శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jul 01, 2020 , 03:28:47

కలవరపెడుతున్న కరోనా కేసులు

కలవరపెడుతున్న కరోనా కేసులు

  • n సంగారెడ్డి జిల్లాలో 5 కరోనా కేసులు నమోదు
  • n సిద్దిపేటలో రెండు కరోనా పాజిటివ్‌  
  • n పెరుగుతున్న కేసులతో భయాందోళన
  • సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో కొత్తగా మంగళవారం నాలుగు కరోనా కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలో అమీన్‌పూర్‌ 1, సదాశివపేట 2, బీడీఎల్‌ 1 మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వైద్యాధికారి వెల్లడించారు. వీరిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో ప్రజలను కోరారు. 

అమీన్‌పూర్‌లో మరో  కేసు.. 

అమీన్‌పూర్‌: మున్సిపల్‌ పరిధిలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. లింగమయ్య కాలనీకి చెందిన ఓ వ్యక్తి (69) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలిచారు. అతని కుటుంబ సభ్యులు 5 మందిని క్వారంటైన్‌కు తరలించారు. 

 వైద్యాధికారికి పాజిటివ్‌.. 

ఝరాసంగం: ఝరాసంగం ప్రభుత్వ దవాఖానలోని ఓ వైద్యుడికి (45) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూన్‌ 25వ తేదీన ఏడాకులపల్లిలో ఏడేండ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో సదరు వైద్యుడు సిబ్బందితో కలిసి వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసేందుకు వెళ్లాడు. 26వ తేదీన వైద్యుడు ప్రైమరీ పరీక్షలు చేయించుకున్నాడు. 29న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో ఓ దవాఖానలో చిక్సిత పొం దుతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 

 సిద్దిపేట జిల్లాలో రెండు కేసులు  

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేట జిల్లాలో మంగళవారం మరో రెండు కరోనా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.  నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో ఒకటి, గజ్వేల్‌ నియోజకవర్గంలో మరొక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. 

గజ్వేల్‌లో మరొకరికి.. 

గజ్వేల్‌/వర్గల్‌ : పట్టణంలో మరొకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయ్యప్పనగర్‌ కాలనీకి చెందిన వ్యక్తి ఇంట్లో మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు గడా ప్రత్యేక వైద్యాధికారి కాశీనాథ్‌ తెలిపారు. వర్గల్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. వర్గల్‌ అంబేద్కర్‌ చౌరస్తా ప్రాంతానికి  చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడున్నది. కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో కరోనా పరీక్షలు చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యురాలు డాక్టర్‌ హరిత తెలిపారు.  

అంతకపేట వాసికి కరోనా   

అక్కన్నపేట: మండలంలోని అంతకపేటకు చెందిన ఓ వ్యక్తి కి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ మురళికృష్ణ తెలిపారు. కాగా, సదరు వ్యక్తి మేస్త్రీ కావడంతో ఇటీవల సెం ట్రింగ్‌ చెక్క తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌కు వెళ్లి వచ్చినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల  నుంచి జ్వరం రావడంతో వరంగల్‌ ఎంజీఎంకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది.  కాగా, సదరు వ్యక్తి కొంత కాలంగా చౌటపల్లిలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తున్నాడు. మంగళవారం మండల వైద్య బృందం, పోలీస్‌, రెవెన్యూ అధికారులు చౌటపల్లి, అంతకపేటలో రసాయన మందు పిచికారీ చేయించారు. ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారనే ప్రాథమిక సమాచారం సేకరించారు. అతడిని కలిసిన వారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

తూప్రాన్‌లో  ఒకరి మృతి..

తూప్రాన్‌ రూరల్‌: పట్టణానికి చెందిన 46 ఏండ్ల వ్యా పారి మంగళవారం కరోనాతో మృతి చెందినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మృతిచెందిన వ్యక్తి  జూన్‌  25వ తేదీ నుంచి జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతడిని కుటుంబ సభ్యులు నగరంలోని కింగ్‌కోఠి దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొం దుతూ మంగళవారం మృతిచెందాడు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతుడికి కొవిడ్‌  పరీక్షలు నిర్వహించగా, రిపోర్టు రావాల్సి ఉందని, పాజిటివ్‌గా నిర్ధారణగా తేలితే మృతుడితో ప్రైమరీ, సెకండరీ కాంటక్ట్‌లో ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు.

15 రోజులు లాక్‌డౌన్‌

పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో 15రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. పట్టణంలో కంటైన్‌మెంట్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో  ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11గంటల వరకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని సూచించారు.  


logo