సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jul 04, 2020 , 02:47:32

వరద నీటితో నారింజ ప్రాజెక్టుకు జలకళ

వరద నీటితో నారింజ ప్రాజెక్టుకు జలకళ

  • n ఏండ్ల తర్వాత నీటినిల్వ
  • n ప్రాజెక్టులో చేరిన 50 ఎంసీఎఫ్‌టీల నీరు 
  • n సంతోషంలో అన్నదాతలు..

జహీరాబాద్‌: వరద నీటి నిల్వకు 1972లో నిర్మించుకున్న ప్రాజెక్టు అది. అప్పట్లో నీటి నిల్వ ఉండి భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో రైతులు పంటలు బాగా పండించేవారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోకపోవడంతో గేట్లకు లీకేజీలు ఏర్పడి వరద నీరంతా వృథాగా కర్ణాటకవైపు మళ్లేది. దీంతో భూగర్భ జలమట్టం తగ్గి బోర్లల్లో నీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని రైతులు ప్రజాప్రతినిధులను కోరిన సందర్భాలు కోకొల్లలు. ఎవరూ పట్టించుకోక పోవడంతో నీటి వృథాను అరికట్టలేకపోయారు. కానీ, టీఆర్‌ఎస్‌ సర్కారు నారింజ ప్రాజెక్టు మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రత్యేక కృషితో రాష్ట్ర ప్రభుత్వం నారింజ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు, పూడికతీత పనులు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయా పనులు పూర్తయ్యాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. నీటిని చూసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నారింజలో 50 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ 

కోహీర్‌, జహీరాబాద్‌ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో 50 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉంది. గతంలో గేట్లకు లీకేజీలు ఉండడంతో ఈ నీరు కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలోని హళ్‌కేడ్‌ శివారులో కారింజ ప్రాజెక్టులోకి చేరింది. కాగా, నారింజ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80 ఎంసీఎఫ్‌టీలు ఉండగా, ప్రస్తుతం 59 ఎంసీఎఫ్‌టీల నీరునిల్వ ఉన్నది.  

మరమ్మతులతో మంచి రోజులు..

వానకాలానికి ముందుగానే కలెక్టర్‌ హనుమంతరావు స్పందించి గేట్లు మరమ్మతులు, పూడితీత కోసం నిధులు మంజూరు చేయించారు. పనులు చేసేందుకు పలుమార్లు ప్రాజెక్టును సందర్శంచి నీటిపారుదలశాఖ అధికారులకు సూచనలు చేశారు. పనులు వేగవంతంగా చేసేందుకు కలెక్టర్‌ పలుమార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. దీంతో ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తయ్యాయి.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

నారింజ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో వరద నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాజెక్టుతో జహీరాబాద్‌ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. జహీరాబాద్‌- బీదర్‌ రోడ్డుపై ఉన్న నారింజ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. నారింజ ప్రాజెక్టుపై రెండు, కింద రెండు చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.  - కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్‌

నారింజ ప్రాజెక్టుతో రైతులకు మేలు..

కొత్తూర్‌ (బి) శివారులోని నారింజ ప్రాజెక్టులో వాన నీరు నిల్వ ఉండడంతో ఈ ప్రాంత రైతులకు మేలు చేకూరుతుంది. వ్యవసాయ బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తుంది. ప్రభుత్వం ఉచితంగా కరెంట్‌ సరఫరా చేయడం, నారింజలో నీరునిల్వ ఉండి భూగర్భ నీటి మట్టం పెరుగడంతో భారీగా రైతులు చెరుకుతో పాటు వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంతో రైతులకు మేలు జరిగింది.  - ఉమాకాంత్‌ పాటిల్‌, సీడీసీ చైర్మన్‌ జహీరాబాద్‌logo