సోమవారం 06 జూలై 2020
Sangareddy - Jun 30, 2020 , 02:36:24

ప్రతి గ్రామంలో ప్రకృతి వనం

ప్రతి గ్రామంలో ప్రకృతి వనం

  • అదనపు కలెక్టర్ నగేశ్

అల్లాదుర్గం: ప్రతి గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించి గ్రామానికి దగ్గర ఉండేలా ప్రభుత్వ స్థలాలను చూడాలన్నారు. ఎకర స్థలంలో 4వేల మొక్కలు నాటాలని, దీంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అధికారులు, సర్పంచులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీపీ అనిల్ ఎంపీడీవో విజయభాస్కర్ తహసీల్దార్ సాయాగౌడ్, ఎంపీవో సయ్యద్ పాల్గొన్నారు.

పెద్దశంకరంపేట మండలాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

పెద్దశంకరంపేట: మండలంలో 27 గ్రామపంచాయతీల్లో డంపింగ్ పూర్తి చేసుకొని మెదక్ జిల్లాలో ఆదర్శంగా నిలిచిందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన సర్పంచ్ ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మిగతా మండలాల వారు పెద్దశంకరంపేటను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. మండలంలో డంపింగ్ నిర్మాణం 100 శాతం పూర్తయిందని, వైకుంఠధామాల నిర్మాణ పనులు వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. హరితహరం పథకంలో మొక్కలను విరివిగా నాటాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత నిర్మించుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీడీవో రాజమల్లయ్య, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి ఉన్నారు. 


logo