ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 12, 2020 , 01:29:58

మల్లన్నకు రజత కాంతులు

మల్లన్నకు రజత కాంతులు

  • కొమురవెల్లి మల్లన్న ఆలయానికి నూతన శోభ
  • ఆలయ ద్వారాలకు 425 కేజీలతో వెండి తొడుగులు
  • ఆన్‌లైన్‌ టెండర్‌కు శ్రీకారం చుట్టిన ఆలయవర్గాలు
  • బ్రహ్మోత్సవాల నాటికి  పూర్తి చేసేలా పనులు..
  • మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.2.75 కోట్లు 

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం నూతన శోభను సంతరించుకోనుంది. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 425 కేజీల వెండితో ఆలయంలోని ప్రధాన ద్వారాలతో పాటు తలుపులకు వెండి తొడుగులు ఏర్పాటు చేయనున్నారు. మహా మండపం, అర్ధమండపం వద్ద గల 5 ద్వారాలు, తలుపులకు వెండితో తాపడం వేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. వెండి తొడుగులు వేసేందుకు రూ.50 లక్షల మేరకు వ్యయం కానుందని ఆలయవర్గాలు తెలిపాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయానికి ఈ పనులన్నీ పూర్తిచేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఈవో తెలిపారు. - చేర్యాల

చేర్యాల: భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం నూతన శోభను సంతరించుకోనుంది. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన 425 కేజీల వెండితో ఆలయంలోని ప్రధాన ద్వారాలతో పాటు తలుపులకు వెండి తొడుగులు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు మొక్కుల రూపంలో స్వామి, అమ్మవార్లకు సమర్పించిన మిశ్రమ వెండిని బ్రహ్మోత్సవాల సమయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కరిగించి స్వచ్ఛమైన వెండిని తీయించారు. స్వచ్ఛమైన వెండితో స్వామివారి ఆలయంలోని మహామండపంతో పాటు అర్ధమండపం, అంతరాలయం వద్ద గల ప్రధాన ద్వారాలను సిల్వర్‌(వెండి)తో తాపడంతో సింగారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహా మండపం, అర్ధమండపం వద్ద గల 5 ద్వారాలు, తలుపులకు రూ.2.25 కోట్ల విలువైన వెండితో తాపడం వేసేందుకు ఇటీవల ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ ఆన్‌లైన్‌ (ఈ-ప్రొక్యూర్‌మెంట్‌)లో టెండర్లకు శ్రీకారం చుట్టారు. ఈనెల 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తక్కువ ఖర్చుకు పనులు చేసేందుకు టెండరు వేసిన సంస్థ్ధకు పనులు అప్పగించనున్నారు. మహామండపం ఒకటి, అర్ధ మండపం మరొకటి, అంతరాలయంలో 3 దర్వాజలకు వెండి తొడుగులు ఏర్పాటు చేయనున్నారు. 5 ద్వారాల తలుపులు తదితర వాటికి వెండి తొడుగులు వేసేందుకు రూ.50 లక్షల మేరకు వ్యయం కానుందని ఆలయవర్గాలు తెలిపాయి.

రూ.2 కోట్ల పైచిలుకు వ్యయంతో సొబగులు...

ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మల్లన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. స్వామివారి ఆలయ ద్వారాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేస్తే ఎంతో సుందరంగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి ఆలయవర్గాలు తీసుకెళ్లాయి. స్పందించిన వారు మిశ్రమ వెండిని శుద్ధిచేసి స్వచ్ఛమైన వెండిని తీసి, దాంతో ఆలయ ద్వారాలకు తాపడం చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆలయ అధికారులకు ఆదేశించారు. దీంతో స్పందించిన ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ తదితరులు మిశ్రమ వెండిని హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లిలో గల భారత ప్రభుత్వ వెండి శుద్ధీకరణశాలలో సుమారు 780 కిలోల మిశ్రమ వెండిని కరిగించారు. అందులో రూ.2,25,000,00 విలువైన వెండితో సుమారు రూ.50లక్షల వ్యయంతో ఆలయ ద్వారాలకు నూతన సొబగులకు శ్రీకారం చుట్టనున్నారు. 

సకాలంలో పనులు పూర్తి చేయిస్తాం..

మల్లన్న ఆలయ ద్వారాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేసే ప్రక్రియ కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచాం. తక్కువ ధరలకు పనులు చేసే సంస్థలకు ఈనెల 14న టెండరు ఖరారు చేస్తాం. మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముందే తలుపులకు వెండి తొడుగులు ఏర్పాటు పనులు పూర్తి చేయిస్తాం. - టంకశాల వెంకటేశ్‌, కొమురవెల్లి మల్లన్న ఆలయ, ఈవో 


logo