బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 07, 2020 , 23:19:45

గడువులోగా పనులు పూర్తి చేయకుంటే చర్యలు

గడువులోగా పనులు పూర్తి చేయకుంటే చర్యలు

పుల్కల్‌ : గడువులోగా డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక నిర్మాణ పనులు పూర్తి చేయాలని, లేదంటే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. మండలంలోని గొంగ్లూర్‌ తండా, మిన్‌పూర్‌ గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో విశ్వప్రసాద్‌, ఎంపీవో స్వాతి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 

కొండాపూర్‌ : సంగారెడ్డి జిల్లాలో 13 లక్షల 65 వేల మంది ఉన్నారని, ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలని  కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. మంగళవారం మండలంలోని అలీయాబాద్‌ గ్రామంలో మండల జర్నలిస్టులతో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొండాపూర్‌ మండలంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డులకు సంబంధించి గ్రామాల వారీగా భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలీయాబాద్‌లో ఇప్పటికే 50 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇంకా 300 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. 

పనులు పూర్తి చేయించండి..

డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను అదేశించారు. కొండాపూర్‌ మండలంలో ఆయా గ్రామాల్లో అధికారులు అక్కడే కుర్చి వేసుకుని పనులు చేయించాలని  సూచించారు. అనంతరం తొగర్‌పల్లి గ్రామంలో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌ ఫయిం, ఎంపీపీ పట్లోళ్ల మనోజ్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఆర్‌.స్వప్న, ఉప సర్పంచ్‌ సత్యం తదితరులు పాల్గొన్నారు. 

మెగా హరితహారాన్ని 

అద్భుతంగా తీర్చిదిద్దాలి

కంది : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మెగా హరితహారం మొక్కలను సంరక్షించాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. మండలంలోని కౌలంపేట ఊదం చెరువు ప్రక్కన ఏడు ఎకరాల స్థలంలో దాదాపు 4వేల మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.  ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రిప్‌ పరికరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ షఫీ, ఎంపీడీవో జయలక్ష్మి పాల్గొన్నారు.

హత్నూర మండలం కసాలలో..

హత్నుర : గ్రామాల్లోని డంపింగ్‌ యార్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. మండలంలోని కసాల గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక, కొన్యాల డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతు వేదిక నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోనే ఈ రైతు వేదిక రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జయరాం, ఎంపీడీవో సువర్ణ, ఎంపీటీసీ విఠల్‌రెడ్డి, సర్పంచ్‌ కొన్యాల వెంకటేశం పాల్గొన్నారు.logo