బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 09, 2020 , 23:57:00

కలవరపెడుతున్న కరోనా

కలవరపెడుతున్న కరోనా

సంగారెడ్డి మున్సిపాలిటీ : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు కలవరం పెడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజు 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారని డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి 22, సదాశివపేట 7, జహీరాబాద్‌ 12, ఆర్‌సీపురం 1, పటాన్‌చెరు 2, సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి 3, ఝరాసంగం మండలం జీర్లపల్లి 1, కంది 1, రాయికోడ్‌ మండలం సిరూర్‌ 1, రంజోల్‌ 6, బీడీఎల్‌ టౌన్‌షిప్‌ 1, భానూర్‌ 2, బీరంగూడ 2, దోమడుగు 2, అమీన్‌పూర్‌ 3, కల్హేర్‌ 1, ముత్తంగి 1, సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట 1 మొత్తం 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పటాన్‌చెరులో ఓ వ్యక్తి(50) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

గుమ్మడిదల మండలంలో..

గుమ్మడిదల : మండలంలోని దోమడుగులో ఈ నెల 3న ఓ మహిళ మృతి చెందింది. అనంతరం ఉస్మానియా దవాఖాన వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు. అన్నారం పంచాయతీ పరిధిలోని ప్రకృతి నివాస్‌లో ఉండే ఒక ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. 

మెదక్‌ జిల్లాలో..

పాపన్నపేట : మండలంలోని ఎల్లాపూర్‌వాసి(49)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు గురువారం తెలిపారు. సదరు వ్యక్తికి గత నెల 27వ తేదీ నుంచి జ్వరం రావడంతో మెదక్‌లోని వివిధ దవాఖానల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా బుధవారం రాత్రి నిర్ధారించారు. పాపన్నపేట తహసీల్దార్‌ బలరాం, ఎస్సై ఆంజనేయులు, వైద్యాధికారి విశాల్‌రాజు, సీహెచ్‌వో షాహెద్‌తో పాటు వైద్య సిబ్బంది ఎల్లాపూర్‌ చేరుకొని కుటుంబ సభ్యులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. వైద్య బృందం ఇంటింటి సర్వే చేశారు. 

బుజ్రాన్‌పల్లిలో మహిళకు కరోనా 

పెద్దశంకరంపేట : హైదరాబాద్‌ చంపాపేటలో జీవానోపాధికి వెళ్లిన మండలంలోని బుజ్రాన్‌పల్లికి చెందిన మహిళ(32)కు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌ చంపాపేటలో పలు ఇండ్లల్లో పని చేసి జీవిస్తున్నది. ఓ ఇంటి యజమానికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెకు, కొడుకుకు గొంతు స్రావం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా గురువారం మహిళకు పాజిటివ్‌ రాగా ఆమె కొడుకుకు నెగెటివ్‌ వచ్చింది. ఆమె వెంటనే తన కుమారుడితో సొంతూరు బుజ్రాన్‌పల్లికి చేరుకుంది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి వివరాలు సేకరించారు.

చిలిపిచెడ్‌ మండలంలో మరో ఇద్దరికి... 

చిలిపిచెడ్‌ : మండలంలోని బండపోతుగల్‌ గ్రామానికి చెందిన మరో వ్యక్తికి, గౌతాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మండల ప్రాథమిక వైద్యాధికారి వెంకటస్వామి తెలిపారు.  

ఘనపూర్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌కు...

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ మండలం ఘనపూర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌(56)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావన తెలిపారు. కొద్ది రోజులుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఈ నెల 5న తూప్రాన్‌ ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు. కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా, కుటుంబీకులు ఈ నెల 6న నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావన ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గురువారం ఘనపూర్‌ వెళ్లి సన్నిహితంగా మెలిగిన 22 మందికి హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. 

మెదక్‌ పట్టణం ఫత్తేనగర్‌లో మహిళకు..

మెదక్‌ : మెదక్‌ పట్టణంలోని ఫత్తేనగర్‌కు చెందిన మహిళ(53) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో  వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పారు.  logo