మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jun 24, 2020 , 01:08:20

ప్రేమ పెండ్లికి.. ఆర్థికమస్తు

ప్రేమ పెండ్లికి.. ఆర్థికమస్తు

  •   కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహకం 
  • రూ.50వేల నుంచి రూ.2.50 లక్షలకు ఆర్థిక సాయం పెంపు  

మెదక్‌ : కులాంతర వివాహాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రోత్సాహకాన్ని పెంచుతూ బతుకుపై భరోసా కల్పిస్తున్నది. ప్రోత్సాహకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకునే వెసులుబాటును కల్పించింది. 2011 సంవత్సరం వరకు కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.10వేల ప్రోత్సాహకం ఇచ్చింది. 2012 నుంచి రూ.50వేలు అందజేస్తున్నది. 2019 నవంబర్‌ తర్వాత ఈ మొత్తాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. 

తగ్గుతున్న కులాంతర వివాహాలు.. 

మెదక్‌ జిల్లాలో కులాంతర వివాహాలు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్నాయి. 2016-17లో కులాంతర వివాహం చేసుకున్న వారి సంఖ్య 8 కాగా, 2017-18 నాటికి రెండుకు తగ్గింది. 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 జూన్‌ వరకు ఏడుగురు మాత్రమే ప్రేమ వివాహాలు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కులాంతర వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వ  సహకారం అందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘కల్యాణలక్ష్మి’తోపాటు ప్రోత్సాహకం..

కులాంతర వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తున్నట్లు సంబంధిత శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి పథకం ద్వారా లక్షా116 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. కులాంతర వివాహం చేసుకున్న జంటకు ‘కల్యాణలక్ష్మి’ నుంచి అందించే సాయంతోపాటు అదనంగా రూ.50 వేలను అందజేస్తూ వచ్చింది. అయితే తల్లిదండ్రుల సహకారం లేని ప్రేమ వివాహాలకు ‘కల్యాణలక్ష్మి’ సాయం అందడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రూ.50 వేలు అందించే ప్రోత్సాహకాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. దీంతో కులాంతర వివాహాలు చేసుకునేవారికి ప్రభుత్వం అందించే సాయం వరంగా మారింది. 

ప్రోత్సాహకం పెంపు..

రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఇదివరకు రూ.50వేలు అందిచగా, ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచింది. ప్రభుత్వ నిర్ణయంతో కులాంతర వివాహాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

- జయరాజ్‌, షెడ్యూల్డ్‌ కులాల ఇన్‌చార్జి అధికారి


logo