బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 12, 2020 , 23:49:02

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు

న్యాల్‌కల్‌: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత శాఖ అధికారులు, సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఆదివారం మండలంలోని రేజింతల్‌, హద్నూర్‌, ముంగి, న్యాల్‌కల్‌ గ్రామాల్లో  వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, రైతు వేదిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని సర్పంచ్‌లు, కార్యదర్శులను హెచ్చరించారు. సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, గడువులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రేజింతల్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ మొక్కలను నాటారు. ఇంటి పరిసరాల్లో ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. హద్నూర్‌ను మండల కేంద్రంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సర్పంచ్‌ వీరమణి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్తగా పంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు రేజింతల్‌ సిద్ధివినాయక ఆలయంలో కలెక్టర్‌ పూజలు చేశారు. కలెక్టర్‌ వెంట జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ  ఏడీఏ నర్సింగ్‌రావు, తహసీల్దార్‌ రాధాబాయి, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఏవో లావణ్య, పంచాయతీ కార్య దర్శి యాదయ్య, ఏఈవో సాయిలు, షరీఫ్‌, సర్పంచ్‌లు కుతుబోద్ధీన్‌, వీరమణి, శివశంకరయ్య స్వామి, ఎంపీటీసీ సలీం, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు రాజ్‌కుమార్‌, మునీరొద్దీన్‌, బక్కారెడ్డి, మహేశ్‌, నింగప్ప ఉన్నారు.

డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను   పూర్తి చేయాలి

కంది: గడువులోగా డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం కంది మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనుకున్న సమయానికి డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలను పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం వహిస్తే సహించేది లేదన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు మండలంలో గ్రామాల వారీగా ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు. హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. హరితహారంలో భాగంగా నాటి ప్రతి మొక్కను రక్షించాలని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీపీ సరళాపుల్లారెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.logo