ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jul 09, 2020 , 23:57:03

‘స్వచ్ఛత’ బాటన..

‘స్వచ్ఛత’ బాటన..

అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తి చేసుకొని సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, గురువారం సాయంత్రం వరకు అన్ని జీపీల పరిధిలో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్రంలో ఇంత వరకు ఏ జిల్లా ఈ ఘనత సాధించలేదు. ‘స్వచ్ఛ’ గ్రామాల దిశగా ఇదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కలెక్టర్‌ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు, సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు అందరూ కృషి చేయడంతో వేగంగా ఈ పనులు పూర్తయ్యాయి. ఇక ఏ గ్రామానికి వెళ్లినా చెత్త బయట కనిపించదు. శనివారం నుంచి ఆరుబయట చెత్తవేసిన వారికి రూ.50 జరిమానా విధించేందుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. మరో 5 రోజుల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు సైతం పూర్తి కానున్నాయని కలెక్టర్‌ ప్రకటించారు.

  • సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తి
  • రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా గుర్తింపు
  • 250 గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ
  • చెత్త బయట వేస్తే రేపటి నుంచి రూ.50 జరిమానా
  • స్వయం సహాయక సంఘాలకు పర్యవేక్షణ బాధ్యతలు
  • ఎరువు తయారీ తర్వాత కిలో   రూ.3కు అమ్మడానికి ఏర్పాట్లు
  • రాత్రింబవళ్లు పనులు కొనసాగడంతో నిర్మాణాలు పూర్తి
  • సిబ్బంది కృషితోనే ఈ ప్రగతి : కలెక్టర్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సంగారెడ్డి జిల్లాలో ఇక ఏ గ్రామానికి వెళ్లినా చెత్త బయట కనిపించదు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా, గురువారం సాయంత్రం వరకు అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డులు ఉన్న జిల్లాగా రాష్ట్రంలోనే సంగారెడ్డి రికార్డు సృష్టించింది. మంత్రి హరీశ్‌రావు సమీక్షలు, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవతో వేగంగా నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. వారం రోజులుగా అన్ని గ్రామాల్లో రాత్రింబవళ్లు నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రగతి సాధించామని కలెక్టర్‌ చెప్పారు. కాగా, 250 గ్రామాల్లో తడి,పొడి చెత్త సేకరించి ఎరువుల తయారీ మొదలు పెట్టారు. మిగతా గ్రామాల్లో కూడా చెత్తను సేకరిస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ట్రాక్టర్లు పంపిణీ చేయడంతో చెత్త సేకరణ సులభంగా మారింది. చెత్త సేకరణ, ఎరువుల తయారీ ప్రక్రియను జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈనెల 11 నుంచి ఆరుబయట చెత్తవేసిన వారికి రూ.50 జరిమానా విధించనున్నట్లు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

10 గుంటల్లో నిర్మాణం..

పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో 10 గుంటల చొప్పున స్థలాన్ని గుర్తించారు. ఎక్కడికక్కడ వేగంగా డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తిచేయడానికి కలెక్టర్‌ మొదలుకుని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు రోజువారీగా పర్యవేక్షించారు. మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని నియోజకవర్గాలు, మండలాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఒక్కోరోజూ గంటల తరబడి మంత్రి సమీక్షలు నిర్వహించడంతో అధికారులతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల్లో నిర్మాణాలపై ఉత్సాహం వచ్చింది. నిర్మాణాలు పూర్తయిన గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. దీంతో గ్రామాల మధ్య పోటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. కలెక్టర్‌ హనుమంతరావు రాత్రి వేళలో కూడా ఆకస్మిక పర్యటనలు చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిని హెచ్చరించారు. 

647 గ్రామాల్లో చెత్త సేకరణ..

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు, ట్రైలర్లు కొనుగోలు చేశాయి. చెత్త తరలించడానికి ట్రాలీలు ఉపయోగిస్తున్నారు. అన్ని జీపీల్లో  డంపింగ్‌ యార్డుల పూర్తితో సంగారెడ్డి జిల్లా రికార్డు సృష్టించగా, 250 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులకు వచ్చిన తడి,పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ఎరువులు 30 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ ఎరువులను కిలోకు రూ.3 చొప్పున అమ్మడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 17,130 వరకు స్వయం సహాయక మహిళా సంఘాలు ఉండగా, ఇందులో 1.81 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అన్ని గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న డంపింగ్‌ యార్డుల్లో ఎరువుల తయారీ, ఇతర పర్యవేక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు. కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారులు పరిశీలించనున్నారు.

రేపటి నుంచి చెత్తవేస్తే రూ.50 జరిమానా..

అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు పూర్తి కావడం, ట్రాక్టర్ల ద్వారా వాటిని తరలిస్తున్న నేపథ్యంలో, ఇక ఏ గ్రామంలో ఆరుబయట చెత్త వేస్తే రూ.50 జరిమానా విధించనున్నారు. మహిళా సంఘాలు ఈ జరిమానా ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి. జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు జరిమానా ధర నిర్ణయించారు. ఈ మేరకు జరిమానా వేయనున్నట్లు అన్ని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. ఈ నెల 11 నుంచి జరిమానాల విధింపు ప్రక్రియ మొదలుకానున్నది. ఇందులో ఎవరికీ మినహాయింపు ఇవ్వకూడదని, బయట చెత్తవేసిన వారు ఎవరైనా జరిమానా విధించాలని కలెక్టర్‌ స్వయం సహాయక సంఘాల మహిళలను ఆదేశించారు. పదేపదే వేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితో..

ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రత్యేక కృషితోనే డంపింగ్‌ యార్డుల నిర్మాణంలో రాష్ట్రంలోనే సంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.మొత్తం 647 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తిచేశాం.మరో 5 రోజుల్లో జిల్లాలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి కానున్నాయని ప్రకటించుకోవడానికి సంతోషిస్తున్నా.

- హనుమంతరావు, కలెక్టర్‌ సంగారెడ్డి


logo