మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jul 01, 2020 , 03:32:54

వైద్యులే దేవుళ్లు

వైద్యులే దేవుళ్లు

నేడు జాతీయ  ‘వైద్యుల దినోత్సవం’

l రోగి ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవుడు వైద్యుడు

l వైద్య వృత్తికే వన్నె తెచ్చిన  బీదాన్‌ చంద్రరాయ్‌ 

ధరణిపై కనిపించే ప్రత్యేక్ష దైవం వైద్యుడు.., ప్రాణం పోసేది దేవుడైతే, ఆ ప్రాణాన్ని నిలబెట్టేది డాక్టర్‌. నిస్వార్థంతో పని చేస్తూ, నిండు ప్రాణానికి ఏ చిన్న ప్రమాదం జరిగినా సేవలందించేందుకు ముందుకు వస్తాడు. అటువంటి వైద్యులకు కూడా ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకుంటాం. వైద్యవృత్తికి వన్నె తెచ్చిన బీదాన్‌ చంద్రరాయ్‌ జయంతిని ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ డాక్టర్స్‌ డే నిర్వహిస్తారు.

మెదక్‌ రూరల్‌: వైద్యో నారాయణో హరిః.. వైద్యుడిని మన సమాజం పరోక్షంగా భగవత్‌ స్వరూపంగా కొనియాడుతోంది. ఆధునిక కాలంలో పేదల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో మంది వైద్యులు నిస్వార్థ సేవతో నిరంతరం కృషి చేస్తున్నారు. నేడు ‘వైద్యుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం...

పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టానికి రెండో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే పేద రోగుల పాలిట అపద్బాంధవుడిగా కొనసాగిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీదాన్‌ చంద్రరాయ్‌. బిహార్‌లోని పాట్నా సమీపంలో ఓ కుగ్రామంలో ఆయన జన్మించారు. వందేళ్ల క్రితమే రోగాలతో సతమతమవుతున్న పేదలను ఆదుకునేందుకు కృషి చేశాడు. బీసీ రాయ్‌ 1882 జూలై 1న జన్మించారు. జన్మించిన తేదీ రోజునే 80 సంవత్సరాల వయస్సులో 1962లో మృతి చెందారు. ఈ సందర్భంగా వైద్యులు జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీసీ రాయ్‌ తాను బతికున్నన్నాళ్లు రోగులు, ప్రజలకు నిస్వార్థగా సేవలందించారు. పేద రోగులు ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బీసీ రాయ్‌కు 1961 ఫిబ్రవరి 4న దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. 1976 జూలై 1న భారత ప్రభుత్వం రాయ్‌కు జాతీయ ఆవార్డును ప్రకటించింది. భారతదేశంలో జూలై 1న జరుపుకున్నట్లే ప్రపంచ దేశాల్లో వారివారి వైద్యుల స్మారకార్థం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

 రాయ్‌ చేపట్టిన బాధ్యతలు..

1922-1928 మధ్యకాలంలో కలకత్తా మెడికల్‌ జనరల్‌కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1925లో రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడయ్యారు. 1933లో కలకత్తా నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా, 1943లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1948 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 

సేవలకు అందిన అవార్డులు

విద్యా, వైద్య రంగాల్లో రాయ్‌ చేసిన సేవలకుగాను 1944లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. భారతదేశ అత్యున్నత సత్కారమైన భారతరత్న అవార్డును 1961 ఫిబ్రవరి 4న అందుకున్నారు. రాయ్‌ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది. 1976 నుంచి వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి డాక్టర్‌ బీసీ రాయ్‌ పేరిట అవార్డులను ప్రదానం చేయడం విశేషం. 

బీసీ రాయ్‌ మహోన్నత వ్యక్తి

నిరంతరం పేద రోగుల పాలిట దైవం లా కొనసాగిన బీసీ రాయ్‌ మహోన్నత వ్యక్తి. ఆయన చేసిన సేవలు మరువలేనివి. భారతదేశం గర్వించదగ్గ వైద్యుడిగా గుర్తింపునిచ్చింది. బీసీ రాయ్‌ జన్మదినాన్నే డాక్టర్స్‌డేగా జరుపుకుంటున్నాం. డాక్టర్లందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలి.  - డాక్టర్‌ చంద్రశేఖర్‌, మెదక్‌ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌

రోగులను ప్రేమతో చూడటమే వైద్య వృత్తికి ధర్మం...

డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేయరాదు. వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చవద్దు. రోగులను ప్రేమతో చూడడమే వైద్య వృత్తికి శోభనిస్తుంది. వ్యాపార ధోరణితో  సేవలు సబబు కాదు. పేదలకు మెరుగైన వైద్యం అందించినపుడు వారి కళ్లలో కనిపించే ఆనందాన్ని వర్ణించలేం.- డాక్టర్‌ శివదయాల్‌, ప్రభుత్వ దవఖాన వైద్యుడు


logo