ వాసులకు కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొ న్నారు. పట్టణంలోని గాంధీ వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితోపాటు మండలంలోని మూసపేట గ్రామానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమెకు సైతం కరోనా సోకినట్లు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈమె నగరంలోని మల్లారెడ్డి దవాఖానలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 

రంగంపేటలో ఒకరికి... 

కొల్చారం: మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన యువకుడు (25) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెదక్‌ పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న సదరు యువకుడు 15రోజుల కింద అస్వస్థతకు గురయ్యాడు. ఈ నెల 4వ తేదీన మెదక్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. దగ్గు, జలుబు తగ్గకపోవడంతో యువకుడి తండ్రి మెదక్‌ ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ సమ్రీన్‌ తెలిపారు. ఆదివారం వైద్యాధికారి సమ్రీన్‌, కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, సీహెచ్‌వో సూదర్శన్‌, సర్పంచ్‌ బండి సుజాత, ఎంపీటీసీ మాధవి కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడిని  హోం క్వారంటైన్‌ ఉండాలని సూచించారు. 

రామాయంపేటలో ఎనిమిదికి చేరిన కేసులు

రామాయంపేట: రామాయంపేట మున్సిపల్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల నిర్ధ్దారణ సంఖ్య ఎనిమిదికి చేరింది. గొల్పర్తికి చెందిన 35 ఏండ్ల వ్యక్తి రామాయంపేటలోనే ఓ పాల కేంద్రంలో పనులు చేస్తాడు. పట్టణంలో పాలకేంద్రం నడిపే వ్యక్తికి నాలుగు రోజుల కింద కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో గొల్పర్తి గ్రామానికి చెందిన వ్యక్తికి కామారెడ్డిలో పరీక్షలు నిర్వహించారు. అతడికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆదివారం పుర పాలికలోని వైద్య ఆరోగ్య సిబ్బంది గొల్పర్తి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలను అందజేశారు.  

ఘనపూర్‌లో రెండు కేసులు

తూప్రాన్‌ రూరల్‌: మండలంలోని ఘనపూర్‌లో ఓ వృద్ధ మహిళ (70) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావన పేర్కొన్నారు. ఘనపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌కు పాజిటివ్‌గా తేలడంతో అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వృద్ధ మహిళ మూ డు రోజులుగా దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడం లక్షణాలతో బాధపడుతుంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఘనపూర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2కు చేరింది.

గ్రామాల్లో సోడియం హైడ్రోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ 

చేగుంట: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కరోనా నివారణకు పంచాయతీ సిబ్బంది  హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. చేగుంటలో ఒకరికి, కర్నాల్‌పల్లిలో 1, కరీంనగర్‌ కుక్కుల గుట్ట తండాలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది పరిసర ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచి వారికి స్టాంపుల వేశారు. రాంపూర్‌లో సర్పంచ్‌ కాశబోయిన భాస్క ర్‌ హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.


logo