బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 12, 2020 , 01:31:18

హరితం... సతతం

హరితం... సతతం

  •  ఆరో విడుత లక్ష్యం 55.70 లక్షలు 
  •  గత నెల 25 నుంచి 8వ తేదీ వరకు  నాటింది 13. 33 లక్షలు 
  •  10.76లక్షల మొక్కలు నాటిన  జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 
  •  అటవీ శాఖ టార్గెట్‌ 5 లక్షల మొక్కలు

మెదక్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడుత హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరుగా సాగుతోంది. మెదక్‌ జిల్లాను ఆకుపచ్చ మెదక్‌గా తీర్చిదిద్డడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. వర్షాకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటించేందుకు జిల్లా యంత్రాంగం పరుగులు పెడుతోంది. గత ఐదో విడుతలో లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న జిల్లా యంత్రాంగం ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది. జిల్లా టార్గెట్‌ 55 లక్షల 70వేల మొక్కలు కాగా ఇప్పటి వరకు 13 లక్షల 33వేల మొక్కలు నాటారు. శాఖల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  ప్రతి రోజు ఏదో ఒక మండలంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. ఆరో విడుత హరితహారంలో మెదక్‌ జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఒక్కో జిల్లా అధికారికి మండలాల బాధ్యతలు అప్పగించారు. అధికారులు లక్ష్యాన్ని చేరుకుంటేనే హరితహారం విజయవంతమవుతోంది.

శాఖల వారీగా టార్గెట్‌..

జిల్లా వ్యాప్తంగా 25 శాఖలకు ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్ని శాఖలు కలిపి 55 లక్షల 70వేల మొక్కలు నాటాలి. ఇందులో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో  37 లక్షల 38వేలు, అటవీ శాఖ 5లక్షలు, మెదక్‌ మున్సిపాలిటీలో 3లక్షల 31వేలు, నర్సాపూర్‌ మున్సిపాలిటీలో లక్షా 75వేలు, రామాయంపేట మున్సిపాలిటీలో లక్షా 16 వేలతో పాటు మిగతా శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటాలి. జూన్‌ 25వ తేదీన జిల్లాలో ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. డీఆర్‌డీఏ, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన నర్సరీల్లో మొక్కలను గ్రామ పంచాయతీల్లో నాటుతున్నారు. ఆగస్టు చివరి వారం వరకు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇలా..

జిల్లాలోని మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో 8లక్షల 16వేల మొక్కలు నాటాలని టార్గెట్‌ ఉంది. గడిచిన రెండు వారాల్లో ఈ మున్సిపాలిటీల్లో కేవలం పది వేల మొక్కలు మాత్రమే నాటారు. ఆరో విడుత హరితహారంలో మున్సిపాలిటీలను పచ్చని పట్టణాలుగా చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత జోరు పెంచేందుకు మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు హరితహారంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 


logo