శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jun 25, 2020 , 23:54:16

పల్లెలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దుతాం

పల్లెలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దుతాం

గుమ్మడిదల : జిల్లావ్యాప్తంగా పల్లెలను ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని అన్నారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ తిరుమలవాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డీపీవో మాట్లాడారు. ఆరో విడుత హరితహారంలో జిల్లావ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రామాల్లో 6 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలు నాటేందుకు సిద్దిపేట, మెదక్‌, తెల్లపూర్‌ ప్రాంతాల్లో 3 లక్షల మొక్కలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని 647 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామాల జనాభా ప్రకారం, 5 వేలు, 30 వేలు, 50 వేల మొక్కల సామర్థ్యం గల నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రంలో మియావాకీ విధానాన్ని ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ పార్కులుగా మారుస్తామన్నారు. ప్రతి పంచాయతీ నర్సరీ, పార్కుతో ప్రకృతి వనాలుగా మారనున్నాయని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఉపసర్పంచ్‌ మురళి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.