గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jul 08, 2020 , 22:53:36

పట్టణాలు ఖాళీ... పల్లెకు పయనం!

పట్టణాలు ఖాళీ... పల్లెకు పయనం!

పల్లె బతుకు చిత్రం మారుతున్నది. ఒకప్పుడు ఉపాధి అవకాశాలు కరువై పల్లె నుంచి ఎందరో పట్నంబాట పట్టగా.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. పోయినోళ్లందరినీ పల్ల్లె రమ్మంటున్నది. ఇప్పుడు పల్లెనే అందరికీ భరోసాను కల్పిస్తున్నది. పుష్కలంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు,తాగునీటి వెతలు తీరాయి. కాళేశ్వరం జలాలతో  పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి రావడం, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందడం, నాణ్యమైన ఉచిత కరెంట్‌ సరఫరాతో పల్లెల్లో సాగు సందడి నెలకొన్నది. దీంతో అనేక మందికి ఉపాధి లభిస్తున్నది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో చాలామంది పట్టణాలు, నగరాల్లో ఉండేందుకు అయిష్టత చూపుతున్నారు. భయంతో ఇండ్లు ఖాళీచేస్తున్నారు. దీంతో ‘టు లెట్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలామంది ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కోల్పోయి పల్లెబాట పడుతున్నారు. దీంతో కొత్తగా వచ్చిన వారితో పల్లెల్లో సందడి నెలకొంటున్నది.   -సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కరోనా తీవ్రత నేపథ్యంలో పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అద్దె ఇండ్లు దొరకడం గగనమైన నగరంలో, ఇప్పుడు ఇండ్ల గేట్లకు ‘టు లెట్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పక్కింట్లో ఉన్నవారు, రాత్రికి రాత్రే తట్టాబుట్టా సర్దుకుని ఊర్లకు వెళ్లిపోతున్నారు. రోజుల వ్యవధిలో అనేక చిన్న సంస్థలు మూత పడుతుండడంతో, వేతనాల కోతలు, ఇంటి అద్దెల భయంతో పట్టణాన్ని విడిచి వెళ్లక తప్పడం లేదు. ఇదే సమయంలో గతంలో పనిలేక దినం గడవడం గగనమైన పల్లెల్లో, ఇప్పుడు సందడి నెలకొంటున్నది. జోరుగా పంటలు సాగవుతున్నాయి. బీడు పడిన భూముల్లో నాగళ్లు కనిపిస్తున్నాయి. అన్నదాతలు పంటల సాగులో బిజీ అయ్యారు. కాళేశ్వర జలాలు పల్లె చెరువుల్లో చేరడం, సర్కారు పెట్టుబడి సాయం అందించడం, పెద్ద ఎత్తున పంటల సాగుతో చేతినిండా పని దొరకుతుండడంతో ప్రజలు పట్టణం నుంచి తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. ఐటీ సెక్టార్‌లో పనిచేసే వారు కూడా కరోనాతో పనులు కోల్పోయి ఊరి బాట పడుతున్నారు. కొత్తగా ఊర్లకు వచ్చిన వారితో పల్లెల్లో సందడి నెలకొంటున్నది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, సంగారెడ్డి, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతాల్లో ఖాళీ ఇండ్లు కనిపిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు సాధారణ ప్రజలను పల్లెల బాట పట్టిస్తున్నాయి. కరోనా తీవ్రతతో ఇప్పటికే రెండు నెలల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఇప్పటికే చాలా వరకు సంస్థలు తమ కార్యకలాపాలు సాగించడం లేవు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు, జిన్నారం, గుమ్మడిదల, సంగారెడ్డి, హత్నూర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వెలిశాయి. ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెళ్లిపోవడంతో అన్ని పరిశ్రమల ముందు ‘వాంటెడ్‌ వర్కర్స్‌' బోర్డులు ఏర్పాటు చేసుకున్నాయి. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ర్టాలకు చెందిన వారు తమ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉపాధి లేకపోవడంతో తిరిగి ఇక్కడకు వస్తున్నారు. అయితే మన ప్రాంతానికి చెందిన వారు మాత్రం పట్టణాలు విడిచి గ్రామాలకు వెళ్తున్నారు. వెళ్లినవారు తిరిగి రావడం లేదు. ప్రస్తుతం పరిశ్రమల్లో పనిచేస్తున్న కొద్దిమంది కూడా ఇతర రాష్ర్టాల వారే. తెలంగాణ వారు మాత్రం దాదాపుగా అందరూ గ్రామాల బాటపట్టారు. అనుకున్న స్థాయిలో పనిదొరక్క పోవడం, ఇంటి అద్దెలు అధికంగా ఉండడం వారు గ్రామాలకు వెళ్లడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అద్దె ఇండ్లలో ఉండి, కష్టాలు పడుతూ అరకొర సంపాదన కంటే, గ్రామాల్లో ఇప్పుడు బాగా పనులు లభిస్తున్నాయని భావించి వెళ్తున్నారు. 

ఉచిత బియ్యం, పెట్టుబడి సాయం...

ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని ఒక్కొక్కరికి ప్రభుత్వం 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నది. నవంబర్‌ వరకు ఈ ఉచిత రేషన్‌ పంపిణీ కొనసాగనున్నది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8,75,492 రేషన్‌కార్డులు ఉండగా.. 28,60,599 మంది సభ్యులున్నారు. వీరందరికి 10 కిలోల చొప్పున 2,86,05,990 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ బియ్యం దేశంలో ఎక్కడైనా తీసుకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న వారు కూడా గ్రామాలకు వెళ్లి అక్కడ ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఉమ్మడి జిల్లాలో రైతులందరికీ ఈ సాయం అందింది. ఈసారి కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 7.64 లక్షల మంది పెట్టుబడి సాయం తీసుకున్నారు. సర్కారు ఇచ్చిన సాయంతో ఇంతకు ముందు వ్యవసాయం చేయని వారు కూడా గ్రామాల్లోకి వచ్చి పంటలు సాగు చేస్తున్నారు. 

పట్నంలో భయపెడుతున్న కరోనా...

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్న వారికి ఇక్కడ బతుకుపై భయం మొదలైంది. ఓ వైపు పనులు తగ్గిపోవడం, మరోవైపు అద్దె గదులు, ఇటు కరోనా కేసులు ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నవారు.. గదులు ఖాళీ చేసి పల్లెదారి పడుతున్నారు. ఊర్లో ఏదైనా పనిచేసుకుంటాం... అక్కడే ఉంటామంటూ సామాన్లు సర్దుకుని గ్రామాలకు వెళ్తున్నారు. రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్‌, అమీన్‌పూర్‌, పటాన్‌చెరు ప్రాంతాల్లో రూ.వేలల్లో ఉన్న అద్దె గదులను తక్షణమే ఖాళీ చేసి సింగిల్‌ బెడ్రూమ్‌లలోకి మారిపోతున్నారు. లేదంటే గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో చాలా వరకు టులెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అద్దె ఎక్కువగా ఉండే గదులు ఎక్కువ వరకు ఖాళీ అవుతుండడం పట్నం పరిస్థితికి అద్దం పడుతున్నది.

పంటల సాగుతో చేతినిండా పని...

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద అందిస్తున్న పెట్టుబడి సాయం, కాళేశ్వరం జలాలతో చెరువులను నింపుతుండడంతో పల్లెల్లో సాగు సందడి నెలకొన్నది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలు సాగవుతున్నాయి. ఈ క్రమంలో చేతినిండా పని దొరుకుతున్నది. సాగైన పత్తి ఇప్పుడిప్పుడు మొలకెత్తుతున్నది. కలుపు తీయడం, మందులు వేయడం కోసం కూలీలకు అనుకునంత పని దొరుకుతున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ఈ వానకాలంలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 8.99 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 5,06,387 ఎకరాల్లో, సిద్దిపేట జిల్లాలో 2,35,940 ఎకరాల్లో, మెదక్‌ జిల్లాలో 1,55,981 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 87,224 ఎకరాలు, కంది 97,384 ఎకరాలు, పెసర 25,537 ఎకరాలు, మినుములు 10,099 ఎకరాలు, 52,470 ఎకరాల్లో సోయాబీన్‌, 5,88,558 ఎకరాల్లో పత్తి, 23,037 ఎకరాల్లో చెరుకు, ఇంకా వివిధ రకాల పంటలు మొత్తం 8,99,308 ఎకరాల్లో వేస్తున్నారు. ఈనెల 15 వరకు అన్ని రకాల పంటలు పూర్తిస్థాయిలో సాగుకానున్నాయి. 2,53,701 ఎకరాల్లో వరినాట్ల కోసం నారు సిద్ధం చేసుకోగా, ఇప్పటికి 87,224 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అంచనాకు మించి పంటలు సాగయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పుడు వ్యవసాయ పనులకు డిమాండ్‌ ఏర్పడింది.

గోదావరి పరవళ్లు... అన్నదాత మురిపెం...

కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాలోని చెరువుల్లోకి చేరుతున్నాయి. కొండపోచమ్మసాగర్‌, రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. కాళేశ్వరం జలాలు రావడంతో రైతులు మురిసిపోతున్నారు. ఊర్లో బతుకుదెరువు లేక పట్నంలో ఏదో పనిచేసుకుని బతికినవారంతా, ఇప్పుడు గ్రామాలకు చేరుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. పాత ఇండ్లకు సున్నాలు వేస్తున్నారు. ఎప్పుడో ఊరు విడిచిన వారు తిరిగి గ్రామాలకు వస్తుండడంతో పల్లెల్లో సందడి నెలకొంటున్నది. 


logo