శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jun 22, 2020 , 02:40:57

చిరుధాన్యాల సాగుపై అన్నదాతల ఆసక్తి

 చిరుధాన్యాల సాగుపై అన్నదాతల ఆసక్తి

 కంది, పెసర, మినుము, జొన్న పంటల సాగుకు ప్రభుత్వ  ప్రోత్సాహం

వ్యవసాయరంగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. అన్నదాతలకు మేలు జరుగాలన్న సదుద్దేశంతో నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. భూమి సారం, నీటి లభ్యతను బట్టి ప్రాధాన్యతా పంటలను సాగు చేసుకుంటే అధిక లాభాలను పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుధాన్యాలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నది. వర్షాధార పంటలైన చిరుధాన్యాల సాగువైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆసక్తి ఉన్న రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌లో ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సాగు విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

జహీరాబాద్‌ :  చిరుధాన్యాలను సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో రైతులూ ఆసక్తి చూపుతున్నారు.  ఎర్ర, నల్లరేగడి నేలల్లో వర్షాధారంతో పండిస్తారు. మూడు నెలల కాలవ్యవధిలోనే పంట చేతికొస్తుంది.  జహీరాబాద్‌ వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌లో చిరుధాన్యాల విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నారు. 

చిరుధాన్యాల సాగు వైపు రైతుల చూపు..

అంతరించి పోతున్న జీవవైవిధ్య పంటలైన పచ్చజొన్న , తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, కాకిముట్టనిజొన్న, తెల్లకొర్ర, మంచికొర్ర, నల్లకొర్రలు, ఎర్రకొర్రలు, తెల్లతైద, ఎర్రతైద, నల్లసామ, కోడిసామ, ఆర్గులు, సజ్జలు, మంచిపెసరి, గంగపెసరి, బాలెంతపెసరి, తీగపెసరి, దేశీమినుములు, గడ్డినువ్వులు, తెల్లజమాల్‌ నువ్వులు, ఎర్రతొగరి, బుర్కతొగరి, తెల్లతొగరి, నల్లతొగరి, తెల్ల అనుములు, నల్లఅనుములు, ఎర్రఅనుములు, ఎర్రబెబ్బర్లు, తెల్లబెబ్బర్లు, బైలుమక్కలు, ఉలువలు (ఎర్రవి, తెల్లవి, నల్లవి) ఎర్రపుండి, తెల్లపుండి, పెద్దబయిముగు, బైలు నల్లబుడ్డివడ్లు, బైలు ఎర్రవడ్లు, బైలుతెల్లబుడ్డవడ్లు, బైలు ఉల్లిగడ్డ పంటలను సాగు చేస్తున్నారు. సాయిజొన్నలు, యాసంగి ఎర్రజొన్న, ప్యాలాలజొన్న, దేశీ శనిగలు (ఎర్రవి, నల్లవి, తెల్లవి) పంటలు పండిస్తున్నారు. ఆవాలు దేశీ మిరప, దనియాలు, నల్లముల్లు గోధుమ, కట్టెగోధుమలు, బుడ్డగోధుమ, శిరి శనగ (నల్లవి, చిన్న, పెద్దవి), లంకలు, అవిశలు తదితర పంటలు సాగు చేసి జీవవైవిధ్య పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

పత్తి సాగుకు  ప్రోత్సాహం

వానకాలంలో బిందు సేద్యంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎకరాకు 15-16 క్వింటాళ్ల దిగుబడి సాధించేలా సాగు విధానాన్ని తెలుపుతున్నారు.   ఎరువులు, విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. 

అవగాహన కల్పించాం..


 ప్రభుత్వం తెలిపిన పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వర్షాకాలంలో పత్తి, పెసర, మినుము, కంది, జొన్న, సోయా పంటలు సాగు చేసేందుకు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు మట్టి పరీక్షలు చేసి వాటి ఫలితాల కార్డులను పంపిణీ చేశాం. మొక్కజొన్న సాగును తగ్గించేందుకు రైతులకు అవగాహన కలిపిస్తున్నాం.

-భిక్షపతి ,ఏడీఏ జహీరాబాద్‌