సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jun 28, 2020 , 23:02:45

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 3 కరోనా కేసులు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 3 కరోనా కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం అమీన్‌పూర్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, జిన్నారంలో ఒకటి నమోదైందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ వెల్లడించారు. ఇటీవల నారాయణఖేడ్‌ మండలం నిజాంపేటలోని ఏడు నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌ నమోదైన విషయం తెలిసిందే. కాగా, బాలుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6 మంది కరోనాతో మృతిచెందారు. ఇందులో సదాశివపేట 1, జహీరాబాద్‌ 1, సంగారెడ్డి చింతల్‌పల్లి 1, ఆర్‌సీపురం 1, హత్నూర 1, నారాయణఖేడ్‌ కరోనా సోకిన బాలుడితో సహా 6 మంది మృతిచెందారని వైద్యాధికారుల వెల్లడించారు.

గుర్రాలగొందిలో కరోనా కలలకం

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధ్దారణ అయిందని మెడికల్‌ ఆఫీసర్‌ సరిత తెలి పారు. గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సిటిజన్‌ అమెరికా దవాఖానకు వెళ్లింది. వైద్యులు రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.   కరోనా పాజిటివ్‌గా నిర్ధ్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు సదరు మహిళ కుటుంబంతో పాటుగా పలువురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

చేర్యాల: కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని చేర్యాల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ పీపీపీ యూనిట్‌ వైద్యాధికారి అశ్వినిస్వాతి, ఎస్సై మోహన్‌బాబు కోరారు. పట్టణంలోని అంగడి బజారులో ఓ యువకుడికి ఈ నెల 27వ తేదీన కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆ ప్రాంతంలో మున్సిపల్‌ సిబ్బందితో శానిటైజేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ కరోనా సోకిన యువకుడు ప్రైమరీ కాంటాక్ట్స్‌గా చేర్యాలలో 6, మద్దూరులో 1, నంగునూరు మండల కేంద్రంలో 1, చేర్యాల మండలంలోని ముస్త్యాలలో 1 వ్యక్తి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాగే, సెకండరీ కాంటాక్ట్స్‌లో 18 మందిని గుర్తించామని, అందులో చేర్యాల 9, ముస్త్యాల 4, నంగునూరు 3, మద్దూరు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వ్యక్తులు 14 రోజుల పాటు స్వీయనిర్భందంలో ఉండాలని ఆదేశించారు.   

కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు 

సిద్దిపేటటౌన్‌/సిద్దిపేట కలెక్టరేట్‌: కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు సామాజిక మాధ్యమాలు, లోకల్‌ యాప్‌లు, వాట్సాప్‌ల్లో తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. గ్రూపుల్లో  పోస్టులు పెడితే  పోలీస్‌ స్టేషన్‌,  వాట్సాప్‌ నంబర్‌ 7901100100కు సమాచారం అందించాలన్నారు. ఎవరు కూడా వివాదాస్పద పోస్టులు పెట్టకుండా పోలీసుల సూచనలు పాటించాలన్నారు. కాగా, సిద్దిపేట పట్టణంలోని సాజీద్‌పూరలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.


logo