సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jun 24, 2020 , 00:57:05

పైసలొచ్చినయి

పైసలొచ్చినయి

ఖాతాల్లోకి సాయం.. కర్షకుల హర్షం

n ట్రెజరీల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం

n అన్నదాతలకు అందుతున్న పెట్టుబడి డబ్బులు

n ఉమ్మడి జిల్లాలో 8.06 లక్షల మంది రైతులు

n రైతులకు అందనున్న  రూ. 896 కోట్ల సాయం

n సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన రైతులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతుబంధు డబ్బులు రావడంతో రైతాంగంలో సంతోషం నెలకొన్నది. సీఎం కేసీఆర్‌ ఉండగా.. మాకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని రైతులు భరోసాతో ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించిన రైతుల జాబితా ప్రకారం ట్రెజరీలకు పంపి, అక్కడి నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుబంధు డబ్బులు వేస్తున్నారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న వారు కూడా పెట్టుబడి సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అందరికీ ‘రైతుబంధు’...

పట్టాదారు పాసుపుస్తకం ఉండి, సాగుచేస్తున్న రైతులందరికీ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈ వానకాలానికి సంబంధించి ఈనెల 22 నుంచి బ్యాంకు ఖాతాల్లో సాయం డబ్బులు వేస్తున్న విషయం తెలిసిందే. గుంట నుంచి భూమి ఉన్న ప్రతి రైతుకు పట్టుబడి సాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జాబితాలను ట్రెజరీలకు పంపుతున్నారు. కొందరికి మాత్రమే డబ్బులు వస్తాయని జరుగుతున్న ప్రచారం సరికాదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతులకే రూ.896 వరకు కోట్లు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నది. దీనిని బట్టి రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ సర్కారు ఎంతగా కృషిచేస్తున్నదో అర్థమవుతున్నది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు రూ.385 కోట్లు, సిద్దిపేట రూ.311 కోట్లు, మెదక్‌ జిల్లాకు రూ.200 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందనున్నది. జూన్‌ 16, 2020 వరకు కొత్త పాసుపుస్తకాలు వచ్చిన రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు అధికారులు సూచించారు. దాదాపుగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చేసుకోని రైతులు ఉంటే, ప్రత్యేకంగా రైతులకు ఫోన్లు చేసి ఏఈవోలు సమాచారం అందిస్తున్నారు. 

సర్కారు సాయం గొప్పది...

కరోనా మహమ్మారి అన్నిరంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్‌డౌన్‌తో ఎన్నో రంగాలు, సంస్థలు ఆగమయ్యాయి. ఇలాంటి ఆపత్కాలంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. యాసంగికి సంబంధించి గ్రామాల్లోనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ రైతుల నుంచి సేకరించారు. పంట ఉత్పత్తులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం వేసింది. ఇప్పుడు రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నది. సర్కారు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇవ్వడానికి జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నారు. త్వరలో రైతు వేదికలు నిర్మాణం కానున్నాయి. రైతుబంధు సమితులు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రైతులకు సంబంధించి ప్రతి విషయంలో ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచించి అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నది. 

‘సాయం’ సంబురం..

సిద్దిపేట రూరల్‌/ టేక్మాల్‌/ తూప్రాన్‌ రూరల్‌: కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నా, రైతులకు అండగా నిలుస్తూ వానకాలం పంట ప్రారంభంలోనే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకులో జమ చేసినందుకు అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడు గ్రామంలో సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే, టేక్మాల్‌ మండల పరిధిలోని బొడ్మట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జోగిపేట మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, పార్టీ గ్రామాధ్యక్షుడు భూషణం, నాయకులు షాబుద్దీన్‌, దశరథ్‌గౌడ్‌, విఠల్‌, సాయిప్రసాద్‌, శంకర్‌ ఉన్నారు. తూప్రాన్‌ మండల పరిధిలోని యావాపూర్‌లో రైతుబంధుపై సంతోషం వ్యక్తం చేస్తూ నర్సాపూర్‌ డివిజన్‌ ఆత్మకమిటీ వైస్‌చైర్మన్‌ బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ లక్ష్మి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు పిట్ల సింహం, రైతులు యంజాలస్వామి, కుమార్‌, సింహం, పలువురు రైతులు పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లాకు రూ.311 కోట్లు 

సిద్దిపేట జిల్లాలోని రైతులకు రైతుబంధు డబ్బులను రెండు రోజుల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 2020-21 ఏడాది వానకాలం సంబంధించి ఎకరాకు ప్రతి రైతుకు రూ.5వేల చొప్పున రైతుబంధు వేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో 2,77,628 మంది రైతులున్నారు. వీరందరికీ రైతుబంధు వర్తిస్తుంది. జిల్లాకు రూ.311కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు రంగారెడ్డి ట్రెజరీ నుంచి రూ.266 కోట్లు జిల్లాలోని 2,48,279 మంది రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారు. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన వారికి సైతం రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. విడుతల వారీగా రోజుకు కొంతమంది రైతుల చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తారు. 

- శ్రవణ్‌కుమార్‌, సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

రైతు బంధుతో జిల్లా రైతులకు ప్రయోజనం

రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే మెదక్‌ జిల్లాలోని లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. వానకాలం పంటలకు సంబంధించి రైతుబంధు నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 2,16,195 మంది రైతులకు రూ.200 కోట్లు విడుదలయ్యాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఏఈవోలు పనిచేశారు.

- పరశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

సీఎం కేసీఆర్‌ సారుకు ధన్యవాదాలు

సీఎం కేసీఆర్‌ రైతుపక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నరు. కరోనా నేపథ్యంలో  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.5వేలు చొప్పున పడ్డట్లు నాకు మెసేజ్‌ వచ్చింది. ప్రతిపక్షాలు రైతుబంధు రాదని చెప్పినప్పటికీ, సీఎం కేసీఆర్‌ మాత్రం రైతుల సంక్షేమానికి పెట్టుబడి సాయం ఇచ్చి రైతుల మదిలో నిలిచిపోయారు. 

- రాములు, పైతర గ్రామం, కొల్చారం మండలం

పెట్టుబడులకు బాధపడొద్దని..

కరోనా వైరస్‌తో ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ సీఎం కేసీఆర్‌సార్‌ ఆదుకుంటున్నరు. పంట పెట్టుబడుల కోసం బాధ పడొద్దంటూ మంచి మనస్సుతో ఎకరానికి రూ.5 వేలు బ్యాంకుల్లో వేసిండు. మా రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌సార్‌ చల్లగుండాలి.

- దార మల్లయ్య, రైతు, మిరుదొడ్డి

సాగు మొదలయ్యే సమయానికి..

కరోనా వల్ల కష్టకాలమొచ్చింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం లేదు. మాకు రైతుబంధు డబ్బులు వస్తాయో, రావో అనుకున్నం. కానీ, సీఎం కేసీఆర్‌ అవేవీ పట్టించుకోకుండా రైతుల మేలు కోసం ఖాతాల్లో నగదు జమ చేశారు. మా పాలిట ముఖ్యమంత్రి సారే దేవుడు. ఇంతటి కష్ట కాలంలో, సాగు మొదలయ్యే సమయానికి సాయం చేసి ఆదుకున్నడు. రైతుల కోసం ఇంతగా కష్టపడుతున్న ఆయనకు నిజంగా రుణపడి ఉంటాం. - సత్యనారాయణ, రైతు, వడక్‌పల్లిlogo