ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jul 05, 2020 , 00:58:07

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 73 కేసులు నమోదు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 73 కేసులు నమోదు

  • n నార్సింగిలో వృద్ధురాలు మృతి
  • n జహీరాబాద్‌ మండలం రంజోల్‌లో ఒకరు.. 
  • n రోజురోజుకూ పెరుగుతున్న  కేసులు

మెదక్‌: మెదక్‌ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 52 కేసులు నమోదు కాగా, ఓ వృద్ధురాలు మృతి చెందిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయని, అందులో మెదక్‌ మండలం ర్యాలమడుగుకు చెందిన మూడేండ్ల బాలిక, పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో 15 ఏండ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. రామాయంపేటలో 42 ఏండ్ల వ్యక్తికి కరోనా రాగా, నార్సింగికి చెందిన 68 ఏండ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్‌తో మృతిచెందింది. దీంతో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు. మెదక్‌ పట్టణంలోని కోలిగడ్డ, సాయినగర్‌తోపాటు తదితర కాలనీల్లో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించామన్నారు. 

 ఉమ్మడి రామాయంపేటలో ఐదుకు చేరిన కేసులు

రామాయంపేట: నిజాంపేట మండలం నార్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరిలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆ వ్యక్తి స్వగ్రామం నార్లాపూర్‌ గ్రామానికి వచ్చాడు. వైద్యులు సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌కు తరలించారు. పట్టణానికి  చెందిన బట్టల వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి మం డలంలోని రామాయంపేటలో 30 మంది, నార్లాపూర్‌లో 9 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రామాయంపేటలో నలుగురు కాగా, నిజాంపేట మం డలంలో ఒకరికి నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. 

ర్యాలమడుగులో మూడేండ్ల బాలికకు.. 

మెదక్‌ రూరల్‌: మండలంలోని ర్యాలమడుగు గ్రామానికి చెందిన మూడేండ్ల బాలికకు  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యాపారస్తుడి వద్ద బాలిక తండ్రి గుమస్తాగా పనిచేస్తున్నాడు.  వ్యాపారస్తుడి భార్యకు వారం రోజుల కింద కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్నారి కుటుంబ సభ్యులు మూడు రోజుల కింద  నిర్వహించుకోగా, బాలికకు పాజిటివ్‌ అని తేలింది. బాలిక కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

15 ఏండ్ల బాలుడికి.. 

పాపన్నపేట: మండలంలోని పొడ్చన్‌పల్లి గ్రామానికి చెం దిన బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  బాలు డు 15 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. వైద్యులు రక్తనమూనాలు చేకరించి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పొడ్చన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు స్టాంప్‌ వేశారు.  

నార్సింగిలో వృద్ధురాలు మృతి 

చేగుంట: కరోనాతో వృద్ధురాలు మృతిచెందినట్లు నార్సింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు  తెలిపారు. నార్సింగి పట్టణానికి చెందిన (65) ఏండ్ల వృద్ధురాలు మూడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా హైదరాబాద్‌లో ఓ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. మృతిరాలి నుంచి రక్తనమూనాలు  సేకరించి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.  

5 మందికి హోంక్వారంటైన్‌కు తరలింపు 

నర్సాపూర్‌ : పట్టణంలోని జగన్నాథరావు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు  డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. వైద్య సిబ్బంది కాలనీలో వివరాలు సేకరించారు. అతడితో కలిసిన 5 మందికి ముద్రలు వేసి వారందరినీ హోంక్వారంటైన్‌కు తరలించారు. 

సిద్దిపేట జిల్లాలో 8  కేసులు  

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లాలో ఎనిమిది కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా కొవిడ్‌ -19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌లో 1, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 6, మద్దూరు మండలంలో 1 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి హోంక్వారంటైన్‌కు తరలించామన్నారు. 

గజ్వేల్‌లో మరొకరికి.. 

గజ్వేల్‌ : పట్టణంలో మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీఎంఆర్‌ కళాశాల ప్రాంతంలో నివాసముండే వ్యక్తి మూడు రోజుల కింద సిద్దిపేటలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేరాడు.  వైద్యులు పరీక్షలు నిర్వహించగా శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని గడా ప్రత్యేక వైద్యాధికారి కాశీనాథ్‌ తెలిపారు. కుటుంబ సభ్యులు ముగ్గురి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపారు. ప్రస్తుతం వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.   

కావేరి కంపెనీలో ఒకరికి.. 

వర్గల్‌: మండలంలోని గౌరారం వద్ద గల కావేరి కంపెనీలో పనిచేస్తున్న వర్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు   తెలిపారు. కంపెనీ యాజమాన్యం ముందస్తు చర్యల్లో  సిబ్బందికి రక్తనమూనా సేకరించి పరీక్షలు నిర్వహించారు.  కంపెనీలో పనిచేస్తున్న (38) ఏండ్ల  యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సదరు వ్యక్తిని చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు పంపినట్లు తెలిపారు.

హుస్నాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదు

హుస్నాబాద్‌: పట్టణంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. పట్టణంలో నివాసముండే ఓ గృహిణికి కరోనా సోకినట్లు వైద్యులు  ధ్రువీకరించారు. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న మహిళ వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స కోసం వెళ్లింది. వైద్యులు పరీక్షలు  చేయడంతో పాజిటివ్‌ వచ్చింది.  మండల వైద్యాధికారి డాక్టర్‌ సౌమ్య, ఎస్సై సుధాకర్‌ తమ సిబ్బందితో వెళ్లి బాధితురాలికి కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలు సేకరించారు.  

వ్యాపారికి కరోనా పాజిటివ్‌

చేర్యాల: పట్టణంలో ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మద్దూరు మండలంలోని నర్సాయపల్లికి చెందిన వ్యాపారి చేర్యాల పట్టణంలో నివాసముంటున్నాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు హైదరాబాద్‌ నగరంలోని కిమ్స్‌ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా, శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.  

హోం క్వారంటైన్‌కు  తరలించిన అధికారులు

నంగునూరు: మండలంలోని బద్దిపడగ గ్రామానికి చెం దిన ఓ కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన వారు గ్రామానికి వచ్చారు.  ఇంటి యజమానికి అదే రోజు కరోనా పాజిటివ్‌గా నిర్ధ్దారణ కావడంతో సెకండరీ కాంటాక్టుగా పరిగణించి వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎస్సై అశోక్‌, మెడికల్‌ ఆఫీసర్‌ రాధిక సూచించారు. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. వెంట ఆశవర్కర్‌ విజయ, హెల్త్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌ ఉన్నారు. 

 సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 13 కరోనా కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి హాస్టల్‌గడ్డ 1, నారాయణఖేడ్‌ కంగ్టి మండలం జంగి తడ్కల్‌ గ్రామంలో 1, జహీరాబాద్‌ 1, లక్డారం పెన్నార్‌ పరిశ్రమలో 2,  బీరంగూడ 4, బీడీఎల్‌ భానూర్‌ 1, జిన్నా రం 1, అమీన్‌పూర్‌ 2 మొత్తం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఇందులో నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారని, మిగతా 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు.

ఇద్దరికి కరోనా పాజిటివ్‌..

రామచంద్రాపురం: భారతీనగర్‌ డివిజన్‌లోని ఎల్‌ఐజీలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బల్దియా ఉపకమిషనర్‌ బాలయ్య తెలిపారు. తెల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో వాటర్‌ వర్క్స్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటమణికరణ్‌ తెలిపారు. వారికి ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్నవారిని కరోనా పరీక్షల కోసం కొండాపూర్‌, సంగారెడ్డి ప్రభు త్వ దవాఖానకు తరలించారు.

రంజోల్‌లో వ్యక్తి మృతి

జహీరాబాద్‌: మండలంలోని రంజోల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (56) కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. శనివారం గాంధీ దవాఖానలో మృతిచెందాడని పేర్కొన్నారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం రంజోల్‌ గ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.  


logo