బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jun 28, 2020 , 23:07:26

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

జహీరాబాద్‌: రైతు వేదిక భవన నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు భూములు  అప్పగించి, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని రం జోల్‌, చిన్న హైదరాబాద్‌, హోతి(బి) గ్రామాల్లో భూములను పరిశీలించారు. ప్రభుత్వం రైతు వేదిక భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో భవనానికి రూ.22 లక్షలు మంజూరు చేసిందని, ప్రతి భవన నిర్మాణానికి 20 గుంటల భూమి కేటాయిస్తామన్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి వెంటనే భూములు వ్యవసాయ శాఖకు అప్పగించాలని సూచించారు.  కలెక్టర్‌ వెంట వ్యవసాయశాఖ జిల్లా అధికారి నరసింహారావు, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, పీఆర్‌ ఏఈ కోటేశ్వర్‌రావుతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 

నారాయణఖేడ్‌ : డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని  అదనపు కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. ఆదివారం ఆయన జడ్పీటీసీ లక్ష్మీబాయితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించడంతోపాటు రైతువేదికల నిర్మాణాలను ప్రారంభించారు.మండలంలోని జూకల్‌, కాంజీపూర్‌, కొండాపూర్‌, అబ్బెంద, హంగిర్గ(కె), హంగిర్గ(బి), గోప్యానాయక్‌తండా, జి.హుక్రానా గ్రామాలను సందర్శించారు. కాంజీపూర్‌లో ఇప్పటివరకు డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణాలను ప్రారంభించకపోవడంపై పంచాయతీ కార్యదర్శి శంకర్‌కు షోకాజ్‌ నోటీసు జారీచేశారు. జూకల్‌ గ్రామంలో రైతువేదిక నిర్మాణాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో 40 రోజుల్లో రైతువేదికల నిర్మాణాలు పూర్తికావాలన్నారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి మల్లేశం, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్‌, వ్యవసాయాధికారి శంకర్‌, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌చౌహాన్‌, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

గొర్రెకల్‌, దేవునూర్‌లో రైతువేదికల పనుల పరిశీలన

వట్‌పల్లి: మండలంలో రైతువేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గొర్రెకల్‌, దేవునూర్‌ గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే రైతు వేదికల నిర్మాణాల కోసం స్థలాలను ఎంపిక చేయగా, పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం దేవునూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణాలపై చర్చించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌, ఎంపీటీసీలకు సూచించారు. 

 పనులపై జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ఎల్లయ్య సంతృప్తి   

రాయికోడ్‌ : జిల్లాలో రాయికోడ్‌ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సంగాపూర్‌లో నిర్మాణం చేపడుతున్న వైకుంఠధామాలు, డంపింగ్‌యారు,్డ పార్కు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం పరిధిలో 31 పంచాయతీల్లో 29 గ్రామాల్లో వైకుంఠధామాలు, డం పింగ్‌ యార్డులు పూర్తయినట్లు తెలిపారు. మహిబాత్‌పూర్‌, శంశోద్దిన్‌పూర్‌ గ్రామాల్లో పనులు  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మండలంలోని 7 రైతు వేదికలు వేగవంతంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. 

డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

టేక్మాల్‌: మెదక్‌ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దడానికి డంపింగ్‌ యార్డులను త్వరితగతిన పూర్తిచేయాలని, లేకపోతే సర్పంచ్‌లపై వేటు తప్పదని అదనపు కలెక్టర్‌ నగేష్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేగోడ్‌లో వందశాతం, అల్లాదుర్గంలో 99శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు.  మొక్కలను విరివిగా నాటాలన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాలను పెంచడానికి ఎకరం స్థలాన్ని కేటాయించి 4వేల మొక్కలను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హిరణ్మయి, ఎంపీవో బలరాం, ఏపీవో పౌలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.logo