శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jun 22, 2020 , 23:31:14

అప్రమత్తంగా ఉండాలి..

 అప్రమత్తంగా ఉండాలి..

  • మిడుతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక  
  • ఆరు మండలాల్లో  దాడికి ఏర్పాట్లు  
  • జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్‌  హనుమంతరావు 

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డి జిల్లాలో జూలై 5వ తేదీలోపు మిడుతల దండు ప్రవేశించే అవకాశమున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పోలీసు, అగ్నిమాపక, వ్యవసాయ, ఉద్యాన, అటవీ, పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కర్నాటక సరిహద్దులోని ఆరు మండలాల్లో మిడుతల దండు ప్రవేశించే అవకాశమందని చెప్పారు. నారాయణఖేడ్‌ డివిజన్‌లో నాగిలిగిద్ద, ఔదాత్‌పూర్‌, గొడేజన్‌వాడ, కరస్‌గుత్తి, ఏస్గీ, కారముంగి, షాపూర్‌, శాంతినగర్‌ తండా, మొర్గి, కంగ్టి మండలం దేగుల్‌వాడి, చందర్‌ తండా, సిద్దన్‌ గిర్గా, నాగూర్‌ కె, బాబుల్‌గాన్‌, జహీరాబాద్‌ డివిజన్‌లోని మొగుడంపల్లి మండలం గౌసాబాద్‌ తండా, ధనశ్రీ, మాడ్గి, జాడి మాల్కాపూర్‌, ఔరంగానగర్‌, జహీరాబాద్‌ మండలం సత్వార్‌, చిరాగ్‌పల్లి, బూర్దిపాడ్‌, బూచినెల్లి, కోహీర్‌ మండలం సిద్దాపూర్‌ తండా, మనియార్‌పల్లి, న్యాల్‌కల్‌ మండలంలోని శంషల్లాపూర్‌, రాజోల, మాల్గి, హుస్సేన్‌ నగర్‌, కల్బెమల్‌, డప్పూర్‌, రత్నాపూర్‌, హుసెల్లి, గణేశ్‌పూర్‌ గ్రామాలకు మిడుతల దండు వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. మిడుతల దండు ప్రవేశించే గ్రామాలు, మండల స్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.  హ్యాండ్‌ స్ప్రేయర్లు, జెట్టి మిషన్లు,  అందుబాటులో ఉంచాలన్నారు.   సరిహద్దు నుంచి 150, 200, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల జాబితా మ్యాప్‌లను తయారు చేయాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి సూచించారు.  అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ రాజర్షి షాను ఆదేశించారు. అన్ని గ్రామాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరిం చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జడ్పీ సీఈవో టి.రవి, అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు, వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. 

‘పచ్చని తోరణాలు’గా కనిపించాలి 

గుమ్మడిదల/  జిన్నారం/సంగారెడ్డి :  ఆరో విడుత హరితహారాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మంభాపూర్‌ అటవీ ప్రాంతాన్ని  అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లతో కలిసి ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. సెక్షన్‌ అధికారి మంజీత్‌ సింగ్‌, సిబ్బందితో మాట్లాడుతూ మంభాపూర్‌ సమీపంలో ఉన్న 8 సర్వే నంబర్‌లో  స్థలం ఖాళీగా ఉండటంతో ఆప్రాంతమంతా మొక్కలతో పచ్చని తోరణాలుగా కనిపించాలని అన్నారు.  హరితహారంలో విరివిగా మొక్కలు నాటి అడవులను అభివృద్ధ్ది చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పాటు ఎంపీడీవో చంద్రశేఖర్‌, జడ్పీటీసీ కుమార్‌ గౌడ్‌, సర్పంచ్‌ కంజర్ల శ్రీనివాస్‌, జీపీ కార్యదర్శి స్వప్న తదితరులు ఉన్నారు.

రెండు గ్రామాలను పరిశీలించిన కలెక్టర్‌..

 హరితహారంలో భాగంగా ఖాజీపల్లి, శివానగర్‌ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సోమవారం కలెక్టర్‌ స్థలాలను పరిశీలించారు. రెండు గ్రామాల్లో అనువైన స్థలాలను గుర్తించేందుకు అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌లతో కలిసి పర్యటించారు. ఖాజీపల్లిలో సూచించిన స్థలం అనువుగా లేకపోవడంతో మరో చోట స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్‌ రెవెన్యూ అధికారులు, సర్పంచ్‌కు సూచించారు. సర్పంచ్‌ చిట్ల సత్యనారాయణ శివానగర్‌ గ్రామంలోని చెల్కన్‌ చెరువు సమీపంలోని సర్వేనంబర్‌ 114లో గల స్థలాన్ని  సూచించారు. సర్వే అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు. ఆయన వెంట  తహసీల్దార్‌ దశరథ్‌, ఎంపీడీవో సుమతి, సర్పంచ్‌ శివరాజ్‌, నాయకులు కృష్ణ, మహేశ్‌, ఇంతియాజ్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని చాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో  హరితహార  పోస్టర్‌ను ఆవిష్కరించారు. 


logo