గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jul 12, 2020 , 23:39:12

30 మంది సర్పంచులు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

30 మంది సర్పంచులు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిర్మా ణం చివరి దశలో ఉన్న వైకుంఠధామాలను పూర్తి చేయించడంతో నిర్ల క్ష్యం, పారిశుధ్య నిర్వహణ లోపించడం, హరితహారం అమలుపై శ్రద్ధ చూపించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, ప్రజాప్రతినిధులు, అధికారులపై కన్నెర్ర చేశారు. ఆదివారం జిల్లాలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన, 30 గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. మున్సిపాలిటీల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సంగారెడ్డి, సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కమిషనర్లకు సైతం కలెక్టర్‌ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో పనితీరు మారకుంటే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈనెల 15 వరకు వైకుంఠధామాల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా, మిగిలిపోయిన చిన్నపాటి పనులు పూర్తి చేయించడంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించడాన్ని కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకున్నారు. 

సుడిగాలి పర్యటన...

ఆదివారం సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్‌ హనుమంతరావు సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో ప్రధానంగా వైకుంఠధామాల నిర్మాణం, హరితహారం అమలు, పారిశుధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. సదాశివపేట మండలం అంకెనపల్లి, ఎన్కేపల్లి, న్యాల్‌కల్‌ మండలంలో రేజింతల్‌, హద్నూర, ముంగి, న్యాల్‌కల్‌తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. కంది మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాలకు వెళ్లగానే మొదటగా పూర్తయిన డంపింగ్‌యార్డులను పరిశీలించి, వైకుంఠధామాలు ఇంకా ఎందుకు పూర్తికాలేదు స్వయంగా పరిశీలించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తయినప్పటికీ, సున్నం వేయడం, ఇతర చిన్నపాటి పనులు పూర్తికాలేదని కలెక్టర్‌ గుర్తించారు. చిన్నపాటి పనులుంటే త్వరగా పూర్తి చేయాలని ఇటీవలే పలుమార్లు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఎన్నిసార్లు ఆదేశించినా ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామాల సందర్శనలో కలెక్టర్‌ గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15న పూర్తికావాల్సి ఉండగా...

డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, అన్ని పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. వాటికి చెత్త తరలించి ఎరువులను తయారు చేస్తున్నారు. డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచినట్లే, వైకుంఠధామాల నిర్మాణంలో కూడా సంగారెడ్డి నంబర్‌వన్‌గా ఉండాలని సర్పంచులు, కార్యదర్శులకు కలెక్టర్‌ ఆదేశించారు. మంత్రి హరీశ్‌రావు సైతం ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రోజు వారీగా కలెక్టర్‌ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. ఈ 15న వరకు వైకుంఠధామాల నిర్మా ణం పూర్తవుతుందని ఆశించారు. కలెక్టర్‌ గ్రామాలకు వెళ్లినప్పుడు పూర్తి కావడానికి ఇంకా సమ యం పట్టనుందని గుర్తించారు. చిన్పపాటి ప్యాచ్‌వర్క్‌లు, సున్నం వేయడం వంటి పనులు మా త్రమే కాలేదని, ఈ మాత్రం పనులు చేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే 30 మంది సర్పంచులు, 30 మంది కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

మూడు మున్సిపాలిటీల  చైర్‌పర్సన్లు, కమిషనర్లకు... 

సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు, అమీన్‌పూర్‌, బొల్లారం, తెల్లాపూర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో కూడా కలెక్టర్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే హరితహారంలో పలు మున్సిపాలిటీలు వెనుకబడినట్లు గుర్తించారు. ప్రధానంగా సంగారెడ్డి, సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీలు హరితహా రం అమలులో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఆ మూడు మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కమిషనర్లకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలు కఠినంగా ఉన్నాయని, హరితహారం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వారం రోజుల్లో వీరిలో మార్పు రాకపోతే అందరినీ సస్పెండ్‌ చేయడానికైనా వెనుకాడబోమని, ఎవరినీ ఉపేక్షించబోమని కలెక్టర్‌ హెచ్చరించారు.

అభినందనలు కూడా...

కంది మండలంలో అన్ని గ్రామాల్లో డంసింగ్‌యార్డులతో పాటు వైకుంఠధామాలు పూర్తి చేసినందుకు పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కంది మండల పరిషత్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆదివారం కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం త్వరగా పూర్తిచేసి జిల్లాను నంబర్‌వన్‌ స్థానంలో నిలిపిన కార్యదర్శులను అభినందించారు. అన్ని డంపింగ్‌ యార్డుల్లో తడి,పొడి చెత్త వేరుగా చేసి ఎరువులు తయారు చేయాలని  ఆదేశించారు.


logo