మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jun 25, 2020 , 23:33:55

సీఎం సమావేశంలో నవ్వుల్‌..పువ్వుల్‌

సీఎం సమావేశంలో నవ్వుల్‌..పువ్వుల్‌

  • నర్సాపూర్‌ ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కులో ఆరో విడుత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సహజ సిద్ధమైన అడవులు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలారావాలు..  ఆహ్లాదానికి నెలవు.. అందాల కలబోతైన నర్సాపూర్‌ ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కు మురిసిపోయింది. హరితహారం రూపకర్త, ఆకుపచ్చ తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్‌ రాకతో పులకించింది. ఇక్కడే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం అల్లనేరేడు మొక్కనాటి ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఈ పార్కును ఆయన ప్రారంభించారు. “పోయిన అడవులు వాపస్‌ రావాలి. హరితహారం కార్యక్రమం అందుకు దోహదం కానుంది. అడవులను కొల్లగొట్టే వారి ఆటలు ఇక సాగనివ్వం. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.” అని ఇక్కడి నుంచి స్మగ్లర్లకు సీఎం గట్టి హెచ్చరిక పంపారు. మొక్కలు నాటి  భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దామని ఈ సందర్భంగాపిలుపునిచ్చారు. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ నర్సాపూర్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నర్సాపూర్‌ ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కును ప్రారంభించి, మొక్క నాటిన తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాటలతో ప్రజా ప్రతినిధులు నవ్వుల వర్షం కురిపించారు. 

l నేనూ రైతునే 50 ఎకరాల్లో వరినాటేసిన అని సీఎం అన్నారు. సన్నరకం సాగుచేశారా..? అని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అనడంతో కలెక్టర్‌ అలాట్‌ చేసినట్లే వరి సాగుచేశానని సీఎం బదులివ్వడంతో నవ్వులు విరిశాయి.

l కరోనా కాలంలో ఇలా కోట్లు ఇస్తే అందరూ నన్ను తిడతారని సీఎం అనడంతో, మాకు ఇవ్వరా..? అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అనడంతో ‘ఇగో చూశారా’.. అని సీఎం అనడంతో అందరూ నవ్వారు. 

l మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ(పటాన్‌చెరు)ను చూస్తూ ఆయన ఎంత పంట వేశాడో నాకు తెలియదు, నేను ఎంత పట వేశానో ఆయనకు తెలియదనడంతో అందరూ ఆయన వైపు చూశారు.

l దేవేందర్‌రెడ్డి(నర్సాపూర్‌) చూస్తుండు నాకు యాదికి ఉంది. నీకు పదవి రావాలే, వస్తది అని సీఎం భరోసా ఇచ్చారు.

l మురళీయాదవ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యిండు. నర్సాపూర్‌ను బాగా చేయాలని కోరాడు.

l ఏం అడగమని రమ్మన్నారు. దొడ్లోకి వచ్చిన బర్రె పెండపెట్టదా..? అన్నట్లు కాగితాలు ఇచ్చిండ్రు. అని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని ఉద్దేశించి అనడంతో అందరూ గొల్లున నవ్వారు. ఇక తప్పుతుందా అంటూ నర్సాపూర్‌కు నిధులు కేటాయించడంతో ప్రజాప్రతినిధులు చప్పట్ల వర్షం కురిపించారు. 

l 92 వేల ఎకరాల నర్సాపూర్‌ను అడవిని పునరుద్ధరించుకోవాలి, బాగుచేసుకుందామా..? అని సీఎం అనడంతో ప్రజాప్రతినిధులంతా చేతులెత్తి కాపాడుకుంటాం సార్‌ అని నినాదాలు చేశారు.

l సునీతారెడ్డి(మాజీ మంత్రి), మదన్‌రెడ్డి(ఎమ్మెల్యే) అందరూ కలిశారు. ఇంకేముందు కలిపి పనిచేసి నర్సాపూర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దండి అని సీఎం కోరారు.

l మంత్రి హరీశ్‌రావు నిండిన చెరువులు, చెక్‌డ్యాముల వెంట తిరుగుతున్నడు. ఇగో ఇది ఎకనామీ అంటే అని సీఎం అనడంతో అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. 

l మాసాయిపేటను మండలం చేయమని కోరగానే, అయిపోతుందిలే అని సీఎం అధికారులను ఆదేశించడంతో ప్రతినిధులు మురిసిపోయారు.

l ఇచ్చిన నిధులతో సర్పంచ్‌లే పనిచేసేకునేలా చూడాలని కలెక్టర్‌ ధర్మారెడ్డిని ఆదేశించడంతో, కేసీఆర్‌ నాయకత్వం వర్థిల్లాలి అంటూ ప్రతినిధులు నినాదాలు చేశారు. 

l నీళ్లు వస్తే సునీతాకో, మదన్‌రెడ్డికో కాదు, వేలాది మంది రైతులు పంటలు పండుతాయి అని కేసీఆర్‌ అన్నారు.

l పాన్‌షాప్‌ ఉన్నోడు అయినా, వాచ్‌మెన్‌ అయినా పర్వలేదు. కానీ, వ్యవసాయం చేసేవాడంటే ముఖం అటుపెట్టి మాట్లాడే పరిస్థితులు ఉండేవని సీఎం గుర్తుచేశారు.


logo