సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jun 30, 2020 , 02:36:45

ఏక్‌ నిరంజన్‌

ఏక్‌ నిరంజన్‌

సంగారెడ్డిలో ఖాళీ అయిన కాంగ్రెస్

పరేషాన్‌లో ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి‌

సన్నిహితులు, సీనియర్‌ నేతలూ టీఆర్‌ఎస్‌లోకి..

చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్న ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్‌పై అభిమానం, అభివృద్ధిని చూసి గులాబీ దళంలోకి..

ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన మున్సిపల్‌  కౌన్సిలర్లు

తిరుగులేని శక్తిగా మారిన టీఆర్‌ఎస్‌ పార్టీ

ఉమ్మడి జిల్లాలో ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్థానం సంగారెడ్డిలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నది. పార్టీ సీనియర్‌ నాయకులు, ముఖ్యులంతా వరుసకట్టి గులాబీ దళంలో చేరిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సన్నిహితులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీ మారుతుండడంతో ఆయన పరేషాన్‌లో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గానికి ఆయన చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి చెం దిన సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులైన కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే దిక్కుతోచని స్థితిలోపడ్డారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ రెట్టిం పు ఉత్సాహంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలను సంప్రదిస్తూ అభివృద్ధి పనులకు నిధులు తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో సంగారెడ్డి ఇప్పుడు గులాబీ కోటలా మారిపోయింది. పార్టీ శ్రేణులంతా కలిసి ఉత్సాహంగా పని చేస్తున్నారు. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

సన్నిహితులు, పార్టీ ముఖ్యనాయకులు, ప్రధాన అనుచరులంతా గులాబీ కండువాలు కంపుకుంటుండడంతో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి దిగ్గుతోచని స్థితిలో పడ్డారు. నియోజకవర్గానికే వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడో ఓసారి చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే వచ్చిపోయింది కూడా ఎవరికీ తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే ఎమ్మెల్యే పరిమితమయ్యాడని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఆయన సంగారెడ్డికి వచ్చినప్పుడు పక్కనే ఉండేవాళ్లంతా ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్‌ నాయకులే విమర్శలు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్‌ మంచోడని, అభివృద్ధి కోసం మంత్రి హరీశ్‌రావును కలుస్తానని సన్మానాలు చేసిన ఆయన, అంతలోనే విమర్శలు చేస్తున్నారని సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితే ఆగంలో ఉన్నది. ఇంక ఆ పార్టీలో ఉండి ఏం చేయాలి. టీఆర్‌ఎస్‌ అద్భుతమైన అభివృద్ధి పనులు చేపడుతున్నది. అందుకే ఆ పార్టీలో చేరామని” జగ్గారెడ్డి సన్నిహితులు, ఇటీవల పార్టీలో చేరిన వారు చెబుతున్నారు. 

కరోనా సమయంలోనే కనిపించలేదు..

కరోనాతో ప్రజానీకమంతా ఆగమాగమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మానవతావాదులు తీవ్రంగా స్పందించారు. పనులు లేక ఆకలితో అలమటించే వారికి అపన్నహస్తం అందించిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లపై అన్నదానాలు పెట్టారు. పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా సంగారెడ్డి ఎమ్మెల్యే మాత్రం పెద్దగా స్పందించలేదు. కరోనా సమయంలో కూడా నియోజకవర్గానికి రాకపోవడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇదే తరుణంలో టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో పాటు పార్టీ ముఖ్యులంతా రోజువారీగా జనంలో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బియ్యం, సరుకులు, శానిటైజర్లు, మాస్క్‌లు పెద్దఎత్తున పంపిణీ చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు పేదలకు సరుకులు అందించారు. ఎక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే అసలు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయన సన్నిహితులు, పార్టీ ముఖ్యనాయకులు కాంగ్రెస్‌ను వీడిపోతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలాఉండగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా పెట్రో ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేయగా జయప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంటిముందు సైకిల్‌ తొక్కి నిరసన వ్యక్తం చేయగడం గమనార్హం.

సంగారెడ్డి ఇప్పుడంతా గులాబీమయం..

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గంలో వేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆ పార్టీ కనుమరుగవుతుండడం గమనార్హం. ఇక్కడి నుంచి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అతితక్కువ ఓట్లతో ఈ సీటు కాంగ్రెస్‌ కైవసం చేసుకున్నది. కాగా, రాష్ట్రంలో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో రూ.25 కోట్ల చొప్పున నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రైతులకు రైతుబంధు, రైతు బీమా కల్పించడంతో పాటు రుణమాఫీ కల్పించారు. ఇలా సర్కారు చేపడుతున్న కార్యక్రమాలతో ఇప్పుడంతా టీఆర్‌ఎస్‌ మయం అయ్యింది. టీఆర్‌ఎస్‌ ఏ కార్యక్రమం చేపట్టినా, గ్రాండ్‌ సక్సెస్‌ అవుతున్నది. 

త్వరలో మిగతా వారంతా...

సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలో కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నారు. వారంతా త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావును కలిసి వచ్చారు. రెండు మున్సిపాలిటీలతో పాటు నియోజవర్గ పరిధిలో పూర్తిస్థాయిలో ఒకేసారి మిగిలిన కాంగ్రెస్‌ నాయకులంతా గులాబీ కండువాలు కప్పుకోనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చేరేవారిలో కూడా ఎమ్మెల్యే సన్నిహితులు ఉన్నారు. కింది నుంచి పైవరకు కాంగ్రెస్‌ పరిస్థితి ఆగంలో ఉన్నదని, ఆ పార్టీ బతికిబట్టకడుతుందనే నమ్మకం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ తరుణంలో ఇంకా ఆ పార్టీలో ఉండడం ఎందుకని సదరు నాయకుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. త్వరలోనే మళ్లీ చేరికలు ఉన్నాయని టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా చెబుతున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఇక ఖాళీ అయిపోయినట్లేనని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

సన్నిహితులూ ‘చెయ్యి’స్తున్నారు..

కాంగ్రెస్‌ నాయకులు కారెక్కుతున్నారు. ఆ పార్టీ మనుగడ ఇక కష్టమని నిర్ణయించుకుని వరుసకట్టి గులాబీ దళంలో చేరిపోతున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు తోడు రోజురోజుకూ కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థకు చేరుతుండడంతో గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో ఇటీవల పెద్దఎత్తున చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాన అనుచరుడు కౌన్సిలర్‌ శేఖ్‌ సాబేర్‌ మంత్రి సమక్షంలో కారెక్కారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌ ముంతాజ్‌ బేగం, కౌన్సిలర్‌ విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు అమీర్‌బేగ్‌, శేఖర్‌, కుమార్‌, కసిని శ్రీకాంత్‌, సీనియర్‌ నాయకులు మోహన్‌, బర్ల భిక్షపతి, సంజీవ్‌, లక్ష్మణ్‌తో పాటు పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వీరికంటే ముందే జగ్గారెడ్డి ప్రధాన అనుచరుడు, టీజేఎస్‌ యువసేన అధ్యక్షుడు, బ్లాక్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు తన సన్నిహితులతో కలిసి మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. సదాశివపేటతో పాటు కొండాపూర్‌, కంది, సంగారెడ్డి మండలాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులంతా అధికార పార్టీలో చేరిపోయారు. logo