శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jun 25, 2020 , 02:30:59

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నర్సాపూర్‌: 

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1765 ఎకరాల్లో నర్సాపూర్‌ ఆర్బన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్‌, అడవుల పునరుజ్జీవంలో భాగంగా ఇక్కడ చేపడుతున్న కార్యక్రమాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ ఇక్కడకు చేరుకుంటారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం పార్కులో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ అల్లనేరేడు మొక్క నాటనున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కూర్చునే వేదిక, ఇతర ఏర్పాట్లను ఇద్దరు మంత్రులు పరిశీలించారు. 

అల్లనేరేడు మొక్కలు నాటనున్న సీఎం...

నర్సాపూర్‌ అర్బన్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ అల్లనేరేడు మొక్క నాటనున్నారు. ఈ మేరకు అధికారులు అల్లనేరేడుతో పాటు ఇతర రకాల మొక్కలను అందుబాటులో ఉంచారు. దాదాపుగా నిర్మాణం పూర్తి కావస్తున్న అర్బన్‌ పార్కులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయా నిర్మాణాలకు ఆకర్షణీయమైన రంగులు వేశారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి కూడా సీఎంతో ఉండనున్నట్లు అధికారులు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కొంత మందికి మాత్రమే అనుమతి ఉన్నదని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆయా వర్గాలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి ఇద్దరు మంత్రులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన గేటు, వంతెన, వాచ్‌ టవర్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఎకరా స్థలంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కలను చూశారు. సీఎం కూర్చునే వేదిక ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు రావద్దని అధికారులకు వారు సూచించారు. 

ఉమ్మడి జిల్లాలో 1.67 

కోట్ల మొక్కల లక్ష్యం

ఆరో విడుతలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1.67 మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్‌ నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌లో మొక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ వెంటనే జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటనున్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు శాఖల వారీగా టార్గెట్లు పెట్టారు. హరితహారంలో నిర్లక్ష్యం వహించవద్దని, మున్సిపల్‌, కొత్త రెవెన్యూ చట్టాలతో ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను పరిరక్షించని క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారుల పదవులు పోయే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ నుంచి మూడు జిల్లాలో లక్షలాది గుంతలు తీసి సిద్ధం చేశారు. 


logo