ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 05, 2020 , 23:39:50

కలెక్టర్‌.. నరసింహావతారం

కలెక్టర్‌.. నరసింహావతారం

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న సర్పంచులపై మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. హరితహారం విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే సీఎం కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో కలెక్టర్‌ ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, విలేజ్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నది. అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమం అమలవుతున్నది. మెదక్‌ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, రోజు వారీగా గ్రామాల్లో కలెక్టర్‌ ధర్మారెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆకస్మికంగా గ్రామాల్లోకి వెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తున్నారు. వారం వ్యవధిలో ఒక సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు 14 మంది సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది. దీంతో సర్పంచులు అప్రమత్తమయ్యారు. గ్రామాభివృద్ధిలో పరుగులు పెడుతున్నారు. 

వేగంగా డంపింగ్‌ యార్డుల నిర్మాణం..

మెదక్‌ జిల్లాలోనే డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటి వరకు 400 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతావి చివరి దశలో ఉన్నాయి. వైకుంఠధామాలు 124 పూర్తయ్యాయి. విలేజ్‌ పార్కుల కోసం 240 గ్రామాల్లో స్థలాలు గుర్తించగా, 20 చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కూచారం గ్రామంలో పార్కు పూర్తయింది. జిల్లాలో 76 రైతు వేదికలు నిర్మాణంలో ఉన్నాయి. ఆరో విడుత హరితహారంలో మెదక్‌ జిల్లాలో 48 లక్షల మొక్క లు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శాఖల వారీగా టార్గెట్లు కేటాయించారు. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ము మ్మరంగా కొనసాగుతున్నది. 

ఆకస్మిక పర్యటనలు...

  మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి రోజువారీగా ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా గ్రామాలకు వెళ్తున్నారు. హరితహారం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. మనోహరాబాద్‌ గ్రామంలో పర్యటించిన కలెక్టర్‌, గ్రామంలో పరిస్థితిని చూసి అక్కడికక్కడే సర్పంచ్‌ మల్లేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ఇతర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు రోజుల వ్యవధిలోనే కలెక్టర్‌ మొత్తం 14 మంది సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. పాపన్నపేట, టేక్మాల్‌ మండలాల్లో నలుగురు చొప్పున సర్పంచ్‌లు షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. కాగా, కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అటు అధికారులు.. మరోవైపు ప్రజా ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ ఏ గ్రామానికి రానున్నారో..? అని ప్రజా ప్రతినిధుల్లో టెన్షన్‌ మొదలైంది. బాగా పనిచేస్తున్న సర్పంచ్‌లను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో కలెక్టర్‌ తీసుకుంటున్న కఠిన చర్యలతో అభివృద్ధి పనుల్లో వేగం పెరగనున్నది. పల్లెలు ఆదర్శంగా మారనున్నాయి. 


logo