ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 22, 2020 , 23:12:55

ఇక మురుగు కనుమరుగు

ఇక మురుగు కనుమరుగు

l గజ్వేల్‌లో చకచకా  అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు

l రూ.100 కోట్లతో ప్రారంభమైన పనులు

l మలి విడుతలో రూ.48 కోట్లు కేటాయింపు

l మురుగు నీటిశుద్ధికి ఎస్టీపీ ప్లాంట్లు

l నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు

గజ్వేల్‌: ఆరేండ్లలో ఊహించని విధంగా గజ్వేల్‌ పట్టణ విస్తరణ జరిగింది. అనేక రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోనే గజ్వేల్‌ను ఓ మోడల్‌ సిటీగా మార్చాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు పట్టణంలో తిరిగి పట్టణాభివృద్ధికి తగిన ప్రణాళికలను తయారు చేశారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎడ్యుకేషన్‌ హబ్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ యార్డు, ఐవోసీ, ఆడిటోరియం, వంద పడకల జిల్లా దవాఖాన, పాండవుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా సుందరీకరణ, ఇంటింటికీ సమృద్ధిగా మిషన్‌ భగీరథ నీటి సరఫరా, నాలుగు, ఆరులైన్ల ఇంటర్నల్‌ రోడ్ల విస్తరణ, గ్రీనరీ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాట్ల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. రింగ్‌రోడ్డు, ఆర్బన్‌పార్క్‌, రైలు సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానున్నాయి. హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, మొక్కలను నాటి ప్రజల్లో చైతన్యం నింపారు. కొత్తగా చేరిన గ్రామాలతో పాటు గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

రూ.148 కోట్లతో యూజీడీ పనులు...

గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.148 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అన్ని వీధుల్లో రూ.100 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గత నెల 31న మంత్రి హరీశ్‌రావు రాజీవ్‌పార్క్‌ రోడ్డు వీధిలో పనులను ప్రారంభించగా, పనులు పూర్తి కావచ్చాయి. అలాగే, కొన్ని వీధుల్లో ఇప్పటికే సీసీ రోడ్లు ఉండటంతో వాటిని తవ్వి డ్రైనేజీని నిర్మిస్తున్నారు. 

ఆర్‌అండ్‌ఆర్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీల్లో ముందే ఏర్పాటు..

గజ్వేల్‌ పట్టణం పక్కనే మరో హైటెక్‌ పట్టణంగా నిర్మాణమవుతున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో ఇప్పటికే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. సుమారు 7 వేలకు పైగా నిర్మిస్తున్న ‘డబుల్‌' ఇండ్లు వినియోగంలోకి వస్తే గజ్వేల్‌ పట్టణ రూపు రేఖలు మారనున్నాయి. ప్రస్తుతం చుట్టుపక్కల రోడ్ల విస్తరణతో పాటు ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతుండడంతో పట్టణ విస్తరణ మరింత వేగం పుంజుకుంటున్నది.

ప్లాంట్‌తో మురుగు కనుమరుగు..

గజ్వేల్‌ పట్టణంలో మురుగు నీటిని శుద్ధి చేసే నాలుగు ప్రత్యేక ప్లాంట్లను నిర్మించనున్నారు. ఈ ప్లాంట్లతో మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇతర అవసరాలకు వాడుకునే వీలు కలుగుతుంది. ప్రతిరోజు సుమారు 32 లక్షల లీటర్ల నీటిని ఎస్‌టీపీ ప్లాంట్లతో శుద్ధి చేయబడి సాధారణ నీరుగా మారుతుంది. ఈ నీటిని మొక్కలకు, వ్యవసాయానికి వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మురుగు ద్వారా కంపో స్టు ఎరువును తయారు చేసుకోవడం వల్ల మున్సిపాలిటీకి మరింత ఆదాయం పెరుగనున్నది. కాగా, ఈ పనులను పూర్తి చేయడానికి 15 నెలల గడువు ఉన్నా, ఏడాది లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

అగ్రభాగాన నిలిపేందుకు...

గజ్వేల్‌ పట్టణం అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గజ్వేల్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులు అడుగకుండానే ఊహకందని విధంగా భారీగా నిధులను మంజూరు చేశారు. ఇంకా గజ్వేల్‌కు ఏం కావాలో సారే నిర్ణయించి మంజూరు చేస్తారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీతో గజ్వేల్‌ పట్టణం రాష్ట్రంలో మరో రికార్డును సొంతం చేసుకోనున్నది.  - ఎన్సీ రాజమౌలి మున్సిపల్‌ చైర్మన్‌  

గడువుకు ముందే పనులు పూర్తి.. 

గజ్వేల్‌లో గడువుకు ముందే యూజీడీ పనులు పూర్తి చేస్తాం. పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని బ్యాచ్‌లు రాగానే మరిన్ని వీధుల్లో పనులు మొదలవుతాయి. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ను ఆదర్శంగా మార్చాలని కృషి చేస్తున్నారు. స్థానికులు, నాయకుల సహకారం, అధికారుల సమన్వయం ఎంతో అవసరం.

- ప్రతాప్‌ ఈఈ, ప్రజారోగ్యం సంగారెడ్డి


logo